తమిళ సినీ పరిశ్రమలో ఈ ఏడాది అత్యంత ప్రతిష్టాత్మక సినిమాగా చెప్పబడుతోన్న సినిమా ‘పులి’. ఇలయదళపతి విజయ్ హీరోగా రూపొందిన ఈ భారీ బడ్జెట్ సినిమాపై అంతటా విపరీతమైన అంచనాలున్నాయి. సుమారు 100 కోట్లకు పైనే బడ్జెట్‌తో తెరకెక్కడం, నటి శ్రీదేవి చాలా కాలం తర్వాత సౌతిండియన్ సినిమాలో కనిపించనుండడం, విజయ్ కెరీర్లో నిలిచిపోయే సినిమాగా ప్రచారం జరుగుతూండడం లాంటి విశేషాలన్నీ ఈ సినిమాకు తమిళ నాట ఒక ప్రత్యేకతను తెచ్చిపెట్టాయి.
తెలుగులోనూ ఈ సినిమాకు మంచి క్రేజ్ ఉండడంతో ఎస్వీఆర్ మీడియా ఈ సినిమాను తెలుగులో పెద్ద ఎత్తున విడుదల చేసేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఇక సెప్టెంబర్ 17న వినాయక చవితి సందర్భంగా ఈ సినిమా రిలీజ్ను ఎప్పుడో ప్లాన్ చేయగా, తాజాగా సినిమాను అక్టోబర్ 1వ తేదీకి షిఫ్ట్ చేశారు. భారీ విజువల్ ఎఫెక్ట్స్‌తో రూపొందుతోన్న ఈ సినిమాకు సంబంధించిన సీగీ వర్క్ ఇంకా పూర్తి కాకపోవడంతో సినిమాను అక్టోబర్ నెలకు షిఫ్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో రెండు వేలకు పైగా వీఎఫ్ఎక్స్ షాట్స్ ఉన్నాయి. సెప్టెంబర్ వరకు ఇవి పూర్తయ్యే అవకాశం కనిపించకపోవడంతో సినిమాను అక్టోబర్ నెలకు వాయిదా వేసినట్లు పులి యూనిట్ తెలిపింది.


