మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికివరకూ చాలా మంది హీరోలు తెలుగు తెరకు పరిచయమై మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు అదే ఫ్యామిలీ నుంచి హీరో నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న సంగతి మనకు తెలిసిందే. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న వరుణ్ తేజ్ మొదటి సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. గత కొద్ది రోజులుగా ఈ సినిమా టైటిల్ విషయంలో పలు పేర్లు వినిపిస్తున్నాయి.
ఈ రోజు శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా హీరో వరుణ్ తేజ్ తన మొదటి సినిమా టైటిల్ ని అనౌన్స్ చేసారు. ‘నా మొదటి సినిమాకి ‘ముకుందా’ అనే టైటిల్ ని ఫైనలైజ్ చేసామని’ వరుణ్ తేజ్ ట్వీట్ చేసాడు. అలాగే ఈ మూవీ ఫస్ట్ లుక్ ని చిరంజీవి బర్త్ డే కానుకగా ఆగష్టు 22న రిలీజ్ చేయనున్నారు, మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ ఆడియో రైట్స్ ని ఆదిత్య మ్యూజిక్ వారు సొంతం చేసుకున్నారు.
ఈ సినిమాకి సంబందించిన టాకీ పార్ట్ మొత్తం పూర్తయ్యింది. సినిమాలో మిగిలి ఉన్న 3 పాటలను ప్రస్తుతం షూట్ చేస్తున్నారు. గోదావరి బ్యాక్ డ్రాప్ లో తెలుగు కుటుంబ అనుబంధాల నేపధ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఠాగూర్ మధు సమర్పణలో నల్లమలపు బుజ్జి నిర్మిస్తున్నారు.


