సమీక్ష: ఈ నగరానికి ఏమైంది – మీ గ్యాంగ్ తో వెళ్లి చూడొచ్చు

Published on Jun 29, 2018 5:15 pm IST
 Ee Nagaraniki Emaindi movie review

విడుదల తేదీ : జూన్ 29, 2018

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

నటీనటులు : విశ్వక్ సేన్ నాయుడు, సుశాంత్ రెడ్డి, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను, అనీషా ఆంబ్రోస్, సిమ్రన్ చౌదరి

దర్శకత్వం : తరుణ్ భాస్కర్

నిర్మాత : డి.సురేష్ బాబు

సంగీతం : వివేక్ సాగర్

సినిమాటోగ్రఫర్ : నికేత్ బొమ్మి

ఎడిటర్ : రవి తేజ గిరిజాల

స్క్రీన్ ప్లే : తరుణ్ భాస్కర్

పెళ్లి చూపులు’ ఫేమ్ తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేసిన తాజా చిత్రం ‘ఈ నగరానికి ఏమైంది ?’. మంచి బజ్ నడుమ ఈ సినిమా ఈరోజూ ప్రీమియర్ల ద్వారా ప్రదర్శితమైంది. మరి మీ గ్యాంగ్ తో థియేటర్ కి రండి చూస్కుందాం అని ఛాలెంజ్ చేసిన తరుణ్ భాస్కర్ ఏ మేరకు ఆ ఛాలెంజ్ ను నిలబెట్టుకున్నారో ఇప్పుడు చూద్దాం..

కథ:

వివేక్ (విశ్వక్ సేన్ నాయుడు), కార్తిక్ (సుశాంత్ రెడ్డి), కౌశిక్ (అభినవ్ గోమఠం), ఉపేంద్ర (వెంకటేష్ కాకుమాను)లు నలుగురు మంచి స్నేహితులు. వీరిలో వివేక్ డైరెక్టర్ అవ్వాలని ప్రయత్నిస్తుంటాడు. కానీ అతని లవ్ బ్రేకప్ అవ్వడంతో అతను డిప్రషన్ లోకి వెళ్లి నలుగురి మధ్య కొంత దూరం పెరుగుతుంది.

అలాంటి సమయంలో ఆ నలుగురిలో ఒకరైన కార్తిక్ కు పెళ్లి కుదరడంతో అందరూ బార్లో కలిసి మందు తాగుతారు. ఆ మత్తులోనే గోవా వరకు వెళ్ళిపోతారు. అలా వెళ్లిన ఆ నలుగురి జర్నీ ఎలా సాగింది, అసలైన జీవితానికి వాళ్ళు తెలుసుకున్న అర్థం ఏమిటి అనేదే తెరపై నడిచే సినిమా.

ప్లస్ పాయింట్స్ :

దర్శకుడు తరుణ్ భాస్కర్ మరోసారి తన రైటింగ్ పవర్ చూపించారు. సాధారణమైన స్టోరీ లైన్ ను తీసుకున్న ఆయన అందులో కొన్నాళ్ళ పాటు గుర్తుండిపోయే నాలుగు పాత్రల్ని రాసి, వాటి చుట్టూ సినిమాను నడపడానికి సరిపడే రీతిలో ఫన్నీ కథనాన్ని అల్లుకున్నారు. దీంతో ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ కలిగింది. ప్రధాన పాత్రలు, వాటి మాటలు చాలా సహజంగా ఉండటంతో ప్రేక్షకులు చాలా త్వరగా వాటికి కనెక్టైపోతారు.

ముఖ్యంగా ప్రధాన పాత్ర వివేక్, అతని స్నేహితుడు కౌశిక్ ల క్యారెక్టర్స్ ను చాలా బాగా డిజైన్ చేశారు తరుణ్ భాస్కర్. వివేక్ పాత్రలో సీరియస్ నెస్ తో కొంత బాధను కూడ మిక్స్ చేసి చూపిన దర్శకుడు కౌశిక్ పాత్రను మాత్రం ఔట్ అండ్ ఔట్ కామెడీతో నింపేసి సినిమా మొత్తం ఎంటర్టైన్ చేశారు. ఆ పాత్రలో మంచి టైమింగ్ తో కూడిన అభినవ్ గోమఠం నటన చాలా ఇంప్రెస్ చేసింది. ఫస్టాఫ్ లో మొదలయ్యే అతని కామెడీ సెకండాఫ్ గోవా చేరుకొని సినిమా ముగిసే వరకు నవ్విస్తూ సరదాగా సాగిపోయింది.

ఇక కథలో జీవితమంటే అసలైన అర్థం తెలుసుకోవడం అనే కాన్సెప్ట్, అందులో జీవితమంటే నచ్చిన వాళ్లతో ఉంటూ, నాలుగు మెతుకులు తింటూ, నచ్చిన పని చేసుకోవడమే అంటూ తరుణ్ భాస్కర్ చెప్పిన అర్థం మనసుని తాకాయి. ఇక మిగిలిన నటీ నటులు సుశాంత్ రెడ్డి, వెంకటేష్ కాకుమాను, అనీషా ఆంబ్రోస్ లు కూడా తమ నటనతో మెప్పించారు.

మైనస్ పాయింట్స్ :

కామెడీ పరంగా ఎలాంటి లోటు లేకుండా సినిమా ఇన్నర్ గా నడిచే ప్రధాన పాత్ర వివేక్ లవ్ స్టోరీ విషయంలో కొంత నెమ్మదిగా, బలహీనంగా అనిపించింది. వివేక్ ప్రేమలో పడటం, ప్రేయసితో అతని లవ్ జర్నీ, విడిపోవడం వంటి కీలకమైన అంశాలను సాదాసీదాగా చూపించారు తరుణ్ భాస్కర్.

ప్రథమార్థం కూడ కొంత సాగదీసిన ఫీలింగ్ కలిగింది. యువతను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ సినిమా రెగ్యులర్ యాక్షన్ ఎంటర్టైనర్లను కోరుకునే వారిని, కుటుంబ ప్రేక్షకుల్ని పూర్తిగా సంతృప్తిపరచలేదు. ఇక ప్రధాన పాత్ర వివేక్ అప్పటి వరకు ఉన్న డిప్రషన్ నుండి బయటకు రావడం, తిరిగి మామూలుగా సరదగా మారిపోవడం, దాని వెనుకున్న కారణాలు కొంత నాటకీయంగా అనిపించాయి.

సాంకేతిక విభాగం :

తరుణ్ భాస్కర్ తాను ఎలాంటి సినిమా అయితే తీయాలి అనుకున్నారో అలాంటి సినిమానే తీసి దర్శకుడిగా, కథకుడిగా సక్సెస్ అయ్యారు. కొంత బోర్ కొట్టించిన లవ్ డ్రామా మినహా ఆయన రాసిన మంచి పాత్రలు, హాస్యపూరితమైన సంభాషణలు, సీన్స్ ఆకట్టుకున్నాయి. సన్నివేశాలను ఆయన తెరకెక్కించిన తీరు కూడ బాగుంది.

సంగీత దర్శకుడు వివేక్ సాగర్ పాటల సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ సహజంగా ఉంది. రవితేజ గిరిజాల ఎడిటింగ్ బాగానే చేశారు. డి. సురేష్ బాబుగారు నిర్మాతగా సినిమాకు తన సహకారాన్ని పూర్తిగా అందించారు.

తీర్పు:

దర్శకుడు తరుణ్ భాస్కర్ విడుదలకు ముందు ఛాలెంజ్ చేసినట్టుగానే కుర్రాళ్ళు తమ గ్యాంగ్ తో కలిసి చూడదగిన సినిమానే అందించారు. ఆయన సృష్టించిన పాత్రలు అన్నీ సహజత్వానికి దగ్గరగా ఉండటం, రాసిన సన్నివేశాలు, సంభాషణలు మంచి కామెడీని జనరేట్ చేస్తూ ఇంప్రెస్ చేసేలా ఉండటం, స్నేహితుల మధ్యన అనుబంధాన్ని ఎలివేట్ చేసే కొన్ని మూమెంట్స్, విశ్వక్ సేన్, అభినవ్ గోమఠంల పెర్ఫార్మెన్స్ వంటి అంశాలతో ఈ సినిమా యువతకు దగ్గరయ్యేదిగా ఉండగా రెగ్యులర్ యాక్షన్ సినిమాల్ని కోరుకునే వారిని, కుటుంబ ప్రేక్షకులను సంతృప్తిపరిచే కంటెంట్ ఇందులో లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే రెగ్యులర్ సినిమాలు చూసి విసుగెత్తిన ఫ్రెండ్స్ గ్యాంగ్స్ కు ఈ చిత్రం మంచి రిలీఫ్ ఇస్తుంది.

123telugu.com Rating : 3.25/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం :