సమీక్ష : దండుపాళ్యం 2 -ముగింపుకు ఇంకా టైమ్ ఉంది

Dandupalyam 2 movie review

విడుదల తేదీ : జూలై 21, 2017

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

దర్శకత్వం : శ్రీనివాస్ రాజు

నిర్మాత : వెంకట్

సంగీతం : అర్జున్ జన్య

నటీనటులు : సంజన, పూజ గాంధీ, రవి శంకర్, మార్కండ్ దేశ్ పాండే

కన్నడలో ఘన విజయం సాదిబంచి తెలుగులో కూడా డబ్ అయి మంచి విజయాన్ని అందుకున్న చిత్రం ‘దండుపాళ్యం’. ఈ సినిమాకి సీక్వెల్ గా పార్ట్ 2 కూడా రూపొందింది. ఈ రెండవ భాగం ‘దండుపాళ్యం 2’ పేరుతో ఈరోజే విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..

కథ :

మొదటి భాగంలో 80 హత్యలుం దోపిడీలు చేసిన నేరస్థులుగా పోలీసులకు చిక్కి 6 ఏళ్ళ పాటు విచారణ అనంతరం కోర్టు ఒక ఆడ మనిషి కెంపి (పూజ గాంధీ) తో సహా మొత్తం 8 మందికి మరణ శిక్ష విధిస్తుంది. కానీ ప్రముఖ జర్నలిస్ట్ అభివ్యక్తి మాత్రం వాళ్ళు అమాయకులని నమ్మి ఆ కేసును ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెడుతుంది. అలా ఇన్వెస్టిగేషన్ కు దిగిన ఆమె తన విచారణను ఎలా కొనసాగించింది ? ఎలాంటి నిజాలు తెలుసుకుంది ? ఆమె అనుకుంటున్నట్టు దండుపాళ్యం గ్యాంగ్ నిర్దోషులేనా ? అసలు వారి జీవితం ఎలా ఉండేది ? అనేదే ఈ సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :

దండుపాళ్యం మొదటి భాగంలో గ్యాంగ్ మొత్తం హత్యలు, దోపిడీలు చేస్తూ అందరినీ బయపెట్టడాన్ని, పోలీసులు నానా తిప్పలు పడి వాళ్ళను పట్టుకోవడాన్ని చూపించి దండుపాళ్యం పేరు చెబితేనే కరుడుగట్టిన హంతకులు గుర్తొచ్చేలా చేసిన దర్శకుడు శ్రీనివాస్ రాజు ఈ రెండవ భాగంలో మాత్రం వాళ్ళసలు ఆ నేరాలు చేశారా చేయలేదా, పోలీసులే తప్పుడు సాక్ష్యాలతో వాళ్ళను ఇరికించారా అనే అనుమానాన్ని రేకెత్తించి ఆరంభంలోనే సినిమాపై మంచి ఆసక్తి కలిగేలా చేశారు.

అలాగే సంజన, పూజ గాంధీ, రవి శంకర్, మార్కండ్ దేశ్ పాండే, రవి కాలే వంటి నటీనటులు చాలా సహజంగా నటించి సినిమాకు ఒళ్ళు గగుర్పొడిచే అనుభూతిని తీసుకొచ్చారు. ముఖ్యంగా పోలీసులు అమాయకులైన ఆ 12 మంది చేత చేయని తప్పును ఒప్పించడానికి చేసే ఇంటరాగేషన్ సన్నివేశాలు, డబ్బు, నా అనే వాళ్ళు లేని అభాగ్యులు పడే కష్టాలను చూపించిన విధానం చాలా రియలిస్టిక్ గా అనిపించాయి.

మైనస్ పాయింట్స్ :

సినిమా రెండవ భాగంలో దండుపాళ్యం ముఠా నేరస్థులు కారేమో అనే రీతిలో కథనాన్ని నడిపిన దర్శకుడు శ్రీనివాస్ రాజు చిత్రం చివర్లో ఎలాంటి కంక్లూజన్ ఇవ్వకుండా చిత్రాన్ని మూడవ భాగానికి పొడిగించడంతో కాస్తలో చెప్పాల్సిన అంశానికి ఒక సినిమానే తీయాల్సిన అవసరం లేదనే భావం కలిగింది.

అలా కాకుండా పోలీసులు ముఠాను కేసులో ఇరికించడం అనే ఎపిసోడ్ ను కొంచెంలో చూపించి, 3వ భాగంలో ఇవ్వాలనుకున్న వివరణ ఏదో ఈ రెండవ భాగంలోనే ఇచ్చేసి ఉంటే దండుపాళ్యం ముఠా నిజంగా నేరస్తులేనా లేకపోతే పోలీసులు చేసిన అన్యాయం వలన మనసు గాయపడి వాళ్ళు హంతకులుగా మారారా, అలా అయితే మొదట్లో హత్యలు చేసింది ఎవరు, చివరికి దండుపాళ్యం ముఠా కథ ఏమైంది అనే అంశాలను చెప్పేసి ఉంటే పూర్తి సినిమా చూసిన భావన కలిగుండేది. కానీ దర్శకుడు అలా చేయకుండా సినిమాను మూడవ భాగానికి పొడిగించడంతో నిరుత్సాహం మిగిలింది.

సాంకేతిక విభాగం :

పైన చెప్పినట్టు దర్శకుడు శ్రీనివాస్ రాజు కాస్త లెంగ్త్ ఎక్కువైనా ఈ రెండవ భాగంలోనే కథకు ముగింపు ఇచ్చేసి ఉంటే అది ఎలా ఉన్నా ఒక పూర్తి సినిమా చూసిన భావన కలిగుండేది. కానీ అలా చేయకపోవడంతో సినిమా పట్ల నిరుత్సాహం ఎదురైంది.

ఇక అర్జున్ జన్య అందించిన సంగీతం కొన్ని ముఖ్య సన్నివేశాల్లో బాగుంది. వెంకట్‌ ప్రసాద్‌ సినిమాటోగ్రఫీ చాలా సహజంగా ఉంది. జైలు సన్నివేశాలు, క్రూరమైన విచారణను చూపించిన విధానం బాగుంది. నిర్మాత వెంకట్ పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు :

‘దండుపాళ్యం’ మొదటి భాగం ఇచ్చినంత ఎగ్జైట్మెంట్ ను ఈ రెండవ భాగం ఇవ్వలేకపోయింది. దర్శకుడు శ్రీనివాస్ రాజ్ ఒక్క సినిమాగా చేయాల్సిన కథను రెండుగా చేద్దామని అనుకోవడంతో సరైన వివరణ లేక సినిమా చివర్లో డిస్సప్పాయింట్మెంట్ తప్పలేదు. కానీ చిత్రాన్ని తీసిన విధానం, విచారణ సన్నివేశాలు, దండుపాళ్యం గ్యాంగ్ అమాయకుల అనే భావన కలిగించడం వంటి అంశాలు బాగున్నాయి. మొత్తం మీద చెప్పాలంటే రియలిస్టిక్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా ఓకే కానీ అనవసరపు వెయిటింగ్ ఇష్టంలేని వారికి నిరుత్సాహం తప్పదు.

123telugu.com Rating : 2.75/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం :

More