ఇప్పుడు దేశమంతా ‘బాహుబలి’ ఫీవర్ పట్టుకుందన్న విషయం ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. దర్శకుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘బాహుబలి ది బిగినింగ్’ విడుదలకు దగ్గరవడంతో సినిమా యూనిట్ ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఈ కార్యక్రమాల్లో భాగంగా బాహుబలిని హిందీలో విడుదల చేస్తున్న ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహర్ నిర్వహించే ‘ఫిల్మ్ కాంపానియన్’ అనే టాక్ షోలో రాజమౌళి పాల్గొన్నారు.
ఈ షోలో మాట్లాడుతూ.. “బాహుబలి కోసం రెండున్నరేళ్ళుగా అందరం ఎంతో కష్టపడ్డాం. ఇప్పుడీ సినిమాకు ఈ స్థాయి ప్రచారం జరుగుతోందంటే అది మా అదృష్టం” అంటూ బాహుబలి విశేషాలను పంచుకున్నారు. ఇక ఇదే షోలో బాలీవుడ్ పరిశ్రమ గురించి మాట్లాడుతూ.. ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’, ‘లగేరహో మున్నాభాయ్’, ‘3 ఇడియట్స్’, ‘పీకే’ సినిమాలతో దేశంలోని టాప్ దర్శకుల్లో ఒకరుగా పేరొందిన రాజ్‌కుమార్ హిరాణికి తాను అతిపెద్ద అభిమానినని రాజమౌళి అన్నారు. ఇక ప్రభాస్, రానా, అనుష్క తమన్నాలు ప్రధాన పాత్రల్లో నటించిన ‘బాహుబలి’ సినిమా తెలుగు, తమిళ, మళయాల, హిందీ భాషల్లో జూలై 10న భారీ ఎత్తున విడుదల కానున్న విషయం తెలిసిందే!


