సమీక్ష : భేతాళుడు – హర్రర్ అనిపించే సైకలాజికల్ థ్రిల్లర్

Bethaludu review

విడుదల తేదీ : డిసెంబర్ 1, 2016

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

దర్శకత్వం : ప్రదీప్ కృష్ణమూర్తి

నిర్మాత : ఫాతిమా విజయ్ ఆంటోనీ

సంగీతం : విజయ్ ఆంటోని

నటీనటులు : విజయ్ ఆంటోనీ, అరుంధతి నాయర్

‘బిచ్చగాడు’ సంచలన విజయం తరువాత నటుడు విజయ్ ఆంటోనీ ప్రదీప్ కృష్ణమూర్తి డైరెక్షన్లో చేసిన మరో విభిన్న చిత్రం ‘భేతాళుడు’. విడుదలకు ముందే సినిమాలోని 15 నిముషాల భాగాన్ని విడుదల చేసి సినిమాపై అంచనాలను, నమ్మకాన్ని అమాంతం పెంచేశాడు ఆంటోనీ. ఇన్ని అంచనాలు మధ్య తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి ఈరోజే విడుదలైన ఈ చిత్రం ఆ అంచనాలను ఎంత మేరకు అందుకుందో ఇప్పుడు చూద్దాం…

కథ :

దినేష్(విజయ్ ఆంటోనీ) అనే ఒక ఇంటెలిజెంట్ సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఉన్నట్టుండి ఒక మానసిక రుగ్మతకు గురై ఎవరో తనను వెంటాడుతున్నట్టు భాధపడుతుంటాడు. ఆలా బాధపడుతున్న అతను ట్రీట్మెంట్ కోసం డాక్టర్ని కలవగా ఆ డాక్టర్ దినేష్ ను పరీక్షించి అతను తన గత జన్మ తాలూకు జ్ఞాపకాలతో బాధపడుతున్నాడని నిర్ధారిస్తాడు.

అలా బాధపడుతున్న దినేష్ తన గత జన్మకు చెందిన జయలక్ష్మి అనే మహిళను వెతుక్కుంటూ వెళుతూ పూర్వ జన్మ జ్ఞాపకాలకు, ప్రస్తుతానికి మధ్య నలిగిపోతుంటాడు. అసలు దినేష్ వెతుకుతున్న ఆ జయలక్ష్మి ఎవరు ? ఉన్నట్టుండి దినేష్ కు తన గత జన్మ ఎందుకు గుర్తొచ్చింది ? ఆ గత జన్మ నైపథ్యం ఏమిటి ? చివరికి ఈ కథ ఎలా ముగిసింది ? అనేదే ఈ భేతాళుడు కథ.

ప్లస్ పాయింట్స్ :

ప్లస్ పాయింట్స్ లో ముందుగా చెప్పుకోవలసింది సినిమా ఫస్టాఫ్ గురించి. సినిమా మొదలవడమే చాలా ఆసక్తికరంగా మొదలైంది. ఆరంభం నుండే విజయ్ ఆంటోనీ మానసిక సమస్యను ఎలివేట్ చేస్తూ రాసిన సన్నివేశాలు, వాటిని తెరపై చాలా సున్నితంగా చూపించిన తీరు బాగున్నాయి. కొన్ని సన్నివేశాల్లో అయితే హర్రర్ సినిమా చూస్తున్నామా అనే భావన కలిగింది. ఇక ఆ సన్నివేశాల్లో విజయ్ ఆంటోనీ నటన సన్నివేశాలను మరింత ప్రభావితంగా చేసింది.

విజయ్ ఆంటోనీ తన గత జన్మలోని జయలక్ష్మిని వెతుక్కుంటూ వెళుతూ ఆమెను గురించిన విషయాలను తెలుసుకునే సన్నివేశాలు, ఇంటర్వెల్ బ్యాంగ్ ఆసక్తికరంగా ఉన్నాయి. ఇక సెకండాఫ్ లో చెప్పిన విజయ్ ఆంటోనీ గత జన్మ తాలూకు కథ చాలా సహజంగా, ఇంట్రెస్టింగా అనిపించింది. ప్రస్తుత జన్మలోని దినేష్ పాత్రకు, గత జన్మలోని శర్మ పాత్రకు మధ్య ఆంటోనీ చూపిన వైవిధ్యం అతనిలోని నటుడిని మరోసారి ప్రూవ్ చేసింది. ఇక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, వాయిస్ ఓవర్ బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ :

సినిమాలోని మైనస్ పాయింట్స్ లో ముందుగా చెప్పుకోవలసింది సెకండాఫ్ గురించి. సెకండాఫ్ లో నడిచే ఆంటోనీ గత జన్మ కథ బాగానే ఉన్నా అది ప్రస్తుతానికి వచ్చి పూర్తిగా వేరే ట్రాక్ తీసుకోవడం అంతగా నచ్చలేదు. పూర్తిగా ఒక మోడ్ లో ఉన్న ప్రేక్షకుడిని ఏమాత్రం ప్రిపరేషన్ లేకుండా ఉన్నట్టుండి వేరే మోడ్ లోకి తీసుకెళ్లిన ఈ విధానం నిరుత్సాహపరిచింది. దాంతో అప్పటిదాకా సినిమా క్లైమాక్స్ పై పెట్టుకున్న తారా స్థాయి అంచనాలు ఒక్కసారిగా నీరుగారాయి.

ఇక సినిమా క్లైమాక్స్ కూడా అటు తిరిగి ఇటు తిరిగి చివరికి రొటీన్ గానే ఉండటం మరొక మైనస్ పాయింట్. దర్శకుడు ఎక్కడికక్కడ సరైన కారణాలతో అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నప్పటికీ సినిమా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లు అసంతృప్తిగానే అనిపించాయి. ఒక రకంగా చెప్పాలంటే దర్శకుడిచ్చిన ముగింపు సరైనదే అయినా సాధారణ ప్రేక్షకుడు ఆశించే రీతిలో లేదు. ఇక మధ్యలో వచ్చే కొన్ని పాటలు కాస్త బోరుకొట్టించాయి.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగంలో ముందుగా చెప్పుకొవలసింది దర్శకుడు ప్రదీప్ కృష్ణమూర్తి గురించి. ఫస్టాఫ్ ఓపెనింగ్, కథనాన్ని చాలా బాగా రాసుకుని క్లీన్ గా స్క్రీన్ పై ప్రదర్శించాడు. అలాగే సెకండాఫ్ లో ఆంటోనీ గత జన్మ కథను, మొత్తం కథనాన్ని బాగానే రాసుకున్నాడు కానీ కథ ఉన్నట్టుండి ట్రాక్ మారడం, క్లైమాక్స్ విషయాల్లో కాస్త నిరుత్సాహపరిచాడు.

అలాగే విజయ్ ఆంటోనీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, జయలక్ష్మి అనే బ్యాక్ గ్రౌండ్ వాయిస్ ఓవర్ చాలా బాగా కనెక్టయ్యాయి. ప్రదీప్ కళైపురయత్ సినిమాటోగ్రఫీ బాగుంది. షూటింగ్ కోసం ఎంచుకున్న లొకేషన్లను బాగా చూపించాడు. ఎడిటింగ్ సినిమాపై క్లారిటీ ఉండేలా చేసింది. ఇక విజయ్ ఆంటోనీ పాటించిన నిర్మాణ విలువలు రిచ్ గా బాగున్నాయి.

తీర్పు :

ఈ ‘భేతాళుడు’ చిత్రం విజయ్ ఆంటోనీ చేసిన భిన్నమైన ప్రయోగాల్లో ఒకటిగా నిలిచే చిత్రం. సైకలాజికల్ థ్రిల్లర్ కి కాస్త హర్రర్ టచ్ ఇవ్వబడిన ఈ సినిమాలో ఫస్టాఫ్ కథ, కథనాలు, సెకండాఫ్ కొంత భాగం, విజయ్ ఆంటోనీ నటన ప్లస్ పాయింట్స్ కాగా నెమ్మదించిన సెకండాఫ్ కథనం, ఉన్నట్టుండి కథ ట్రాక్ మారిన విధానం, నిరుత్సాహపరిచే క్లైమాక్స్ లు మైనస్ పాయింట్స్. మొత్తం మీద చూస్తే హర్రర్, థ్రిల్లర్ జానర్లను ఇష్టపడుతూ వైవిధ్యం కోరుకునే ప్రేక్షకులకు ఈ సినిమా ఈ వారాంతంలో మంచి చాయిస్ గా నిలుస్తుంది.

123telugu.com Rating : 3/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం :