‘పిల్లా.. నువ్వులేని జీవితం’ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన మెగా హీరో సాయిధరమ్ తేజ్. మొదటి సినిమా ఇచ్చిన ఉత్సాహంతో వరుస సినిమాలతో బిజీ అయిపోయిన ఈ హీరో, ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’తో మరో నాలుగు రోజుల్లో థియేటర్లలో సందడి చేయనున్నారు. ఇక ఇదిలా ఉంటే.. ఓపక్క ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ సినిమాను విడుదలకు సిద్ధం చేసి, మరోపక్క ‘తిక్క’ అనే సినిమా షూటింగ్ పూర్తి చేస్తూనే మరో రెండు సినిమాలను కూడా లైన్లో పెట్టి సాయిధరమ్ తేజ్ సూపర్ ఫాస్ట్‌గా దూసుకుపోతున్నారు.
ఇప్పటికే ప్రముఖ నిర్మాత దిల్‌రాజుతో ‘పిల్లా నువ్వులేని జీవితం’, ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ అంటూ రెండు సినిమాలు చేసిన తేజ్, దిల్‌రాజుతోనే మరో రెండు సినిమాలకు ఒప్పందం కుదుర్చుకోవడం ఆసక్తికరంగా మారింది. ఈ రెండు సినిమాల్లో ‘సుప్రీమ్’ పేరుతో రూపొందనున్న సినిమాకు ‘పటాస్’ ఫేం అనిల్ రావిపూడి దర్శకుడు. సెప్టెంబర్ 23న ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో లాంచనంగా ప్రారంభించనున్నారు. అక్టోబర్ 5నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఇక సాయిధరమ్ తేజ్ హీరోగా దిల్‌రాజు నిర్మించనున్న మరో సినిమా ‘శతమానం భవతి’కి సతీశ్ వేగేశ్న దర్శకత్వం వహించనున్నారు.
