విహాన్ కార్తీక్, దివ్య విశ్వకర్మ జంటగా నటిస్తున్న ఫాంటసీ థ్రిల్లర్ చిత్రం ‘కెరూబ్’. ఖుషి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై బాలు బల్లెకారి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎం.జె. నాయుడు (జీవన్) దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ కాపీ సిద్ధం చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. అనుకూలమైన పరిస్థితులు ఉంటే ఈ ఏడాది సెప్టెంబర్‌లో చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేసేందుకు నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు.
చిత్ర ప్రమోషన్లలో భాగంగా ఇటీవల ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. జలపాతం, ప్రకృతి ఒడిలో కథానాయకుడు వేణువు వాయిస్తున్న దృశ్యంతో రూపొందించిన ఈ పోస్టర్‌కు, అలాగే అంతకుముందు విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి సానుకూల స్పందన లభించిందని చిత్రబృందం తెలిపింది.
ఈ సినిమాలో కల్పలత, సుమన్ శెట్టి, రమేష్ కొనంభొట్ల, గడ్డం సురేష్, శ్రీధర్ మాడ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సత్య రాధాకృష్ణ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రమేష్ తోకల ఛాయాగ్రహణం వహించారు. సెన్సార్ ప్రక్రియ పూర్తయిన వెంటనే అధికారికంగా విడుదల తేదీతో పాటు మరిన్ని వివరాలను వెల్లడించనున్నట్లు చిత్రబృందం తెలిపింది.


