సమీక్ష : కాలేజ్ కుమార్ – ఎమోషన్ మిస్సైన తండ్రి కొడుకుల కథ

విడుదల తేదీ : మార్చి 06, 2020

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు :  రాహుల్ విజయ్, రాజేంద్ర ప్రసాద్, మధుబాల, ప్రియా వడ్లమాని, నాజర్, మనో బాల తదితరులు

దర్శకత్వం : హరి సంతోష్

నిర్మాత‌లు : ఎల్ పద్మనాభ

సంగీతం :  కుతుబ్ ఇ క్రిప

సినిమాటోగ్రఫర్ : గురు ప్రశాంత్ రాయి

ఎడిటర్ : గ్యారీ బి హెచ్, పవన్ కళ్యాణ్

రాహుల్ విజయ్, ప్రియా వడ్లమాని జంటగా రాజేంద్ర ప్రసాద్, మధుబాల ప్రధాన పాత్రలలో తెరకెక్కిన చిత్రం కాలేజ్ కుమార్. నేడు ఈ చిత్రం విడుదలైంది. మరి ఈ మూవీ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం.

 

కథ : 
శశి కుమార్(రాజేంద్ర ప్రసాద్) ప్యూన్ కావడం వలన తనకు ఎదురైన అవమానాల కారణంగా తన కొడుకు శివ కుమార్(రాహుల్ విజయ్)ని బాగా చదివించి ఆడిటర్ ని చేయాలని సంకల్పం పెట్టుకుంటాడు. చదువు అంతగా వంటబట్టని శివ కుమార్ తండ్రిని మోసం చేస్తూ తను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని నమ్మిస్తాడు. ఐతే ఎగ్జామ్స్ లో కాపీ కొడుకుతూ దొరికిపోయిన శివ కుమార్ కాలేజీ నుండి డిబార్ చేయబడతాడు. దీనితో కొడుకుని నిలదీసిన తండ్రితో చదవడం చాలా కష్టం అది నువ్వు చేసి చూపించు, నేను నిన్ను చదివించే బాధ్యత తీసుకుంటాను అని శివ కుమార్ ఛాలెంజ్ చేస్తాడు. అలా తండ్రిని చదివించే బాధ్యత కొడుకు, కొడుకులా చదివి పాసవ్వాల్సిన బాధ్యత తండ్రి తీసుకుంటాడు. మరి శశి కుమార్ చదివి పాసయ్యాడా? కుటుంబ పోషణ, తండ్రి చదువు బాధ్యత తలకెత్తుకున్న శివ కుమార్ నెరవేర్చడా? ఒకరి బాధ్యతలు మరొకరు తలకెత్తుకున్న ఈ తండ్రి కొడుకుల కథ ఎలా ముగిసింది అనేది మిగతా కథ.

 

ప్లస్ పాయింట్స్:

హీరో రాహుల్ విజయ్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. అతన్ని చూస్తే మంచి హీరో మెటీరియల్ అన్న భావన కలుగుతుంది. ఇక యాక్షన్ మరియు నటన పరంగా కూడా చాలా వరకు మెప్పించాడు.

సినిమాలో హీరో తండ్రి పాత్ర చేసిన రాజేంద్ర ప్రసాద్ కొడుకు భవిష్యత్ కొరకు ఆరాటపడే వాడిగా, వయసుమళ్ళిన కాలేజీ స్టూడెంట్ గా భిన్న వేరియేషన్స్ చూపించి తన నటనానుభవం చూపించారు. సెకండ్ హాఫ్ మొత్తం రాజేంద్ర ప్రసాద్ నడిపించేశారు. రాజేంద్ర ప్రసాద్ భార్య పాత్ర చేసిన మధుబాల కూడా ప్రాధాన్యం ఉన్న పాత్ర దక్కించుకొని మంచి నటనతో ఆకట్టుకున్నారు.

తెలుగు అమ్మాయి ప్రియా వడ్లమాని ఫస్ట్ హాఫ్ లో వచ్చిన డ్యూయెట్ సాంగ్ లో గ్లామర్ తో ఆకట్టుకుంది. సెకండ్ హాఫ్ లో మాత్రం ఆమె పాత్రకు ప్రాధాన్యం లేదు. ఇక హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన నటుడు, కాలేజీ ప్రొఫెసర్ గా చేసిన మనో బాల మరియు నాజర్ నటన బాగుంది.

 

మైనస్ పాయింట్స్:

కాలేజ్ కుమార్ ఒక ఓల్డ్ స్కూల్ ఎమోషనల్ డ్రామా అని చెప్పాలి. పేద తండ్రి కొడుకు భవిష్యత్ కోసం పోరాడుతుంటే కొడుకు అల్లరి చిల్లరిగా తిరగడం అనేది ఇప్పటికే చాల సినిమాలలో చూపించేశారు. కాకపోతే కొడుకు తండ్రిని చదివిండం అనేది చాలా కొత్త పాయింట్ అన్న భావనలో దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

ఇక ఈ సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం ఓ పదిహేనేళ్ల క్రితం సక్సెస్ ఫార్ములాగా ఉన్న కాలేజీ కామెడీ, లవ్ ట్రాక్ అన్న రీతిలో సాగింది. ఐతే ఇక్కడ హ్యూమర్ కానీ, ప్రియా వడ్లమానితో లవ్ ట్రాక్ కానీ వర్క్ అవుట్ కాలేదు. అలాగే కథకు సంబంధం లేకుండా అక్కడక్కడా కొంచెం మసాలా డబుల్ మీనింగ్ డైలాగ్స్ కూడా వాడేశారు.

ఇక సెకండ్ హాఫ్ మొత్తం వయసు మళ్ళిన కాలేజ్ కి వెళ్లే తండ్రిగా రాజేంద్ర ప్రసాద్ పాత్ర చేత కామెడీ పండించాలని చూసినా అది వర్క్ అవుట్ కాలేదు. అప్పటి దాకా కొడుకు భవిష్యత్ కోసం తపించిన తండ్రి, కొడుకు నానా కష్టాలు పడుతూ పనికి రాకుండా పోతుంటే, ఛాలెంజ్ కోసం ఎమోషన్ వదిలేసి హ్యాపీగా కాలేజ్ కి వెళ్లడం నమ్మ శక్యం కాని విషయం. క్లైమాక్స్ కూడా చాల సినిమాటిక్ గా ముగించి, సినిమా మొదలుకి ముగింపుకు సంబంధం లేకుండా పోయింది.

 

సాంకేతిక విభాగం:

ఈ సినిమాలో మొదటి సగంలో హీరో హీరోయిన్ మధ్య వచ్చే రొమాంటిక్ డ్యూయెట్ సాంగ్ బాగుంది. బీజీఎమ్ ఏమాత్రం ఆకట్టుకోదు. ఇక కెమెరా పనితనం పరవాలేదు. ఎడిటింగ్ పై ఇంకొంచెం శ్రద్ద పెట్టాల్సింది. సెకండ్ హాఫ్ లో చాల సన్నివేశాలు రీపీట్ అవుతున్న భావన కలిగింది. నిర్మాణ విలువలు కొంత మేర మెరుగ్గానే ఉన్నాయి.

ఇక దర్శకుడు గురించి చెప్పాలంటే తండ్రి బాధ్యత కొడుకు, కొడుకు బాధ్యత తండ్రి తీసుకుంటే పరిస్థితి ఏమిటీ అనేది విషయాన్ని ఎమోషన్ కి మించి హ్యూమర్ తో చెప్పాలనుకుని ఏది వర్క్ అవుట్ కాక ఇబ్బంది పెట్టాడు. ఆయన రాసుకున్న సన్నివేశాలలో ఎటువంటి కొత్తదనం లేకపోవడం సినిమాకు ఆకర్షణ చేకూర్చలేకపోయింది.

 

తీర్పు:

 

ఓల్డ్ స్కూల్ ఫార్మట్ లో సాగే కాలేజ్ కుమార్ అంతగా ఆకట్టుకోదు. తాను ఎంచుకున్న కథను ఎమోషన్ తో మొదలుపెట్టి హ్యూమర్ ముగించాలనుకున్న దర్శకుడు ప్రయత్నం సఫలం కాలేదు. సినిమాలో అటు హ్యూమర్ కానీ, సెంటిమెంట్ కానీ వర్క్ అవుట్ కాలేదు. హీరో రాహుల్ స్క్రీన్ ప్రెజెన్స్, రాజేంద్ర ప్రసాద్ మార్కు నటన ఈ చిత్రంలో ప్రేక్షకులకు కొంచెం ఉపశమనం కలిగించే అంశాలు.

123telugu.com Rating : 2.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం :

More