సమీక్ష : 6 – సస్పెన్స్ థ్రిల్లర్ అనుకుంటే…

విడుదల తేదీ: 26 అక్టోబర్ 2012
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5
దర్శకుడు : శ్రీకాంత్ లింగాడ్
నిర్మాత : బొల్లెమోని కృష్ణా
సంగీతం: రవివర్మ
నటీనటులు : జగపతి బాబు, గాయత్రి

జగపతి బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘6’. ఇది వరకూ ఎవరికీ తెలియని ఓ కథతో తెరకెక్కించాము అన్న ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శ్రీకాంత్ లింగాడ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి రవి వర్మ సంగీతం అందించారు. గాయత్రి అయ్యర్ కథానాయికగా నటించారు. ఎవరికీ తెలియని విషయం చూపిస్తున్నాం అన్న ఈ సినిమాలో అసలు ఏమి చూపించాడో, సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం…

కథ :

నల్లమల అడవుల్లో ఉరవకొండ అనే గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలోని ప్రజలు బాహ్య ప్రపంచానికి సంబందం లేకుండా బతుకుతుంటారు. అందరికీ రోజుకు 24 గంటలు ఉంటే ఆ గ్రామానికి మాత్రం రోజంటే 12 గంటలే. ఆ గ్రామంలోని వారు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే బయట గడుపుతారు. సాయంత్రం 6 దాటితే అందరూ ఇళ్లలోనే ఉంటారు పొరపాటున ఆ సమయంలో ఎవరైనా బయట వస్తే వాళ్ళు విచిత్రంగా చనిపోతూ ఉంటారు. అదే గ్రామలో నివసించే విజయ్(జగపతి బాబు) బాగా చదివి ఐ.ఎ.ఎస్ అవుతాడు. వాళ్ళ ఊరికి కూడా కరెంట్, రోడ్లు, స్కూల్ మరియు హాస్పిటల్ అన్నీ తెప్పించాలని అనుకుంటాడు. కానీ అతను అనుకోకుండా చనిపోతాడు. అసలు విజయ్ నిజంగా చనిపోయాడా? లేదా? ఇంతకీ రోజు జనాల్ని ఎవరు చంపుతుంటారు? చివరి కన్నా ఆ చావులు ఆగాయా లేదా? దాని వెనుక ఉన్న నిజానిజాలు ఏంటి అనేదే ఈ చిత్ర కథాంశం.

ప్లస్ పాయింట్స్ :

జగపతి బాబు సినిమాలో ఎక్కువ సేపు కనపడరు, ఎప్పటిలాగానే కనపడినంత వరకూ ఓకే అనేలా ఆయన నటన ఉంది. గాయత్రి ఒక పాటలో మాత్రం కొంచెం గ్లామరస్ గా ప్రేక్షకుడిని ఆకట్టుకుంది. యాంగ్రీ యంగ్ మెన్ పోలీస్ పాత్రలో ‘సత్యం’ రాజేష్ నటన చాలా బాగుంది. ఆడవాళ్లంటే పిచ్చి మరియు క్రూరమైన మనస్తత్వం కలిగిన విలన్ పాత్రని పృథ్వి రాజ్ (అదేనండి మన 30 ఇయర్స్ కమెడియన్) చాలా బాగా చేసారు. సినిమా ఫస్ట్ హాఫ్ కొంచెం సస్పెన్స్ గా బాగా సాగుతుంది. దర్శకుడు సినిమా మొదలు పెట్టగానే ప్రేక్షకుడిలో ఆసక్తిని పెంచాలని హాలీవుడ్ సినిమాలకి ప్రమోషన్స్ టైములో మన తెలుగు వారు డబ్బింగ్ చెప్పినట్టు ప్రయత్నించారు. అనుకున్నట్టుగానే అది ప్రేక్షకుడికి రీచ్ అయ్యింది. సెకండాఫ్లో వచ్చే ‘నీ జతలోన’ అనే పాట వినడానికి మరియు చూడటానికి చాలా బాగుంది.

మైనస్ పాయింట్స్ :

