లాక్ డౌన్లో పెళ్లి చేసుకున్న మరొక పాపులర్ హీరోయిన్

Published on Jun 4, 2021 9:08 pm IST

లాక్ డౌన్లో పలువురు హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకుని అభిమానులకు సర్ప్రైజ్ ఇస్తున్నారు. కొన్నిరోజుల క్రితమే హీరోయిన్ ప్రణీత సుభాష్ గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేసేసుకోగా ఇప్పుడు మరొక హీరోయిన్ కూడ వివాహం చేసేసుకుంది. ఆమె యామీ గౌతమ్. టాలీవుడ్, బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమైన యామీ గౌతమ్ బాలీవుడ్ దర్శకుడు ఆదిత్య ధర్ ను వివాహమాడింది. కొన్ని గంటల క్రితమే వీరి పెళ్లి జరిగింది. ఈ విషయాన్ని యామీ గౌతమ్‌ సోషల్‌ మీడియా ద్వారా అభిమానులకు వెల్లడించింది. వైవాహిక బంధంలోకి అడుగు పెట్టామంటూ భర్తతో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేసుకుంది.

ఫెయిర్ అండ్ లవ్లీ ప్రకటనతో బాగా పాపులర్ అయిన యామీ కన్నడలో హీరోయిన్ గా పరిచయమై తెలుగులో ‘నువ్విలా, గౌరవం, కొరియర్ బాయ్ కళ్యాణ్’ లాంటి సినిమాల్లో కథానాయకిగా నటించింది. హిందీలో ‘విక్కీ డోనార్’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు మూడు సినిమాలున్నాయి. ఆదిత్య ధర్ ‘ఉరీ’ చిత్రంతో మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఈ సినిమాలో నటించేటప్పుడే యామీ, ఆదిత్యల మధ్యన ప్రేమ మొదలైంది. ఇన్నాళ్లు డేటింగ్లో ఉన్న వారిద్దరూ ఇప్పుడు వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

సంబంధిత సమాచారం :