సమీక్ష : ఛాలెంజ్ – టైటిల్ అంత స్ట్రాంగ్ గా లేదు.

challenge-review

విడుదల తేదీ : 31 జూలై 2015

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

దర్శకత్వం : ఎం. శరవణన్

నిర్మాత : గోపీచంద్ పండగ

సంగీతం : డి.ఇమాన్

నటీనటులు : జై, ఆండ్రియా జెరేమియా..

గతంలో తమిళం నుంచి తెలుగులోకి డబ్ అయిన ‘జర్నీ’ సినిమా తెలుగులో మంచి విజయం సాధించింది. జర్నీ సినిమా డైరెక్టర్ ఎం. శరవణన్, హీరో జై కాంబినేషన్ లో వచ్చిన మరో తమిళ సినిమా ‘వాలియవన్’. ఈ ఏడాది మార్చిలో తమిళ్లో రిలీజ్ అయిన ఈ సినిమాని గోపీచంద్ పండగ ‘ఛాలెంజ్’ పేరుతో తెలుగులోకి డబ్ చేసారు. ఆండ్రియా జెరేమియా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ ఛాలెంజ్ ఉందనేది ఇప్పుడు చూద్దాం..

కథ :

వినోద్(జై) ఓ పెద్ద షాపింగ్ మాల్ లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తూ ఉంటాడు. ఫ్రెండ్స్ తో సరదాగా ఎంజాయ్ చేసే వినోద్ గొడవలకి కాస్త దూరంగా ఉంటాడు. అలాంటి వినోద్ కి ఓ రోజు సుభిక్ష అలియాస్ సుభి(ఆండ్రియా జెరేమియా) దార్లో ఎదురుపడి లవ్ ప్రపోజ్ చేస్తుంది. కానీ వినోద్ మాత్రం అది నిజం కాదని వెళ్ళిపోతాడు. కానీ మనసులో ఎక్కడో ఒకవేళ నిజమైతే ఆ అమ్మాయిని మిస్ చేసుకున్నట్టు అవుతా అని తనని రోజూ వెతకడం మొదలు పెడతాడు. కానీ తను కనపడదు, ఒకరోజు సుభినే వినోద్ ని వెతుక్కుంటూ వచ్చి, తనకి వాళ్ళిద్దరి మధ్యా జరిగిన ఫస్ట్ మీటింగ్ గురించి చెబుతుంది. అక్కడి నుంచి ఇద్దరూ లవర్స్ అవుతారు.

ఆ సమయంలోనే సుభి ఓ కండిషన్ పెడుతుంది. అదేమిటంటే ఒలంపిక్స్ లో ఇండియా తరపున కిక్ బాక్సింగ్ లో పార్టిసిపేట్ చేసి రన్నర్ గా నిలిచిన అశ్విన్(అరణ్ చౌదరి)ని కొట్టమని చెబుతుంది. అతన్ని కొట్టమనగానే ఏమీ ఆలోచించకుండా వినోద్ ఓకే అంటాడు. దాంతో అక్కడి నుంచి వినోద్ కిక్ బాక్సింగ్ నేర్చుకోవడం మొదలు పెడతాడు. అలా బాక్సింగ్ నేర్చుకోవడం మొదలు పెట్టిన వినోద్ అశ్విన్ ని కొట్టాడా.? లేదా.? అసలు సుభి ఎందుకు అశ్విన్ ని కొట్టమంది.? గొడవలకి దూరంగా ఉండే వినోద్ అశ్విన్ ని కొట్టాలి అనగానే వెంటనే ఎందుకు ఒప్పుకుంటాడు.? అనే విషయాలకు సమాధానం తెలియాలంటే ఈ సినిమా చూడాలి.

ప్లస్ పాయింట్స్ :

మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ మూవీ ‘ఛాలెంజ్’ అనే టైటిల్ ని ఈ సినిమాకి పెట్టడం మొదటి ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఇక సినిమా పరంగా చూసుకుంటే శరవణన్ రాసుకున్న కొన్ని కామెడీ సీన్స్ ఆన్ స్క్రీన్ బాగా వర్క్ అవుట్ అయ్యాయి. వీటన్నిటికంటే మించి తను యాక్షన్ ఎపిసోడ్స్ ని రాసుకోవడం మరియు వాటిని తీసిన విధానం చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ సరదాగా ఉంటే సెకండాఫ్ చాలా సీరియస్ గా ఉంటుంది. సెకండాఫ్ లో వచ్చే చిన్న ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ మాస్ ఆడియన్స్ ని అమితంగా ఆకట్టుకోవడమే ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్.

ఇక నటీనటుల విషయానికి వస్తే.. జై నటన చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ లో అమాయకుడిగా, లవర్ బాయ్ గా కనిపించి, సెకండాఫ్ లో సీరియస్ గా కనిపిస్తూ అందరినీ మెప్పించాడు. చివర్లో తను సిక్స్ ప్యాక్ లుక్ లో చేసే ఫైట్ బాగుంది. హీరోయిన్ ఆండ్రియా జెరేమియా సినిమలో చాలా క్యూట్ గా కనిపిస్తుంది. మోడ్రన్ లుక్ లో బాగా గ్లామరస్ గా కనిపించి ముందు బెంచ్ వారిని ఆకట్టుకుంది. జై – ఆండ్రియా ల మధ్య కెమిస్ట్రీ బాగుంది. వీరి కాంబినేషన్ లో వచ్చే సీన్స్ కొన్ని బాగా నవ్వు తెప్పిస్తాయి. నెగటివ్ షేడ్స్ లో అరణ్ చౌదరి పెర్ఫార్మన్స్ డీసెంట్ గా ఉంది. పెరుమాళ్, అనుపమ కుమార్, బాలలు తమ పాత్రల పరిధిమేర నటించారు.

మైనస్ పాయింట్స్ :

‘ఛాలెంజ్’ సినిమాకి మొదటి మైనస్ ఏమిటంటే.. ఈ సినిమా టైటిల్ లో ఉన్నంత స్ట్రాంగ్ కంటెంట్ సినిమాలో లేకపోవడం. శరవణన్ ప్రతిసారి సిపుల్ కాన్సెప్ట్ ని తీసుకొని దానికి స్క్రీన్ ప్లే తో గ్రిప్పింగ్ గా చెప్పాలని ట్రై చేస్తాడు. కానీ ఈ సారి స్క్రీన్ ప్లే పరంగా ఫెయిల్ అయ్యాడు. దానికి కారణం ఈ సినిమాలో చెప్పాలనుకున్న పాయింట్ మరీ చిన్నది కావడం, దాన్ని సెకండాఫ్ చివర్లో రివీల్ చేయ్యలనుకోవడంతో లవ్ ట్రాక్ ని ఎక్కువసేపు రాసుకోవాల్సి వచ్చింది. దాంతో లవ్ ట్రాక్ ని మరీ సాగదీసేసి ఆడియన్స్ ని బోర్ కొట్టించేసాడు. ఫస్ట్ హాఫ్ లో అక్కడక్కడా కొన్ని కామెడీ బిట్స్ వర్క్ అవుట్ అయినా ఓవరాల్ గా మాత్రం మరీ సాగదీసేసాడు అనే ఫీలింగ్ వస్తుంది.

చెప్పాలంటే ఈ సినిమాని షార్ట్ అండ్ స్వీట్ గా రెండు గంటల్లోపే ఫినిష్ చేసేసి ఉంటే సినిమా చాలా బెటర్ గా ఉండేది. అల్లాగే సెకండాఫ్ లో హీరో కిక్ బాక్సింగ్ ట్రైనింగ్ ఎపిసోడ్ ని ఇంకాస్త ఆసక్తికరంగా తీయాల్సింది. ఎందుకు అంటే తన ట్రైనింగ్ అంత ఎఫెక్టివ్ గా ఉండదు, ప్రతి చోటా ఓడిపోతూ ఉంటాడు దానివల్ల చివర్లో కిక్ బాక్సింగ్ చాంపియన్ ని కొట్టేయడం అనేది నమ్మశక్యంగా ఉండదు. అలాగే సినిమాలో పాటలు వద్దన్నా వస్తూనే ఉంటాయి. అన్ని పాటలు ఈ సినిమాకి అస్సలు అవసరం లేదు. ఈజీగా మూడు, నాలుగు పాటల్ని లేపెయవచ్చు. అలాగే సినిమాలో మొత్తం తమిళ నటీనటులే ఉండడం వలన తెలుగు ప్రేక్షకులు అంత తొందరగా సినిమాకి కనెక్ట్ అవ్వరు.

సాంకేతిక విభాగం :

టెక్నికల్ డిపార్ట్మెంట్ లో ఈ సినిమాకి హెల్ప్ అయిన విషయాలు రెండున్నాయి. అవే సినిమాటోగ్రఫీ అండ్ మ్యూజిక్. దినేష్ కృష్ణన్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. తనకిచ్చిన లొకేషన్స్, నైట్ ఎఫెక్ట్ లో వచ్చే సీన్స్ ని బాగా కాప్చ్యూర్ చేసాడు. డి. ఇమాన్ అందించిన పాటల తెలుగు డబ్బింగ్ పెద్దగా హెల్ప్ అవ్వలేదు, అది పక్కన పెడితే తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సినిమాకి పెద్ద హెల్ప్ అయ్యింది. సుబారక్ ఎడిటింగ్ బాలేదు. చాలా పాటలని, ఫస్ట్ హాఫ్ లోని చాలా సీన్స్ ని సింపుల్ గా కత్తిరించి పారేయవచ్చు. అలా చేసి ఉంటే సినిమా బాగుండేది. తెలుగులో శశాంక్ వెన్నెలకంటి రాసిన డైలాగ్స్ బాగున్నాయి. గోపీచంద్ పండగ తెలుగు డబ్బింగ్ విలువలు బాగున్నాయి.

తీర్పు :

తమిళం నుంచి తెలుగులో డబ్ అయిన ‘ఛాలెంజ్’ సినిమా తెలుగు ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది. చూడటానికి టైటిల్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నా కంటెంట్ పరంగా వీక్ అవడంతో థియేటర్స్ లో ఆడియన్స్ బోర్ ఫీలవుతారు. కంటెంట్ ని ఇంకాస్త స్ట్రాంగ్ గా రాసుకొని సినిమా రన్ టైంని తగ్గించుకొని ఉంటే ఈ సినిమా రిజల్ట్ వేరేలా ఉండేది. ఫస్ట్ హాఫ్ లో కొన్ని కామెడీ బిట్స్, సెకండాఫ్ లో వచ్చే కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్, ముగింపు బాగుండడం సినిమాకి మేజర్ ప్లస్ అయితే, బోరింగ్ అండ్ సాగదీసిన ఫస్ట్ హాఫ్, స్క్రీన్ ప్లే, లాంగ్ రన్ టైం, లెస్ కామెడీ చెప్పదగిన మైనస్ పాయింట్స్. సెకండాఫ్ లో వచ్చే చివరి 40 నిమిషాలు బాగున్నా చాలు, మిగతా అంతా భరించగలం అనుకునే వారు ఈ ‘ఛాలెంజ్’ సినిమాని చూడచ్చు.

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం :