సమీక్ష : C/o గోదావరి – అక్కడక్కడా ఆకట్టుకున్న గోదావరి ప్రేమ కథ !

C/O Godavari movie review

విడుదల తేదీ : ఫిబ్రవరి 24, 2017

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

దర్శకత్వం : రాజా రామ్మోహన్

నిర్మాతలు : తూము రామారావు , బొమ్మన సుబ్బారాయుడు, రాజేష్ రంబాల

సంగీతం : రఘు కుంచే

నటీనటులు : రోహిత్, శ్రుతివర్మ, దీపు నాయుడు


గ్రామీణ నైపథ్యంలో రూపొదించబడిన సినిమాలు చాలా వరకు చాలా సహజంగా ఉండి మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంటాయి. అలాంటి ఆసక్తికరమైన గ్రామీణ నైపథ్యంలో రూపొందించబడిన చిత్రమే ఈ ‘C/o గోదావరి’. ఈరోజే విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ :
గోదావరి ప్రాంతంలో ఉండే ఒక గ్రామంలో నివసించే సుబ్బు అతని స్నేహితులు ఎలాంటి లక్ష్యం లేకుండా అల్లరి చిల్లరగా తిరుగుతూ వాళ్ళ తల్లిదండ్రులను ఇబ్బడిపెడుతుంటారు. అలాంటి సమయంలోనే సుబ్బు స్నేహితులు అతను అదే గ్రామంలో ఉన్న గ్రామ పెద్ద కుమార్తె సునందతో ప్రేమలో ఉన్నాడని సరదాగా ప్రచారం చేస్తారు.

ఆ ప్రచారం కాస్త తీవ్రంగా మారి సుబ్బు, సునందలకు అనేక సమస్యలు తెచ్చిపెడుతుంది. సునంద అన్నయ్య సుబ్బును తీవ్రంగా కొట్టి గ్రామంలోంచి వెళ్ళగొడతాడు. అలా ఊరిలోంచి గెంటివేయబడ్డ సుబ్బు తాను చేసిన తప్పుల్ని ఎలా తెలుసుకున్నాడు ? జీవితంలో గొప్ప స్థాయికి ఎలా ఎదిగాడు అన్నదే తెరపై నడిచే కథ.

ప్లస్ పాయింట్స్ :

సినిమాలోని బలాల్లో ప్రధానమైనది నిర్మాణ విలువలు. ఒక చిన్న గ్రామంలో సినిమాను తీసిన విధానం చాలా బాగుంది. కొన్ని ప్రధానమైన పాత్రలను ఎంచుకున్న తీరు, ఆ పాత్రల్లో నటీనటుల నటన బాగున్నాయి. ఫస్టాఫ్ లో గోదావరి యాసతో పండించిన కామెడీ బాగుంది. విలన్ పాత్రలో నటించిన నటుడి నటన బాగా ఆకట్టుకుంది.

ఇంటర్వెల్ సన్నివేశం మరియు స్నేహితుల మధ్య పండించిన హాస్యం కాస్త బాగున్నాయి. ఫస్టాఫ్ అంతా మంచి డైలాగ్స్, ఎమోషన్ తో, సరదా సన్నివేశాలతో సాగుతూ బాగుండి సెకండాఫ్ మీద ఆశలు పెట్టుకునేలా చేయడంలో సక్సెస్ అయింది. అలాగే అందులో వచ్చే ఫ్యామిలీ ఎమోషన్ కూడా ఆకట్టుకుంది. పోసాని కృష్ణ మురళి తన పాత్రతో సినిమాను వివరించిన విధానం బాగుంది.

మైనస్ పాయింట్స్ :

సినిమాలోని ప్రధాన మైనస్ పాయింట్లలో ముఖ్యమైనది అసందర్బంగా వచ్చే పాటలు. సినిమా పాటతోనే ఆరంభమవడం, రొమాంటిక్ సన్నివేశంలో కూడా పాట రావడం కాస్త ఇబ్బంది పెట్టింది. సినిమా మొదటి 15 నిముషాల్లోనే 3 పాటలు రావడం కథనాన్ని కాస్త దెబ్బతీసింది.

అలాగే స్పెషల్ సాంగ్ ను కూడా బలవంతంగా సినిమాలో ఇరికించడం వలన చిరాకు కలిగింది. మొదటి భాగమంతా మంచి సన్నివేశాలతో నడిచి సెకండాఫ్ బాగుంటుంది అనే ఆశలు పెట్టుకున్న సమయంలో హీరో ఉన్నట్టుండి ధనవంతుడవడం వంటి పేలవమైన రొటీన్, బోరింగ్ సన్నివేశాలు రావడంతో నిరుత్సాహం కలిగింది.

ముందే ఊహించగలిగిన కొన్ని సన్నివేశాలు సినిమా కథానాన్ని పూర్తిగా నిదానించేలా చేశాయి. సాధారణమైన కుర్రాడి పాత్రలో హీరో భావోద్వేగాలు, అతను ఉన్నట్టుండి పూర్తిగా మారిపోవడం వంటివి సినిమాలో డెప్త్ మిస్సయ్యేలా చేశాయి. సినిమా మొత్తాన్ని తన భుజాల మీద మోయడంలో, ఒక బలమైన విలన్ కు ఎదురు నిలబడటంతో హీరో పాత్ర విఫలమైంది.

సాంకేతిక విభాగం :

ముందే చెప్పినట్టు సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి. సంగీత దర్శకుడు రఘు కుంచె అందించిన పాటలు బాగున్నాయి. కానీ వాటిని సినిమాలో అనవసరమైన సందర్భాలలో వాడటం జరిగింది. గోదావరి యాసలో రాసిన డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ఫస్టాఫ్ కథనం బాగున్నా సెకండాఫ్ కు వచ్చే సరికి అది పూర్తిగా నెమ్మదించి క్లారిటీ లేకుండా తయారైంది. ఎడిటింగ్ పర్వాలేదు.

ఇక దర్శకుడి విషయానికొస్తే అతను చేయవలసిన పనిని సగంలోనే వదిలేశాడనిపిస్తుంది. అతను తీసుకున్న కథ సాధారణమైనదే అయినా దాన్ని ఒక చిన్న గ్రామంలో తీయడం, ఫస్టాఫ్ లో కాస్త ఎంటర్టైన్మెంట్ అందివ్వడం వంటివి బాగానే ఉన్నా సెకండాఫ్లో అతని పని అస్సలు ఆకట్టుకోకపోగా నిరుత్సాహపరిచింది కూడా.

తీర్పు :
గ్రామీణ నైపథ్యంలో రూపొందిన ఈ ‘C/o గోదావరి’ చిత్రం ఫస్టాఫ్ కొన్ని ఆహ్లాదకరమైన సన్నివేశాలతో, కాస్త కామెడీతో, మంచి డైలాగ్స్, చిన్నపాటి ట్విస్టులతో ఆకట్టుకున్నా ఊహాజనితమైన, బోరింగ్, రొటీన్ సెకండాఫ్, అసందర్బంగా వచ్చే పాటలు సినిమా కథనాన్ని దెబ్బతీసి, చాలా నిరుత్సాహం కలిగించాయి. మొత్తం మీద ఫస్టాఫ్ మాత్రమే చూడగలిగే విధంగా ఉన్న ఈ చిత్రం బిలో యావరేజ్ గా మిగిలింది.

123telugu.com Rating : 2.5/5

Reviewed by 123telugu Team

Click here for Telugu Review

సంబంధిత సమాచారం :

More