సమీక్ష : అరకు రోడ్‌లో – మలుపులు బానే ఉన్నా, ప్రయాణం బాగోలేదు

Araku Road Lo review

విడుదల తేదీ : డిసెంబర్ 2, 2016

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

దర్శకత్వం : వాసుదేవ్

నిర్మాత : మేకా బాలసుబ్రమణ్యం, బి.భాస్కర్, వేగిరాజు ప్రసాదరాజు, రామేశ్వరి నక్కా

సంగీతం : వాసుదేవ్

నటీనటులు : సాయిరామ్ శంకర్, నిఖిషా పటేల్..

ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ తమ్ముడు సాయిరామ్ శంకర్ హీరోగా పలు చిత్రాలతో బాగానే మెప్పించాడు. తాజాగా ఆయన హీరోగా చేసిన థ్రిల్లర్ సినిమాయే ‘అరకు రోడ్‌లో’. టీజర్, ట్రైలర్‌తో బాగానే ఆకట్టుకున్న ఈ సినిమా నేడు పెద్దగా ప్రచారమేదీ లేకుండానే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అరకు రోడ్‌లో జరిగిన ఆ థ్రిల్లర్ కథేంటీ? చూద్దాం..

కథ :

వైజాగ్ నుంచి అరకు వెళ్ళే దారిలో ఒక సీరియల్ కిల్లర్ వరుసగా హత్యలు చేస్తూ, పోలీసులకు కూడా తలనొప్పిగా తయారవుతాడు. అలాంటి సీరియల్ కిల్లర్ ఉండే ప్రాంతానికి దగ్గరైన వైజాగ్‌లో పోతురాజు (సాయిరామ్ శంకర్) అనే ఓ యువకుడు ట్రక్కు నడుపుకుంటూ సరదాగా జీవితం గడిపేస్తుంటాడు. ఒక కానిస్టేబుల్ (నిఖిషా పటేల్)తో ప్రేమలో పడి, పెళ్ళి కూడా చేసుకోవాలని ఫిక్స్ అయిన అతడి జీవితాన్ని ఒక అనుకోని సంఘటన ఎన్నో మలుపులు తిప్పుతుంది.

తనకు తెలియకుండానే అరకు రోడ్‌లో హత్యలు చేసే సీరియల్ కిల్లర్‌తో కలిసి పోతురాజు ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఆ ప్రయాణంలో ఏం జరిగింది? పోతురాజు జీవితాన్ని మలుపు తిప్పే ఆ సంఘటన ఏంటీ? వరుస హత్యలు చేస్తూ పోయే సీరియల్ కిల్లర్ ఎవరు? అతడ్ని ఎదుర్కొని రాజు తన జీవితాన్ని ఎలా చక్కదిద్దుకున్నాడూ? అన్నదే సినిమా.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అంటే ఇంటర్వెల్ ట్విస్ట్, ఆ తర్వాత సెకండాఫ్‌లో వచ్చే మొదటి ఇరవై నిమిషాల థ్రిల్లింగ్ సన్నివేశాలనే చెప్పాలి. ముఖ్యంగా ఎక్కువగా రాత్రి పూటే నడిచే ఈ ఇరవై నిమిషాల సన్నివేశాల్లో అడుగడుగునా వచ్చే ట్విస్ట్‌లు, మేకింగ్ బాగా ఆకట్టుకున్నాయి. ఫస్టాఫ్‌లో సాయిరామ్ శంకర్, సత్యల కామెడీ బాగా నవ్వించింది. ముఖ్యంగా కృష్ణ భగవాన్ ఎపిసోడ్, ఆ ఎపిసోడ్‌లో సత్య కామెడీ డైలాగ్స్ అదిరిపోయాయి. పేకాట ఆడి డబ్బు సంపాదించే సన్నివేశాలు కథకు బలాన్నిచ్చేలా బాగున్నాయి.

సాయిరామ్ శంకర్ తన పాత్రను పరిధిమేర బాగానే పోషించాడు. ఫస్టాఫ్‌లో సరదాగా ఉంటూ, సెకండాఫ్‌కు పూర్తిగా సీరియస్‌గా మారిపోయే పాత్రలోని ఎమోషన్‌ను సాయిరామ్ బాగా పట్టుకున్నాడు. కోవై సరళ తన స్టైల్లో బాగానే నటించేసింది. నిఖిషా పటేల్ నటన పరంగా చేసిందేమీ లేకపోయినా, గ్లామర్‌తో అక్కడక్కడా ఆకట్టుకుంది.

మైనస్ పాయింట్స్ :

కథలో వచ్చే ఒక నాలుగైదు ట్విస్ట్‌లను అల్లుకుంటూ పోయి రాసిన స్క్రీన్‌ప్లేలో బలం లేకపోవడమే ఈ సినిమాకు మేజర్ మైనస్ పాయింట్‌గా చెప్పాలి. ఈ నాలుగైదు టిస్ట్‌లు, వాటిచుట్టూ వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను మినహాయిస్తే మిగతా సన్నివేశాలన్నీ ఒక పద్ధతి లేకుండా వచ్చిపోయినట్లు అనిపించాయి. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో సినిమా అంతా సంబంధం లేని ఒక్కో సీన్‌ను ఇంటర్వెల్ కోసం అతికించినట్లుగా ఉండడం నిరుత్సాహపరిచే అంశం.

ఇక సెకండాఫ్‍ మొదలయ్యాక, మొదటి ఇరవై నిమిషాలు చాలా బాగా ఆకట్టుకున్నాక, కథంతా మళ్ళీ దారితప్పడం వల్ల అప్పటివరకూ ఉన్న ఉత్సాహం అంతా పోయేలా తయారైంది. పోయింది. పృధ్వీ కామెడీ కూడా బోరింగ్‌గా అనిపించింది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఏమాత్రం ఆకట్టుకునేలా లేవు. సీరియల్ కిల్లర్ గురించి కూడా ఏదీ చెప్పకుండా క్లైమాక్స్ ముగించడం అస్సలు బాగోలేదు.

సాంకేతిక విభాగం :

ముందుగా దర్శక, రచయిత వాసుదేవ్ విషయానికి వస్తే, కథ ఎంచుకోవడంలో ఆయన కొత్తదనమే చూపినా, దాన్ని ఒక ఆసక్తికర సినిమాగా మలచడంలో మాత్రం తేలిపోయారు. సెకండాఫ్‌లో వచ్చే కొన్ని ట్విస్ట్‌లను, సన్నివేశాలను మాత్రం బాగా రాసుకున్నట్లు అనిపించింది. అనవసరమైన సన్నివేశాలతో కాకుండా, కథను పకడ్బందీగా చెప్పి ఉంటే ఈ సినిమా వేరేలా ఉండేదేమో. మేకింగ్ విషయంలో అక్కడక్కడా దర్శకుడి ప్రతిభను గమనించొచ్చు.

సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు మేజర్ హైలైట్స్‌లో ఒకటిగా చెప్పుకోవాలి. సినిమా బడ్జెట్ దృష్ట్యా ఈ విజువల్స్ స్థాయి బాగుందనే అనాలి. ఎడిటింగ్ ఆకట్టుకునేలా లేదు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఉన్నంతలో బాగున్నాయి.

తీర్పు :

‘అరకు రోడ్‌లో ఏం జరిగిందీ?’ అంటూ వచ్చిన ఈ థ్రిల్లర్‌లో చెప్పుకోడానికి మంచి కథాంశమే ఉంది. దాంతో పాటు కొన్ని ట్విస్ట్‌లు, సెకండాఫ్‌లో కొన్ని థ్రిల్లింగ్ సన్నివేశాలు కూడా ఉన్నాయి. అయితే అవి వదిలేస్తే, మిగతా సినిమా అంతా బోరింగ్‌గా, సంబంధం లేని సన్నివేశాలన్నీ అతికించినట్లుగా ఉండడమే పెద్ద మైనస్. సాయిరామ్ శంకర్ నటనతో, కథ పరంగా వచ్చే కొన్ని సస్పెన్స్‌లతో ఫర్వాలేదనిపించినా ఈ సినిమా పూర్తి స్థాయిలో ఆకట్టుకోవడంలో మాత్రం తేలిపోయింది. ఒక్కమాటలో చెప్పాలంటే.. ‘అరకు రోడ్‌లో’ మలుపులు బానే ఉన్నా, ప్రయాణం మాత్రం బాగోలేదు.

123telugu.com Rating : 2.5/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం :