సినిమా కొనమని ఎవర్నీ బలవంతపెట్టలేదు – ‘ఆఫీసర్’ చిత్ర నిర్మాత
Published on Jun 4, 2018 5:06 pm IST

నాగార్జున తాజా చిత్రం ‘ఆఫీసర్’ బాక్సాఫీస్ వద్ద విఫలమైన సంగతి తెలిసిందే. సాధారణ ప్రేక్షకుల సంగతి అటుంచితే సినిమా కనీసం అభిమానులకు కూడ నచ్చలేదు. ఈ చిత్ర పరాజయానికి రకరకాల కారణాలున్నా వాటిలో ప్రధానంగా ఎలివేట్ అవుతున్నది మాత్రం రామ్ గోపాల్ వర్మ దర్శకత్వ లోపమే.

ఇదిలా ఉండగా సినిమాను కొనమని చిత్ర నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లపై ఒత్తిడి తెచ్చారని, కొన్ని ఏరియాల్లో అధిక ధరకు అమ్మడం వలన పంపిణీదారులు దారుణంగా నష్టపోయారని రకరకాల వార్తలు వినిపిస్తుండగా చిత్ర నిర్మాత సుధీర్ చంద్ర వాటిపై స్పందించారు.

సినిమా బాక్సాఫీస్ వద్ద ఫైనాన్షియల్ గా, క్రియేటివ్ గా విఫలమైందనే విషయాన్ని తాము కూడ అంగీకరిస్తామని, ఈ పరాజయం సినిమాకు పనిచేసిన అందర్నీ నొప్పించిందని అన్న ఆయన సినిమాను కొనమని డిస్ట్రిబ్యూటర్లను బలవంతపెట్టిన మాట అవాస్తవమని, దయచేసి మీడియా ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి వార్తల్ని ప్రచురించడం న్యాయం కాదని అన్నారు.

అలాగే ఆంధ్రప్రదేశ్ లో కేవలం 5 జిల్లాలు మినహా మిగిలిన అన్ని చోట్ల చిత్రాన్ని తామే స్వయంగా విడుదలచేశామని, ఎక్కువ ధరకు హక్కుల్ని అమ్ముకున్నామనే మాట అవాస్తవమని క్లారిటీ ఇచ్చారు. అంతేగాక కొన్నిసార్లు సినిమాలు విఫలమవుతుంటాయని, ఇది కూడ అలాంటిదేనని, కానీ కొన్ని కారణాల వలన ఈ చిత్రం వర్మకు ప్రత్యేకమైనదని తాము నమ్ముతున్నామని అన్నారు.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook