వరుణ్ తేజ్ ‘కంచె’ షూటింగ్‌కు లాస్ట్ డే!

వరుణ్ తేజ్ ‘కంచె’ షూటింగ్‌కు లాస్ట్ డే!

Published on Jul 6, 2015 12:10 PM IST

kanchae
మెగా ఫ్యామిలీ నుంచి కొత్తగా లాంచ్ అయిన డైనమిక్ హీరో వరుణ్ తేజ్ అప్పుడే తన రెండో సినిమాను కూడా చివరి దశకు తీసుకొచ్చేశాడు. మొదటి సినిమా ‘ముకుందా’తోనే హీరోగా మంచి మార్కులు కొట్టేసిన వరుణ్, ‘గమ్యం’, ‘వేదం’, ‘కృష్ణం వందేజగద్గురుమ్’ లాంటి విలక్షణ సినిమాలతో మెప్పించిన దర్శకుడు క్రిష్‌తో ‘కంచె’ పేరుతో తన రెండో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే! కొద్దిరోజుల క్రితం జార్జియాలో ఓ భారీ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న సినిమా యూనిట్ ఈమధ్యే హైద్రాబాద్‌కు షిఫ్ట్ అయింది.

ఇక హైద్రాబాద్‌లో ప్రస్తుతం జరుగుతున్న ఈ షెడ్యూల్‌ చివరిది కాగా, నేటితో ఈ షెడ్యూల్ మొత్తం పూర్తి కానుంది. ఇక నేటి షూట్ తర్వాత కంచె సినిమాకు గుమ్మడికాయ కొట్టేస్తారు. షూటింగ్ చివరి రోజుకు చేరుకున్న సందర్భంగా వరుణ్ తేజ్ ట్విట్టర్‌లో తన అనుభూతిని పంచుకున్నారు. “నిన్ననే షూటింగ్ మొదలైనట్లుంది. అప్పుడే షూటింగ్ పూర్తైందంటే ఆశ్చర్యంగా ఉంది. డైరెక్టర్ క్రిష్, ఇంకా సినిమా టీమ్ అంతా బాగా సహకరించార”ని ఈ సందర్భంగా వరుణ్ అన్నారు. ఇక ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన ప్రగ్య జైశ్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. రాజీవ్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాను దసరాకు విడుదల చేశేలా ప్లాన్ చేస్తున్నారు.

తాజా వార్తలు