ఆడియో సమీక్ష : బ్రహ్మోత్సవం – ట్రెండీ అండ్ క్లాస్ ఆల్బమ్!

ఆడియో సమీక్ష : బ్రహ్మోత్సవం – ట్రెండీ అండ్ క్లాస్ ఆల్బమ్!

Published on May 8, 2016 1:47 PM IST

Brahmotsavam
‘బ్రహ్మోత్సవం’.. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ అయిన సినిమా. సూపర్ స్టార్ మహేష్ బాబు- దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలల సూపర్ హిట్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇక అదేవిధంగా మిక్కీ జే మేయర్ అందించిన ఆడియోపై కూడా మొదట్నుంచీ అదే స్థాయి అంచనాలున్నాయి. ఈ అంచనాల మధ్యే నిన్న సాయంత్రం బ్రహ్మోత్సవం ఆడియో విడుదలైంది. మరి ఆడియో అంచనాలను అందుకునే స్థాయిలోనే ఉందా? చూద్దాం..

Vacchindi1. పాట : వచ్చింది కదా అవకాశం
గాయనీ గాయకులూ : అభయ్ జోధ్‍పూర్
సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి

‘వచ్చింది కదా అవకాశం’ అంటూ వచ్చే ఈ పాట ‘బ్రహ్మోత్సవం’ సినిమాలో ఓ సంగీత్ పార్టీ నేపథ్యంలో వచ్చే పాట. ఒక ఉల్లాసభరితమైన పాటకు కావాల్సిన మూడ్‌ను మిక్కీ జే మేయర్ తనదైన ట్యూన్‌తో సరిగ్గా అందుకున్నారు. పాటలో ఆయన వాడిన వాయిధ్యాలు కూడా చాలా బాగున్నాయి. ఇక ఈ పాటకు హైలైట్ అంటే సీతారామశాస్త్రి అందించిన సాహిత్యం అనే చెప్పాలి. మనిషి ఆలోచనకు ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని నింపే తరహాలో ఆయన రాసిన సాహిత్యం చాలా బాగుంది. ముఖ్యంగా ‘ఆనందమంటే.. పైనేదో లేదే.. మనలోనే దాగుందీ. చిరునవ్వు దీపం వెలిగించి చూస్తే మనకే తెలుస్తుందీ’ లాంటి సీతారామశాస్త్రి మార్క్ సాహిత్యం కట్టిపడేస్తుంది. అభయ్ జోద్‌పూర్ గానం కూడా ఈ పాటకు మంచి స్థాయి తెచ్చిపెట్టింది. వినగానే ఎక్కేసే పాటగా దీన్ని చెప్పుకోవచ్చు.

Madhuram2. పాట : మధురం మధురం
గాయనీ గాయకులూ : పద్మ, శ్రీదేవి
సాహిత్యం : వల్లభాచార్యుడు

శ్రీకృష్ణుడిని వర్ణిస్తూ వల్లభాచార్యుడు రాసిన ‘మధురాష్టకం’లోని శ్లోకాలతో వచ్చే బిట్ సాంగ్‍గా దీన్ని చెప్పుకోవచ్చు. మహేష్ అందానికి సరిపోయేలా ఈ శ్లోకాలను బాగా వాడారనే చెప్పాలి. ఈ బిట్ సాంగ్‌కి మిక్కీ జే మేయర్ అందించిన ట్యూన్ వినసొంపుగా ఉంది. పద్మ,శ్రీదేవిల గానంతో పాటకు మంచి అందం వచ్చింది. సినిమాలో సందర్భం ప్రకారంగా చూస్తే బాగా కనెక్ట్ అయ్యే పాటగా దీన్ని చెప్పుకోవచ్చు.

Title-Song3. పాట : బ్రహ్మోత్సవం
గాయనీ గాయకులూ : శ్రీరామ చంద్ర
సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి

‘బ్రహ్మోత్సవం’ అంటూ వచ్చే ఈ పాట ట్యూన్-సింగింగ్-లిరిక్స్ పరంగా మంచి సింక్ కుదిరిన అద్భుతమైన పాట. ‘బ్రహ్మోత్సవం’ అన్నప్పుడల్లా గాయకుడు శ్రీరామ చంద్ర స్టైల్ బాగా ఆకట్టుకుంటుంది. మిక్కీ జే మేయర్ రకరకాల ఇన్స్ట్రుమెంట్స్‌తో చాలా ప్రయోగాలు చేశాడు. పాట మొదలయ్యేప్పటి నుంచి ఒక స్థాయికి వెళ్ళే సమయంలో మిక్కీ మ్యాజిక్ చూడొచ్చు. ఇక సీతారామ శాస్త్రి సాహిత్యం ఈ పాట స్థాయిని ఎక్కడికో తీసుకెళ్ళింది. సీతారామశాస్త్రి పదాలతో ప్రయోగాలు చేశారు. పాటలో అక్కడక్కడా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలోని పాటల ప్రభావం కనిపించినా, మళ్ళీ వెంటనే దీనికంటూ ఓ ప్రత్యేకత తెచ్చుకునేలా ట్యూన్ మారిపోతుంది. శ్రీరామ చంద్ర సింగింగ్ ఈ పాట స్థాయిని పెంచింది. విజువల్స్‌తో కలిపి చూస్తే ఈ మాంటేజ్ సాంగ్ అబ్బురపరచేలా ఉంటుందని ఆశించొచ్చు.

Aata-Paatalaadu4. పాట : ఆట పాటలాడు
గాయనీ గాయకులూ : కార్తీక్
సాహిత్యం : శ్రీకాంత్ అడ్డాల

‘ఆట పాటలాడు’ అంటూ సాగే ఈ పాటకు శ్రీకాంత్ అడ్డాల సాహిత్యం సమకూర్చడం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మిక్కీ జే మేయర్ స్టైల్‌ ట్యూన్‌కు శ్రీకాంత్ అడ్డాల అందించిన సాహిత్యం చాలా బాగుంది. ఇక కార్తీక్ ఈ పాటను పాడిన విధానాన్ని మెచ్చుకోవాలి. వినడానికి చాలా నార్మల్‌గా కనిపించే పాటను కార్తీక్ తన గానంతో ఒక స్థాయికి తెచ్చాడు. ‘ఈ క్షణం అన్నది నిజమే అయితే.. చూడని రేపుని ఇపుడే కనమా?’ లాంటి హై పిచ్ వచ్చినప్పుడల్లా మిక్కీ మ్యూజిక్, కార్తీక్ గానం కట్టిపడేస్తాయి. ఈ పాట వెంటనే ఎక్కేసేలా కాకపోయినా, వినగా వినగా బాగా ఆకట్టుకుంటుంది.

Naidorintikada5. పాట : నాయుడోరింటికాడ
గాయనీ గాయకులూ : అంజనా సౌమ్య, రమ్య బెహరా
సాహిత్యం : –

‘నాయుడోరింటికాడ’ అన్న జానపద గీతానికి మిక్కీ జే మేయర్ ట్రెండీ మ్యూజిక్ ఇచ్చి చేసిన ఈ ప్రయోగం.. ఈ ఆల్బమ్‌లో డిఫరెంట్ సాంగ్. ఫన్నీ లిరిక్స్‌కు అంజనా సౌమ్య, రమ్య బెహరా ఇద్దరి గానం తోడై ఈ పాటకు మంచి ఫీల్ తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా విజువల్స్‌తో, సినిమాలో వచ్చే సందర్భంతో కలిపి చూసినప్పుడు ఈ పాట బాగా ఆకట్టుకుంటుందని ఆశించొచ్చు. వినగా వినగా సింగర్స్ ప్రతిభతో ఈ పాట బాగా ఎక్కేస్తుంది.

Bala-Tripuramani6. పాట : బాల త్రిపురమణి
గాయనీ గాయకులూ : రాహుల్ నంబియార్
సాహిత్యం : కృష్ణ చైతన్య

‘బాల త్రిపురమణి’ అంటూ సాగే ఈ పాట ఆల్బమ్‌లో ట్యూన్ పరంగా ఇన్స్‌టెంట్‌గా ఎక్కేస్తూ, బెస్ట్ అనిపించుకునే అవకాశం ఉన్న పాట. కృష్ణ చైతన్య ఎప్పట్లానే తన స్టైల్‌లో ఓ మంచి యూత్‌ఫుల్ పాటకు అవసరమైన సాహిత్యం అందించారు. మిక్కీ జే మేయర్ వాడిన పరికరాలన్నీ శ్రోతలందరికీ వినగానే ఆకట్టుకునేలా ఉన్నాయి. రాహుల్ నంబియార్ ఈ పాటను పాడిన విధానం కూడా చాలా బాగుంది. మహేష్-కాజల్‌ల కెమిస్ట్రీతో స్క్రీన్‌పై చూశాక ఈ పాట స్థాయి మరింత పెరుగుతుందనే చెప్పొచ్చు. ఈ ఆల్బమ్‌లో బ్రహ్మోత్సవంతో పోటీగా ఈ పాట పాపులర్ అయ్యే అవకాశం ఉంది.

foot7. పాట : పుట్ యువర్ హ్యాండ్స్ అప్
గాయనీ గాయకులూ : శ్రావణ భార్గవి, మిక్కీ జే మేయర్
సాహిత్యం : కృష్ణ చైతన్య

‘పుట్ యువర్ హ్యాండ్స్ అప్’ పాట ఈ ఆల్బమ్‌లో వచ్చే ఓ రొటీన్ పార్టీ సాంగ్. ట్యూన్ పరంగా ఈ పాటలో చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. ఒక నార్మల్ పార్టీ సాంగ్‌లా మాత్రమే దీన్ని చూడొచ్చు. శ్రావణ భార్గవి, మిక్కీ జే మేయర్‌ల గానం కూడా అందుకు తగ్గట్టుగానే ఉంది. కృష్ణ చైతన్య అందించిన సాహిత్యం మాత్రం చాలా బాగుంది. విజువల్స్ బాగుండి, సినిమాలో మంచి సందర్భంలో వస్తే ఈ పాటకు ఓ స్థాయి ఉంటుందని మాత్రం ఆశించొచ్చు.

తీర్పు :

‘బ్రహ్మోత్సవం’.. ఈ సీజన్‌కు ముందు నుంచే ఫిక్స్ అయిన సినిమాల్లో భారీ అంచనాలను నింపుకున్న క్లాస్ ఫ్యామిలీ ఎంటర్‌‍టైనర్. ఈ నేపథ్యంలోనే సినిమాకు మొదటి సక్సెస్‌గా భావించే ఆడియో ఎలా ఉండనుందన్నది కూడా అభిమానుల్లో బాగా ఆసక్తి రేపిన ప్రశ్న. ఇక ఆ ప్రశ్నకు సమాధానంగా మన ముందుకు వచ్చేసిన ఆడియో, ఒక పూర్తి స్థాయి క్లాస్ సినిమాలో ఏయే పాటలకు ప్రాధాన్యతనిస్తారో అలాంటి పాటలకే ప్రధాన్యతనిస్తూ వచ్చింది. మిక్కీ జే మేయర్ తన స్టైల్‍లోనే ఓ ట్రెండీ క్లాస్ ఆల్బమ్‌ను ఇచ్చే క్రమంలో మంచి విజయం సాధించారనే చెప్పాలి. ఎక్కువగా సందర్భానుసారంగా, కథ ప్రకారంగా చూస్తే కనెక్ట్ అయ్యే పాటలున్న ఈ ఆల్బమ్‌లో ‘బాలా త్రిపురమణి’, ‘బ్రహ్మోత్సవం’, ‘వచ్చింది కదా అవకాశం’ పాటలను హైలైట్‌గా చెప్పుకోవచ్చు. ఇక ‘ఆటపాటలాడు’, ‘నాయుడోరింటికాడ’ పాటలు సినిమాలో సందర్భానుసారంగా చూస్తే నచ్చే అవకాశమున్నవి. చివరిమాటగా చెప్పాలంటే.. సూపర్ స్టార్ మహేష్ ఉన్నాడు కదా అని ఫార్ములా జోలికి వెళ్ళకుండా పూర్తిగా కథకే పరిమితమవుతూ శ్రీకాంత్ అడ్డాల-మిక్కీ జే మేయర్ తమ శక్తిమేర ఓ మంచి ఆల్బమ్‌నే అందించడంలో విజయం సాధించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు