సమీక్ష : ఎఫ్ 2 – సింపుల్ అండ్ ఫన్నీ !

సమీక్ష : ఎఫ్ 2 – సింపుల్ అండ్ ఫన్నీ !

Published on Jan 13, 2019 3:00 PM IST
F2 movie review

విడుదల తేదీ : జనవరి 12, 2019

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

నటీనటులు : వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్, ప్రకాష్ రాజ్, నాజర్, రాజేంద్రప్రసాద్ తదితరులు

దర్శకత్వం : అనిల్‌ రావిపూడి

నిర్మాత : దిల్ రాజు

సంగీతం : దేవీశ్రీ ప్రసాద్

సినిమాటోగ్రఫర్ : సమీర్ రెడ్డి

ఎడిటర్ : తమ్మిరాజు

యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కలయికలో వచ్చిన క్రేజీ మల్టీ స్టారర్ ‘ఎఫ్ 2’ (ఫన్‌ అండ్‌ ఫస్ట్రేషన్‌). దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా.. తమన్నా, మెహరీన్ హీరో హీరోయిన్లుగా నటించారు. కాగా ఈ సంక్రాంతికి ఫుల్ గా నవ్వించడానికి ఈ చిత్రం ఈ రోజే విడుదల అయింది. మరి ఈ సంక్రాంతి అల్లుళ్ళు, ప్రేక్షకులును ఏ మేరకు నవ్వించగలిగారో ఒకసారి సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ :

వెంకీ(వెంకటేష్) ఎమ్ఎల్ఏ దగ్గర పీఏ గా వర్క్ చేస్తుంటాడు. వెంకీ పెళ్లి చేసుకునే క్రమంలో సెల్ఫ్ రస్పెక్ట్, మరియు మొగుడు పై పెత్తనం చేసే మనస్తత్వం ఉన్న తమన్నాతో వెంకీకి పెళ్లి అవుతుంది. మొదటి ఆరు నెలలు ఎంతో సంతోషంగా గడిపిన ఈ జంటలో సహజంగానే చిన్న చిన్న ఇగో ప్రాబ్లమ్స్ మొదలవుతాయి. దాంతో తమన్నా ఫ్యామిలీ వెంకీ పై తమ శైలిలో విరుచుకుపడటం, దాంతో వెంకీ వారి టార్చర్ ని భరించలేక ఆసనాలు వేసుకుంటూ.. తనలోనే తనూ కాంప్రమైజ్ అవ్వలేక నానా అవస్థలు పడుతుంటాడు.

అయితే ఈ ప్రాసెస్ లో తమన్నా సిస్టర్ హాని (మెహరీన్) వరుణ్ (వరుణ్ తేజ్ )తో లవ్ లో పడటం, వారిద్దరిని వెంకీ రెడ్ హ్యాండెడ్ గా పట్టిచ్చే క్రమంలో వారికీ ఎంగేజ్ మెంట్ ఫిక్స్ అవుతుంది. ఇక అప్పటి నుంచీ తమన్నా ఫ్యామిలీ దెబ్బకి వరుణ్ కూడా భార్య బాధితుడిగా మారతాడు. దాంతో వెంకీ -వరుణ్ తమ అత్త ఇంటివాళ్లకి బుద్ది చెప్పడానికి ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం వారి జీవితాలనే మారుస్తుంది. అసలు వీళ్ళు తీసుకున్న నిర్ణయం ఏమిటి ? దానికి వీళ్ళ పై తమన్నా , మెహరీన్ ఎలా రివెంజ్ తీర్చుకున్నారు ? చివరకి ఈ జంటల మధ్య ఉన్న ఈగో ప్రాబ్లెమ్స్ ను ఎలా పరిష్కరించుకున్నారు? ఈ క్రమంలో వెంకీ – వరుణ్ ఎలాంటి సమస్యలను ఎదురుకున్నారు ? లాంటి విషయాలు తెలియాలంటే వెండి తెర పై ఈ చిత్రం చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

మొత్తానికి ఈ సంక్రాంతికి ఫుల్ గా నవ్వించడానికి వచ్చిన సంక్రాంతి అల్లుళ్ళు బాగానే నవ్విస్తున్నారు. ముఖ్యంగా వెంకటేష్ నుంచి ఆయన అభిమానులు ఎలాంటి కామెడీ కోరుకుంటున్నారో ఈ సినిమాలో ఆ టైపు కామెడీ బాగానే వర్కౌట్ అయింది. వెంకటేష్ తన కామెడీ టైమింగ్‌తో మరోసారి ఈ సినిమాకే హైలెట్ గా నిలిచారు. మళ్లీ మనకు ‘నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి’ చిత్రాల్లోని తన కామెడీని గుర్తుకు తెస్తారు. ఈ సినిమాలో ప్రధానంగా వెంకీ, పెళ్లి తర్వాత ఫ్రస్ట్రేషన్ కి గురి అయ్యే సన్నివేశాల్లో గాని, వరుణ్ తేజ్ తో సాగే సన్నివేశాల్లో గాని, అలాగే క్లైమాక్స్ లో కూడా తనలోని కామెడీ యాంగిల్ తో మరియు తన మాడ్యులేషన్ తో వెంకీ బాగా అలరిస్తారు.

మొదటి నుంచి వైవిధ్యమైన చిత్రాలను ఎంచుకుంటూ వస్తోన్న వరుణ్ తేజ్ మొట్ట మొదటి సారిగా ఒక కామెడీ సినిమాలో నటించారు. అయితే వెంకటేష్ కామెడీ టైమింగ్ ముందు వరుణ్ లోని కామెడీ యాంగిల్ పెద్దగా ప్రభావం చూపలేకపోయినా.. ఉన్నంతలో వరుణ్ బాగానే నవ్విస్తాడు. ఇక భర్తను ఇబ్బందులకు ఫ్రస్ట్రేషన్ కి గురి చేసే పెత్తనం గల భార్యగా నటించిన తమన్నా, అదేవిధంగా సేమ్ తమన్నా లాంటి బిహేవియరే కలిగిన మెహరీన్ తమ నటనతో పాటు తమ గ్లామర్ తోనూ ఆకట్టుకున్నారు. తమన్నా ఎప్పటిలాగే బాగా చేయగా.. పెద్దగా ఎక్స్ ప్రెషన్స్ పలికించలేదు అని పేరు ఉన్న మెహరీన్ కూడా ఈ సినిమాలో తన తన పెర్ఫార్మెన్స్ తో మెప్పిస్తోంది.

ఆలగే సినిమాలో ఓ కీలక పాత్రలో నటించిన ఒకప్పటి కామెడీ కింగ్ రాజేంద్ర ప్రసాద్ కూడా తన కామిక్ హావభావాలతో నవ్విస్తారు. ముఖ్యంగా హరితేజకు ఆయనకు మధ్య వచ్చే హాస్య సన్నివేశం కడుపుబ్బా నవ్విస్తోంది. సీనియర్ నటులు నాజర్, ప్రకాష్ రాజ్, అలాగే ప్రకాష్ రాజ్ కొడుకులుగా నటించిన సుబ్బరాజు మరియు సత్యం రాజేష్ లు కూడా తమ నటనతో మెప్పిస్తారు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా చేయగా.. వారి నుండి కూడా అనిల్ రావిపూడి తన మార్క్ కామెడీని రాబట్టుకున్నాడు.

కామెడీని హ్యాండిల్ చేయడంలో ‘పటాస్’ నుంచే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని తనదైన మార్క్ కామెడీతో, తన మార్క్ డైలాగ్ లతో, వరుస విజయాలను అందుకుంటున్న అనిల్ రావిపూడి మరోసారి ఫన్‌ అండ్‌ ఫస్ట్రేషన్‌ తో ఆకట్టుకున్నాడు.

మైనస్ పాయింట్స్ :

దర్శకుడు కామెడీతో ఆకట్టుకున్నప్పటికీ.. కొన్నిసన్నివేశాల్లో మంచి పనితీరుని కనబర్చినప్పటికీ.. కథ విషయంలో మాత్రం అనిల్ రావిపూడి పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. కొన్ని సన్నివేశాలను ఎంటర్ టైన్ గా మలిచినా.. కథా పరంగా ఆ సన్నివేశాలను ఇంకా ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నపటికీ ఆయన మాత్రం వాట్ని సింపుల్ గా నడిపారు.

ఫస్టాఫ్ లో బాగా నవ్వించినా.. సినిమాలో ఫస్టాఫ్ ముగిసే వరకు కథ పై ప్రేక్షకునికి ఒక క్లారిటీ అంటూ రాకపోవడం, సినిమా మొదటి భాగంలో ఉన్నంత కామెడీని.. సెకెండ్ హాఫ్ లో కంటిన్యూ చేయలేకపోవడం, సెకండాఫ్ స్టార్టింగ్ నుంచే బోరింగ్ గా అనిపించడం, కథకే ప్లాట్ పాయింట్ లాంటి ప్రకాష్ రాజ్ ట్రాక్ మరీ సినిమాటిక్ గా సాగడం, దీనికి తోడు సెకెండ్ హాఫ్ లో కొన్ని కీలక సన్నివేశాలు కూడా సరిగ్గా వర్కౌట్ అవ్వకపోవడం వంటి అంశాలు సినిమా స్థాయిని తగ్గిస్తాయి. ఇక వైవిధ్యమైన చిత్రాలను కోరుకునే ప్రేక్షకులు, ఈ సినిమాలో కొత్తధనం ఎక్స్ పెక్ట్ చేసి వెళ్లితే మాత్రం నిరాశ తప్పదు.

అయితే అనిల్ రావిపూడి కథా కథనాల విషయంలో అలాగే ముఖ్యంగా సెకండాఫ్ పై ఇంకా శ్రద్ధ తీసుకోని ఉండి ఉంటే.. ఈ సినిమా మరో స్థాయిలో ఉండేది.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగం విషయానికి వస్తే.. అనిల్ రావిపూడి రచయితగా దర్శకుడిగా ఆకట్టుకునే ప్రయత్నం చేసాడు. కానీ ఆయన కథ కథనాన్ని ఇంకా ఆసక్తికరంగా మలిచి ఉంటే..బాగుండేది.

సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ సమకూర్చిన పాటలు, వాటి పిక్చరైజేషన్ కూడా బాగున్నాయి. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ వర్క్ చాలా బాగుంది. సినిమాలోని యూరప్ సన్నివేశాలన్నీ ఆయన కథకి అనుగుణంగా చాలా అందంగా చిత్రీకరించారు.

తమ్మిరాజు ఎడిటింగ్ బాగున్నప్పటికీ.. సెకెండ్ హాఫ్ లో పండని సీక్వెన్స్ ను సాధ్యమైనంత వరకు ట్రీమ్ చేసి ఉంటే.. సినిమాకి ప్లస్ అయ్యేది. నిర్మాత దిల్ రాజు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయన నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.

తీర్పు :

ముందుగానే చెప్పుకున్నట్లు దర్శకుడు కామెడీతో ఆకట్టుకున్నప్పటికీ.. మరియు ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ లో వచ్చే కొన్ని సన్నివేశాల్లో మంచి పనితీరుని కనబర్చినప్పటికీ.. కథ మరియు సెకెండ్ హాఫ్ విషయంలో మాత్రం అనిల్ రావిపూడి పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. సినిమా మొదటి భాగంలో ఉన్నంత కామెడీని.. సెకెండ్ హాఫ్ లో కంటిన్యూ చేయలేకపోవడం, సెకండాఫ్ స్టార్టింగ్ నుంచే బోరింగ్ గా అనిపించడం, కథకే ప్లాట్ పాయింట్ లాంటి ప్రకాష్ రాజ్ ట్రాక్ మరీ సినిమాటిక్ గా సాగడం, దీనికి తోడు సెకెండ్ హాఫ్ లో కొన్ని కీలక సన్నివేశాలు కూడా సరిగ్గా వర్కౌట్ అవ్వకపోవడం వంటి అంశాలు సినిమాని బలహీనపరుస్తాయి. అయితే వెంకీ తన కామెడీ టైమింగ్ తో, తన డైలాగ్ మాడ్యులేషన్ తో ఈ సినిమాని మరో లెవల్ కి తీసుకు వెళ్లారు. అలాగే వరుణ్ తేజ్ కూడా తన నటనతో ఆకట్టుకున్నాడు. ఆనిల్ రావిపూడి తన శైలి కామెడీతో, తన మార్క్ డైలాగ్ లతో కొన్ని సన్నివేశాల్లో చాలా బాగా ఎంటర్ టైన్ చేశాడు. మొత్తం మీద ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు కామెడీని మాత్రమే ఇష్టపడే వాళ్లకు మాత్రం బాగా నచ్చుతుంది. అయితే మిగిలిన అన్నివర్గాల ప్రేక్షకులని ఎంత వరకు అలరిస్తుందో చూడాలి.

123telugu.com Rating : 3.25/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు