యువ దర్శకుడి వివాహానికి ముహూర్తం ఖరారు

Hanu-Raghavapudi
‘అందాల రాక్షసి’, ‘కృష్ణగాడి వీరప్రేమ గాథ’ లాంటి సినిమాలతో దర్శకుడిగా తనదైన మార్క్ సృష్టించుకున్న హను రాఘవపూడి, త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నారు. హైద్రాబాద్‌కు చెందిన డాక్టర్ అమూల్యతో హను వివాహం ఈనెల 26న హైద్రాబాద్‌లో జరగనుంది. పలువురు సినీ ప్రముఖులు హాజరు కానున్న ఈ వేడుకను ఓ స్టార్ హోటల్లో వైభవంగా నిర్వహించనున్నారు. ఓ కార్పోరేట్ హాస్పిటల్‌లో డాక్టర్‌గా పనిచేస్తోన్న అమూల్యతో మే నెలలో హను నిశ్చితార్థం జరగ్గా, తాజాగా ఆగష్టు 26వ తేదీకి వివాహ ముహూర్తం ఖరారు చేశారు.

ఇక హను సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం నితిన్‌తో ఓ సినిమా చేయనున్న ఆయన, ఆ తర్వాత వెంటనే అఖిల్‌తో మరో సినిమా చేసేలా సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇటు కెరీర్ పరంగా సూపర్ సక్సెస్‌లో ఉన్న హను, వ్యక్తిగత జీవితంలోనూ ఓ కొత్త ప్రయాణం మొదలుపెట్టనున్న సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేద్దాం.