పాటల సమీక్ష : అజ్ఞాతవాసి – కొత్తగా.. క్లాసీగా ఉంది

పాటల సమీక్ష : అజ్ఞాతవాసి – కొత్తగా.. క్లాసీగా ఉంది

Published on Dec 20, 2017 1:56 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ల సూపర్ హిట్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘అజ్ఞాతవాసి’. ఈ చిత్రంలోని రెండు పాటలు ఇంతకు ముందే విడుదలై పెద్ద హిట్లుగా నిలవగా పూర్తిస్థాయి 5 పాటల ఆడియో ఆల్బమ్ కొద్దిసేపటి క్రితమే విడుదలైంది. మరి అనిరుద్ సంగీతం సమకూర్చిన ఈ పాటలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం…

1. పాట : ధగ ధగ మనే
గాయనీ గాయకులు : అనిరుద్ రవిచందర్, విశాల్ దద్లాని
సాహిత్యం : శ్రీమణి

‘ధగ ధగ మనే తూరుపు దిశ’ అంటూ మొదలయ్యే ఈ పాట అజ్ఞాతం నుండి లక్ష్య సాధన వైపుకు సాగిపోయే కథానాయకుడిని కళ్ళకు కట్టినట్టు చూపించింది. పాటకు ప్రాణంగా నిలిచిన శ్రీమణి సాహిత్యం హీరో వ్యక్తిత్వాన్ని ఎంతో ఉన్నతంగా చూపించింది. పాట ఆరంభం ఒక ఎత్తైతే కొద్దిసేపటికే అది తారా స్థాయిని చేరుకొని వినేవారికి కొత్త ఉత్తేజాన్ని ఇస్తుంది. ‘ఎర్రగా తడిపెనే ఏ రాచ రక్తమో నింగిని, సిద్ధుడి ప్రణవంలా వీడు, బుద్దుడి శ్రవణంలా వీడు ‘ వంటి వాఖ్యాలు పవన్ కు అభిమానులు ఎలా కోరుకుంటారో అలాంటి ఎలివేషన్ ను ఇస్తున్నాయి. అనిరుద్ గాత్రం, సంగీతం రెండూ పాటకు అదనపు బలాలుగా నిలిచాయి. ఆల్బమ్ లోని ఉత్తమమైన పాటల్లో ఇది కూడా ఒకటని చూపొచ్చు.

2. పాట : బయటికొచ్చి చూస్తే
గాయనీ గాయకులు : అనిరుద్ రవిచందర్
సాహిత్యం : శ్రీమణి

‘బయటికొచ్చి చూస్తే టైమ్ ఏమో 3’o క్లాక్’ అనే ఈ పాట ఇప్పటికే సంగీత ప్రియులందరికీ కంఠతా వచ్చేసేంతలా సక్సెస్ అయింది. హీరోలో రొమాంటిక్ మూడ్ ని వివరిస్తూ సాగే ఈ పాటలొని అన్ని అంశాలు కొత్తగా అనిపిస్తాయి. ‘యాపిల్ పండులా సూరీడే, చల్లగాలే విలన్ లా’ వంటి లిరిక్స్ తో తెలుగు సినిమా సాహిత్యంలో ఇప్పటి వరకు లేని పద ప్రయోగం, పోలికా విన్యాసం చేశారు రచయిత శ్రీమణి. ఇక అనిరుద్
స్వరాలైతే కొత్తగా అనిపిస్తూ విదేశీ సంగీతాన్ని విన్న ఫీలింగ్ ను కలిగిస్తాయి. గాయకుడిగా కూడా అనిరుద్ ఒళ్ళు పులకరించేలా చేశారు. కళ్ళు మూసుకుని వింటే అందమైన విజువల్స్ కళ్ళలో మెదిలేలా ఉన్న ఈ పాట ఆల్బమ్ మొత్తంలో టాప్ సాంగ్ గా నిలుస్తుంది.

3. పాట : స్వాగతం కృష్ణా
గాయనీ గాయకులు : నిరంజనా రమణన్
సాహిత్యం : ఊతుక్కడు శ్రీ వెంకట సుబ్బాయిర్

‘మధురాపురి సధనా మృధు వదనా’ అనే ఈ పాట చాన్నాళ్ల క్రితమే కవి ఊతుక్కడు శ్రీ వెంకట సుబ్బాయిర్ రాసిన కృష్ణ గీతం. ఇప్పటికే ఎంతో ప్రాచుర్యంలో ఉన్న ఈ పాటను గాయని నిరంజనా రమణన్ ఎంతో శ్రవణంగా ఆలపించారు. శ్రీ వెంకట సుబ్బాయిర్ గారి సంస్కృత పదాలు కొన్ని మొదట్లో క్లిష్టంగానే అనిపించినా వినగా వినగా మెల్లగా అవగతమవుతాయి. అనిరుద్ కూడా ప్రశాంతంగా, కొత్తగా అనిపించే తన క్లాసికల్ సంగీతంతో అలరించాడు. కథలోని కీలకమైన సందర్భంలో వచ్చేలా అనిపిస్తుంది ఈ పాట ఆల్బమ్ కు కొంత ప్రత్యేకతను తీసుకొచ్చింది.

4. పాట : గాలి వాలుగా
గాయనీ గాయకులు : అనిరుద్ రవిచందర్
సాహిత్యం : సిరివెన్నెల సీతారామ శాస్త్రి

‘గాలి వాలుగా ఒక గులాబి వాలి’ అంటూ మొదలయ్యే ఈ రొమాంటిక్ సాంగ్ ఒక్కసారి వినగానే గుండెకు హత్తుకునేలా ఉంది. సిరివెన్నెల గారు చాలా రోజుల తర్వాత రాసిన ఈ పాట నవ తరానికి కావాల్సిన విధంగా నూతనంగా ఉంది. రాబోయే రోజుల్లో ఎన్ని మంచి రొమాంటిక్ పాటలు వచ్చినా ఈ పాట కొన్నాళ్ల పాటు హవాను కొనసాగించడం ఖాయమని చెప్పొచ్చు. ‘ఆలోచిద్దాం చక్కగా కూర్చొని చర్చిద్దాం, సుకుమారి సొగసునలా ఒంటరిగా వదలాల’ వంటి లిరిక్స్ చాలా బాగున్నాయి. దానికి తోడు అనిరుద్ అందించిన సంగీతం, పాట పాడిన విధానం ప్రేమికుడిలోని తియ్యని భాధను ప్రతిబించేలా ఉంది.

5. పాట : ఏబి ఎవరో నీ బేబీ
గాయనీ గాయకులు : నికాష్ అజిజ్, అర్జున్ చండీ
సాహిత్యం :శ్రీమణి

‘ఏబి ఎవరో నీ బేబీ’ అంటూ మొదలయ్యే ఈ పాట ఇద్దరు హీరోయిన్ల మధ్యన ఇరుక్కుపోయిన హీరోను ప్రస్తావిస్తూ సాగేదిగా ఉంది. నారీ నారీ నడుమ మురారి అనే చిలిపి సందర్భానికి రెగ్యులర్ సినిమాల్లా మాస్ మసాలా పాటను కాకుండా ఎంతో క్లాస్ గా పాటను డిజైన్ చేశారు త్రివిక్రమ్. ‘చంద్రుడే చుక్కల్లో చిక్కేరో, ఓ ప్రేమ విహారి ఎటురా నీదారి, దేవుడా పువ్వులతో ప్రణయమా’ అంటూ శ్రీమణి రాసిన లిరిక్స్ కొత్తగా ఉన్నాయి. నికాష్ అజిజ్, అర్జున్ చండీల గాత్రం బాగుంది. అనిరుద్ సంగీతం కూడా న్నీ పాటల్లానే ఇందులో కూడా చాల కూల్ గా, క్లాసీగా ఉంది. మరీ గొప్పగా కాకపోయినా ఈ పాట బాగానే ఉంది.

తీర్పు :

ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ చేసిన 24 సినిమాల్లోని సంగీతం, పాటలు ఒక ఎత్తైతే ‘అజ్ఞాతవాసి’ ఆడియో మాత్రం కొత్త ఎత్తు. మాస్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న పవన్ సినిమాలంటే ఏ దర్శకుడైన వేర్ ఆలోచన లేకుండా కనీసం ఒకటి రెండు మాస్ పాటలు, బిగ్గరగా ఉండే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఉండేలా చూస్తారు. కానీ త్రివిక్రమ్ మాత్రం ఈసారి పవన్ ను క్లాస్ గా, కూల్ గా చూపించాలనే ఉద్దేశ్యంతో ఆల్బమ్ ను కూడా క్లాసీగానే తయారుచేయించారు. తెలుగువారికి అంతగా పరిచయంలేని అనిరుద్ వర్క్ అన్ని పాటల్లోనూ బాగుంది. ముఖ్యంగా ‘గాలి వాలుగా, బయటికొచ్చి చూస్తే, ధగ ధగ’ పాటలు టాప్ లిస్టులో నిలవగా ‘ఏబి ఎవరో నీ బేబీ’ పాట సెకండ్ లిస్ట్ లో నిలిచింది. అలాగే ‘స్వాగతం కృష్ణా’ పాట చివరి స్థానంలో నిలిచినా సినిమా పరంగా ప్రత్యేకత కలిగిన పాటగా నిలుస్తుంది. మొత్తం మీద ఈ ఆల్బమ్ కొత్తగా, క్లాసీగా ఉండి పవన్ అభిమానులకు, సంగీత ప్రియులకు తప్పక నచ్చుతుంది.

Click here for English Music Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు