సమీక్ష : బంగారి బాలరాజు – సందేశం ఉన్నా ఆకట్టుకోని ప్రేమ కథ

సమీక్ష : బంగారి బాలరాజు – సందేశం ఉన్నా ఆకట్టుకోని ప్రేమ కథ

Published on Oct 25, 2018 2:58 PM IST
Bangari Balaraju movie review

విడుదల తేదీ : అక్టోబర్ 25, 2018
123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

నటీనటులు : రాఘవ్, కరాణ్య కత్రీన్, మీనాకుమారి, దూకుడు శ్రవణ్, ఎన్.వి. చౌదరి, సారిక రామచంద్రరావు, కిరాక్ ఆర్.పి త‌దిత‌రులు.

దర్శకత్వం : కోటేంద్ర దుద్యాల

నిర్మాతలు : కె.ఎండి. రఫి, మరియు రెడ్డం రాఘవేంద్రరెడ్డి

సంగీతం : చిన్నికృష్ణ – చిట్టిబాబు రెడ్డిపోగు

సినిమాటోగ్రఫర్ : చక్రవర్తి

స్క్రీన్ ప్లే : కోటేంద్ర దుద్యాల

నూతన దర్శకుడు కోటేంద్ర దుద్యాల దర్శకత్వంలో రాఘవ్, కరోణ్య కత్రిన్ హీరో హీరోయిన్లుగా.. నంది క్రియేషన్స్ పతాకం పై కె.యమ్.డి.రఫి, రెడ్డం రాఘవేంద్ర రెడ్డి కలిసి సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘బంగారి బాలరాజు’. కాగా ఈ చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

 

కథ :

 

తల్లి అంటే అపారమైన ప్రేమ, గౌరవం కలిగి ఉన్న బాలరాజు (రాఘవ్ ) ఊరిలోనే ఉండి సివిల్స్ కి ప్రిపేర్ అవుతుంటాడు. అలాగే ఫ్రెండ్స్ తో సరదాగా ఉంటాడు. అలా ఫ్రెండ్స్ తో సరదాగా గడుపుతుండగా.. అనుకోకుండా జరిగిన ఓ సంఘటనతో, బాలరాజు ఓ అమ్మాయి కళ్ళు చూసి ప్రేమలో పడతాడు. ఆ అమ్మాయి ఎవరు అని తెలుసుకున్నే క్రమంలో.. ఆ ఊరి పెద్ద జగ్గారెడ్డి ఏకైక కూతురు బంగారి (కరోణ్య కత్రిన్) బాలరాజుని టీజ్ చేస్తూ రకరకాలుగా టార్చర్ పెడుతూ ఉంటుంది. క్రూరుడు అయిన జగ్గారెడ్డికి భయపడి, బంగారి ఏం చెప్పినా బాలరాజు కాదనలేక ఆమె చెప్పినట్లే చేస్తుంటాడు.

ఈ క్రమంలో బాలరాజుకి తను ప్రేమించే అమ్మాయి బంగారినే అని అర్ధం అవుతుంది. దాంతో ఇద్దరూ ఒకర్ని ఒకరు గాఢంగా ప్రేమించుకుంటారు. కాగా పరువు కోసం ప్రాణం తీసే జగ్గా రెడ్డి వీరి ప్రేమని ఒప్పుకున్నాడా ? అసలు ప్రేమని చచ్చినా ఒప్పుకొని జగ్గా రెడ్డి, బాలరాజుని అతని తల్లిని ఏం చేశాడు ? అయితే బాలరాజు తన ప్రేమను గెలిపించుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఏమిటి ? ఈ క్రమంలో బాలరాజుకి ఎవరెవరు సాయపడ్డారు ? చివరకి పరువు కంటే ప్రేమే గొప్పది అని జగ్గా రెడ్డి అంగీకరిస్తాడా ? లేదా ? లాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ చిత్రం చూడాలసిందే !

 

ప్లస్ పాయింట్స్ :

 

మొదటి సారి హీరోగా నటించిన రాఘవ్ కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో కొంత తడబాటు పడ్డా.. చాలా వరకు కాన్ఫిడెంట్ గా నటించాడు. డాన్స్, డైలాగ్ మాడ్యులేషన్ తో సహా రాఘవ్ ఆకట్టుకున్నే ప్రయత్నం చేశాడు. దూకుడు శ్రవణ్ కేవలం కొన్ని సీన్స్ లోనే కనిపించనప్పటికీ చాలా ముఖ్యమైన పాత్రను పోషించాడు. హీరోయిన్ గా చేసిన కరోణ్య కత్రిన్ తన గ్లామర్ తోనే కాకుండా.. తన లుక్స్ పరంగా, తన నటన పరంగా కూడా బాగానే ఆకట్టుకుంటుంది.

ఇక కమెడియన్స్ కిరాక్ ఆర్.పి, జబర్దస్త్ బాబిలు తమ కామెడీ టైమింగ్‌ తో అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా హీరో ప్రేమించిన అమ్మాయి ఎవరో తెలుసుకున్నే సన్నివేశాల్లో కిరాక్ ఆర్.పి తన మ్యానరిజమ్స్ తో నవ్విస్తాడు. హీరోకి తల్లిగా నటించిన ‘మీనా కుమారి’ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారని చెప్పొచ్చు. కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో ఇటు తల్లిగా ఆకట్టుకున్న ఆమె.. అటు ఓ టీచర్ గా బతుకు పాఠాలు కూడా చెప్తూ సినిమాకే హైలెట్ అయ్యారు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు.

 

మైనస్ పాయింట్స్ :

 

మంచి కాన్సెప్ట్ తీసుకున్న దర్శకుడు కోటేంద్ర దుద్యాల ఆ కాన్సెప్ట్ ను అంతే బాగా తెర మీదకు ఆసక్తికరంగా మలచే ప్రయత్నం చేశారు గానీ, అది సంతృప్తికరంగా జరగలేదు. ఫస్ట్‌ హాఫ్‌ లో కొంతవరకు కామెడతో నవ్వించినా.. కొన్ని సీన్ లతో బోర్ కొట్టిస్తాడు. ఇక సెకెండ్ హాఫ్ లో కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు బాగున్నప్పటికీ.. మిగిలిన సన్నివేశాలు అలాగే సందర్భం లేకుండా వచ్చే పాటలు విసుగు పుట్టిస్తాయి.

హీరో క్యారెక్టైజేషన్ కూడా అంత బలంగా లేదు. ప్రేమతో పాటు హీరో తన లక్ష్యాన్ని కూడా ఎలా సాధించాడు అనే విషయాన్ని కూడా క్లారిటీగా చూపెడితే బాగుండేది.

ఇక సినిమాలో ఎక్కువుగా నూతన నటీనటులు నటించడం కూడా సినిమా ఫలితాన్ని దెబ్బ తీసింది. చాలా సన్నివేశాల్లో కొందరి నటీనటుల హావభావాలు, వారి నటన కూడా ఇబ్బందిగా అనిపిస్తాయి.

 

సాంకేతిక విభాగం :

 

దర్శకుడు మంచి కాన్సెప్ట్ ని తీసుకున్న దాన్ని తెర మీద చూపెట్టడంలో మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు. జి.ఎల్. బాబు కెమెరా పనితనం మాత్రం ఇంప్రెస్ అయ్యేలా ఉంది. ఆయన తీసిన విజువల్స్, కొన్ని షాట్స్ బాగున్నాయి. చిన్నికృష్ణ – చిట్టిబాబు రెడ్డిపోగు అందించిన సంగీతం పర్వాలేదనిపిస్తోంది. కాకపోతే పాటల్లో చాలా చోట్ల పాత చిత్రాల్లోని బిట్స్ గుర్తువస్తాయి. ఇక ఎడిటర్ పనితనం అస్సలు బాగాలేదు. దర్శకుడు అభిరుచికి తగ్గట్లే ఎడిటింగ్ కూడా సాగింది. నిర్మాతలు కె.ఎండి. రఫి, మరియు రెడ్డం రాఘవేంద్రరెడ్డి చిత్రం పై బాగానే ఖర్చు పెట్టారు గానీ, స్క్రిప్ట్ విషయంలో ఇంకాస్త శ్రద్ద వహించి ఉండాల్సింది.

 

తీర్పు :

 

కోటేంద్ర దుద్యాల దర్శకత్వంలో రాఘవ్, కరోణ్య కత్రిన్ హీరో హీరోయిన్లుగా బర్నింగ్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. ప్రేమికులను ఆకట్టుకుంటుంది. అయితే మిగిలిన వర్గాల ప్రేక్షకులను మాత్రం మెప్పించలేకపోవచ్చు. ఓవరాల్ గా సినిమాలోని కొన్ని ప్రేమ సన్నివేశాలు.. ఆ ప్రేమకు ఎదురై ఇబ్బందికర పరిస్థితులు ఆసక్తికరంగా సాగినప్పటికీ.. మిగిలిన సన్నివేశాలు మరీ నాటకీయంగా గందరగోళంగా ఉండటంతో ఈ సినిమా ప్రేమికులను, ప్రేమ సానుభూతి పరులని తప్ప.. మిగిలిన వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోదు.

123telugu.com Rating : 2/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు