తెలుగు చిత్ర పరిశ్రమకి ఒక పిల్లర్ గా నిలిచిన లెజండ్రీ నిర్మాత, దాదా సాహెబ్ పాల్కే అవార్డు గ్రహీత, మూవీ మొఘల్ డా. డి. రామానాయుడు కొద్ది సేపటి క్రితమే కన్నుమూశారు. గత కొంత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయనకి చికిత్స జరుగుతోంది. హీరో రాజశేఖర్ కూడా కొద్ది రోజులు రామానాయుడుకి ట్రీట్ మెంట్ చేసారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆయన తెలుగు చిత్ర సీమని వీడి స్వర్గస్తులైనారు.
1936 జనవరి 6న కారంచేడు గ్రామంలో ఆయన జన్మించారు. సినిమాల మీద ఉన్న మక్కువతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంటర్ అయిన రామనాయుడు 1963లోఅనురాగం సినిమాకి సహా నిర్మాతగా వ్యవహరించారు. ఆ తర్వాత 1964లో సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా ‘రాముడు – భీముడు’ సినిమాతో నిర్మాతగా మారాడు. అక్కడి నుంచి మొదలైన ఆయన ప్రస్థానంలో ఎన్నో మరపురాని సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. రామానాయుడు ఒక్క తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ్, మలయాళం, బెంగాలీ, మరాఠీ, పంజాబీ మొదలైన భాషల్లో సినిమాలను చేసారు. ఒకే నిర్మాణ సంస్థలో భారతదేశంలోని 13 భాషల్లో సినిమాలు చేసిన రామానాయుడు పేరుని గిన్నీస్ బుక్ అఫ్ రికార్డ్స్ లో కూడా పొందుపరిచారు. తెలుగు పరిశ్రమకి ఒక పిల్లర్ లా నిలించిన డా. డి. రామనాయుడు కన్ను మూయడంతో తెలుగు దగ్గుబాటి కుటుంబ సభ్యులు మాత్రమే కాకుండా తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రతి ఒక్కరూ తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. టాలీవుడ్ లో ఇక ఎంతమంది నిర్మాతలు వచ్చినా ఆయన లేని లోటుని తీర్చలేరనేది మాత్రం అందరూ అంగీకరిచాల్సిన విషయం.
ఇలా అందరినీ వీడి పైలోకాలకు చేరిన డా.డి. రామానాయుడు మృతి సందర్భంగా మేము తీవ్ర దిగ్బ్రాంతి చెందుతూ, 123తెలుగు.కామ్ తరపున దగ్గుబాటి కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలియజేస్తున్నాం.


