విభిన్న చిత్రాల ద్వారా, విభిన్న పాత్రల ద్వారా దేశం గర్వించదగ్గ నటుల్లో ఒకరుగా నిలిచిన నటుడు.. కమల్ హాసన్. ఆయన హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన సినిమా ‘విశ్వరూపం 2’ విడుదలకు సిద్ధమౌతోంది. నిజానికి ఈ సినిమాను ఏప్రిల్ 13న విడుదల చేయడానికి ఎప్పట్నుంచో సన్నాహాలు చేశారు. అయితే విజువల్ వండర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి కావడానికి చాలా సమయం పట్టనున్నందున సినిమాను జూన్ నెలకు వాయిదా వేశారు.
అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా పట్ల కమల్ పూర్తి శ్రద్ధ పెట్టారు. విశ్వరూపం 2కి మొదటి భాగం విడుదలైనపుడు ఎంతటి వివాదం సృష్టించిందో తెలిసిందే. ఇప్పుడీ కొత్త సినిమా మరింకెంత వివాదం సృష్టిస్తుందోనని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఇప్పటికే ‘ఉత్తమ విలన్’ సినిమాను పూర్తి చేసిన కమల్, ఏప్రిల్ 10న ఆ సినిమాను విడుదల చేయనున్నారు. ఇక ఆ తర్వాత పాప వినాశనం సినిమాపై పనిచేయనున్నట్లు సమాచారం.


