సమీక్ష : 302 – బోరింగ్ క్రైమ్ డ్రామా

విడుదల తేదీ : మార్చి 13, 2020

123తెలుగు.కామ్ రేటింగ్ : 1.5/5

నటీనటులు :  విజయ్ సాయి(లేటు ), రవి వర్మ, వెన్నెల కిషోర్, భవిక దేశాయ్, తాగుబోతు రమేష్, వేణు, నవీన్ నేని, టిల్లు వేణు, రాకేష్ తదితరులు

దర్శకత్వం : కార్తికేయ మిర్యాల

నిర్మాత‌లు : అవినాష్ సుందరపల్లి

సంగీతం :  రఘురామ్

సినిమాటోగ్రఫర్ : కళ్యాణ్ సామీ

ఎడిటర్ : కె ఆర్ స్వామి

దివంగత నటుడు విజయ్ సాయి, భవిక జంటగా తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ 302.దర్శకుడు కార్తికేయ మిర్యాల తెరకెక్కించిన ఈ చిత్రం నేడు విడుదలైంది. మరి ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం…

 

కథ:

మధ్య తరగతి కుటుంబానికి చెందిన అవంతిక(భవిక దేశాయ్) ధనవంతుడు అయిన రాజ్(రవి వర్మ)ను ప్రేమిస్తుంది. రాజ్ ను ఓ హోటల్ లో కలవడానికి వెళ్లిన అవంతికకు ఆమెను మోసం చేసి అతను అమెరికా వెళ్ళిపోబోతున్నాడు అని తెలుసుకుంటుంది. ఈ విషయమై వారిద్దరి మధ్య జరిగిన ఘర్షణలో రాజు ఆమె చేతిలో ప్రాణాలు కోల్పోతాడు. అదే హోటల్ లో బాయ్ గా పనిచేస్తున్న విక్కీ (విజయ్ సాయి)కి అప్పటికే అవంతిక పై ప్రేమ ఉండడం వలన ఆమెను ఆ సమస్య నుండి బయటపడేసే బాధ్యత తీసుకుంటాడు. హోటల్ గదిలోని రాజ్ శవాన్ని ఏం చేశారు? ఆ మర్డర్ కేసు నుండి అవంతికను విక్కీ ఎలా కాపాడాడు? అన్నదే మిగతా కథ.

 

ప్లస్ పాయింట్స్ :

వ్యక్తి గత కారణాలతో 2017లో ఆత్మ హత్య చేసుకున్న విజయ్ సాయి ఈ చిత్రంలో హీరోగా చేశారు. మొదటి చూపులోనే హీరోయిన్ పై మనసు పారేసుకుని ఆమెను సమస్య నుండి బయటపడవేసే ప్రేమికుడిగా ఆయన నటన ఆకట్టుకుంది.

ఇక హీరోయిన్ భవిక దేశాయ్ గ్లామర్ రోల్ లో ఆకట్టుకుంది. ఆమె ఎమోషన్స్ సైతం చాలా వరకు పలికించారు. మతిమరుపు కలిగిన వ్యక్తిగా సెకండ్ హాఫ్ లో వెన్నెల కిశోర్ రోల్ కొంచెం ఉపశమనం ఇస్తుంది.

సినిమాలో పాటలు బాగున్నాయి. రవి వర్మ, టిల్లు వేణు, నవీన్ నేని, జబర్దస్త్ రాకేష్, తాగుబోతు రమేష్ తమ పాత్రల పరిధిలో ఆకట్టుకున్నారు.

 

మైనస్ పాయింట్స్ :

ఇది ఎప్పుడో విడుదల కావాల్సిన చిత్రం కారణాలేమైనా చాలా కాలం తరువాత విడుదలైన ఈ చిత్రం ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. సినిమా అసలు ఏ జోనరో కూడా అర్థం కానీ పరిస్థితి.

కథకు అందులోని పాత్రలకు కూడా సంబంధం లేకుండా ఈ సినిమా సాగింది.మధ్య మధ్య లో ఓ పోలీస్ వచ్చి రౌడీలను విరగొట్టి వెళ్లిపోతుంటారు.అతనికి ఈ సినిమాతో ఉన్న సంబంధం ఏమిటో తెలియని పరిస్థితి.

కథకు, సన్నివేశాలకు పొంతన లేకుండా వేటికవే వచ్చివెళ్లిపోతుంటాయి. వెన్నెల కిషోర్, తాగుబోతు రమేష్, టిల్లు వేణు వంటి నటులను సరిగా వాడుకోలేకపోయారు.

ఈ సినిమాలో కథ, కథనం అర్థం చేసుకోవడానికే ప్రేక్షకులకు పూర్తి సమయం సరిపోతుంది.

 

సాంకేతిక విభాగం:

పాటలు బాగున్నాయి… బీజీఎమ్ అసలు ఆకట్టుకోదు. ఎడిటింగ్ మరియు కెమెరా వర్క్ ఘోరంగా ఉన్నాయి. మినిమమ్ నిర్మాణ విలువలు కూడా పాటించలేదు.

ఇక దర్శకుడు ఈ చిత్రంతో ఏం చెప్పాలనికున్నాడో క్లైమాక్స్ వరకు అర్థం కాలేదు. కథలో కామెడీ సృష్టించడాని ఆయన రాసుకున్న సన్నివేశాలు, పాత్రలు సినిమాను ఎటునుండి ఎటు తీసుకెళుతున్నాయో తెలియని పరిస్థితి. సినిమాలో అసలు ఫ్లో లేదు.

 

తీర్పు:

302 మూవీ నిర్జీవంగా సాగే క్రైమ్ డ్రామా అని చెప్పాలి. ఆకట్టుకోని కథనం పొంతన లేకుండా సాగే సన్నివేశాలు ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడతాయి. హీరోయిన్ గ్లామర్, వెన్నెల కిశోర్ ప్రజెన్స్ కొంచెం ఆహ్లాదం కలిగించే అంశాలు. అంతకు మించి ఈ చిత్రంలో చెప్పుకోదగ్గ అంశాలేవీ లేవు. రెండు గంటలు 302 మూవీని భరించడం కష్టమే..!

123telugu.com Rating : 1.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం :

More