ఘనంగా ‘వనవీర’ ట్రైలర్ ఆవిష్కరణ

ఘనంగా ‘వనవీర’ ట్రైలర్ ఆవిష్కరణ

Published on Dec 27, 2025 1:00 PM IST

vsa

సెన్సార్ బోర్డు సూచనల మేరకు ‘వానర’ సినిమా టైటిల్‌ను ‘వనవీర’గా మారుస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అవినాష్ తిరువీధుల స్వీయ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సిల్వర్ స్క్రీన్ సినిమాస్ బ్యానర్‌పై శంతను పత్తి తదితరులు నిర్మిస్తున్నారు. సిమ్రాన్ చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. జనవరి 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. హీరో కిరణ్ అబ్బవరం డిజిటల్ మాధ్యమం ద్వారా ట్రైలర్‌ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా దర్శకుడు, హీరో అవినాష్ మాట్లాడుతూ.. విడుదలకు కేవలం ఐదు రోజుల ముందు టైటిల్ మార్చమనడం చిన్న సినిమాల నిర్మాతలకు పెనుభారమని ఆవేదన వ్యక్తం చేశారు. ‘వానర’ అంటే హనుమంతుడి ప్రస్తావన వస్తుందని, సినిమాలో కులం, రాజకీయాల వంటి సున్నిత అంశాలు ఉన్నందున టైటిల్ మార్చాలని సెన్సార్ సభ్యులు సూచించారని తెలిపారు. గద్దలకొండ గణేష్ తరహాలో చివరి నిమిషంలో టైటిల్ మారినప్పటికీ, కంటెంట్‌పై తమకు పూర్తి నమ్మకం ఉందన్నారు.

ఈవెంట్‌కు అతిథిగా వచ్చిన నిర్మాత రాజేష్ దండా మాట్లాడుతూ.. గ్రామీణ నేపథ్యంలో మైథాలజీ టచ్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో సీజీ వర్క్ అద్భుతంగా ఉందని ప్రశంసించారు. సీనియర్ ఆర్టిస్టులు ప్రచారానికి రాకపోయినా, మంచి కథతో వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర బృందం విశ్వాసం వ్యక్తం చేసింది.

తాజా వార్తలు