దర్శకుడు అన్నట్టు సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ అనుకుంటే నల్లమల అడవుల్లో కలిసిపోయినట్టే. పేరుకి మాత్రమే ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ కానీ అంత సస్పెన్స్ మరియు ప్రేక్షకుడిని అంత థ్రిల్లింగ్ కి గురిచేసే విషయం ఏమీ లేకపోవడం సినిమాకి మొదటి మైనస్. హీరోయిన్ గాయత్రి అయ్యర్ సినిమా మొత్తం ఉన్నా దర్శకుడు ఆమెను సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాడు. ఎక్కడనా హీరోయిన్స్ అంటే పొదుపుగా బట్టలు వేస్తారు కానీ ఇందులో గాయత్రి మాత్రం చాలా పొదుపుగా మాట్లాడుతుంది మరియు హీరోయిన్ మీద షూట్ చేసిన కొన్ని సన్నివేశాలు చాలా చిరాకు కలిగిస్తాయి. ఫస్ట్ హాఫ్ బాగానే పోతున్న టైంలో దర్శకుడు అంత ఆసక్తిగా ప్రేక్షకుడు సినిమా చూస్తే బ్లాక్ బస్టర్ అయిపోతుంది అనుకున్నాడేమో, అనవసరంగా వరుసగా రెండు పాటలు పెట్టారు. అవి చూసేసరికి అందరికీ అప్పటివరకూ ఉన్న ఫీల్ ని పూర్తిగా పోగొడతాయి. సెకండాఫ్లో జగపతి బాబు ఉన్న కొద్ది సేపు తప్ప మిగతా అంతా అస్సలు ఆసక్తి కరంగా ఉండదు. ముఖ్యంగా సినిమాకి క్లైమాక్స్ చాలా మేజర్ మైనస్.

సినిమాని ఒక దగ్గర మొదలుపెట్టి ఎక్కడికో తీసుకెళ్ళి ముగించారు. మొదట్లో చెప్పిన దానికి చివర్లో ఇచ్చే వివరణకి అసలు పొంతన కుదరదు. సినిమాలో అనవసరమైన సీన్స్ చాలా ఉన్నాయి. ఎడిటర్ మళ్ళీ ఓ సారి కత్తెరకి పని చెప్పి ఆ సీన్స్ తీసేస్తే బాగుంటుంది. సైంటిస్ట్ గా చేసిన సూర్య పాత్రకి దర్శకుడు పూర్తి న్యాయం చెయ్యలేకపోయాడు. సినిమాకి చాలా అవసరం అయిన ఈ పాత్ర విషయంలో దర్శకుడు మరింత జాగ్రత్త తీసుకోవాల్సింది.

సాంకేతిక విభాగం :

సినిమాలో చెప్పుకోదగ్గ అంశం ప్రభాకరన్ అందించిన సినిమాటోగ్రఫీ. అది సినిమాకి చాలా వరకూ  ప్లస్ అయ్యింది. రవివర్మ అందించిన నాలుగు పాటల్లో ‘నీ జతలోన’ అనే ఒక్క పాట బాగుంది. నేపధ్య సంగీతం విషయంలో లేఖా రత్నకుమార్ సస్పెన్స్ సన్నివేశాలకు పూర్తి న్యాయాన్ని చేయలేకపోయారు. సాంకేతిక విభాగంలో చెప్పుకోదగ్గ మైనస్ పాయింట్ ఎడిటింగ్. ఎడిటర్ ఆర్.జె సదాచరణ్ ఎడిటింగ్ చాలా చెత్తగా ఉంది. ముఖ్యంగా సెకండాఫ్ లో ఎడిటింగ్ చాలా దారుణంగా ఉంది. అనుకున్న కాన్సెప్ట్ కి దర్శకుడు శ్రీ కాంత్ పూర్తి న్యాయం చేయలేకపోయాడు. కొత్త దర్శకుడు కావడంతో సస్పెన్స్ ని పూర్తిగా ఎలివేట్ చేయలేకపోయాడు, అలాగే డైలాగ్స్ కూడా ఆకట్టుకునే స్థాయిలో లేవు. విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి. 6 ఆకారంలో డిజైన్ చేసిన ఉరవకొండ గ్రామం గ్రాఫిక్స్ బాగుంది.

తీర్పు :

సినిమా మొత్తం జగపతి బాబు ఉంటాడు అనుకోని సినిమాకెలితే మాత్రం మీకు నిరాశే మిగులుతుంది, ఎందుకంటే జగపతి బాబు సినిమా మొత్తం మీద ఒక 15 – 20 నిమిషాలు మాత్రమే ఉంటాడు. ఒక్క కామెడీ బిట్ కూడా సినిమాలో లేనందు వల్ల రొటీన్ సినీ అభిమానులకు అంతగా నచ్చకపోవచ్చు. సస్పెన్స్ సినిమాలు ఇష్టపడే వారికి మాత్రమే ఈ సినిమా కాస్త నచ్చుతుంది. ఒకవేళ మీరు బాగా హాలీవుడ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ చూసేసి ఉంటే మాత్రం బాగా నిరాశ పడే అవకాశం ఉంది. చివరిగా ఒక్క విషయం మీకు వీలైతే ఇది క్లైమాక్స్ అని మీకు అనిపించగానే లేచి వచ్చేయండి. అలా వచ్చేస్తే అప్పటివరకూ ఉన్న ఫీల్ అన్నా మీకు మిగులుతుంది లేదంటే క్లైమాక్స్ ఏంట్రా ఇంత దరిద్రంగా ఉంది అనుకుంటూ బయటకోస్తారు.

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25 /5

రాఘవ(Rag’s)

 

 

సంబంధిత సమాచారం :