సమీక్ష : జాగ్వార్ – జస్ట్ ఓకే..!

Jaguar review

విడుదల తేదీ : అక్టోబర్ 06, 2016

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

దర్శకత్వం : ఏ. మహదేవ్

నిర్మాత : అనితా కుమారస్వామి

సంగీతం : ఎస్.ఎస్.థమన్

నటీనటులు : నిఖిల్ కుమార్, దీప్తి సతి, జగపతి బాబు, రావు రమేష్..

మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు నిఖిల్ గౌడను హీరోగా పరిచయం చేస్తూ తెలుగు, కన్నడ భాషల్లో సుమారు 75 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమాయే ‘జాగ్వార్’. ట్రైలర్‌తో, ప్రమోషన్స్‌తో మంచి ఆసక్తినే రేకెత్తించిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ జాగ్వార్ ఎంతమేరకు మెప్పించేలా ఉందో చూద్దాం..

కథ :

ఎస్.ఎస్.కృష్ణ (నిఖిల్ కుమార్) మెడిసిన్ చదివే ఓ కుర్రాడు. తన చుట్టూ ఉండే అందరిలానే చదువుకుంటూ, సరదాగా కాలం వెళ్ళదీసే కృష్ణ, రాత్రి వేళల్లో ఓ టీవీ ఛాన‌ల్‍నే హ్యాక్ చేసి, మాస్క్ వేసుకొని పలు హత్యలు చేస్తూ అవి లైవ్‌లో వచ్చేలా చేస్తూంటాడు. ఈ లైవ్ హత్యలను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం ఆ కేసును డీల్ చేయడానికి ఓ సీబీఐ ఆఫీసర్‌ (జగపతి బాబు)ను కూడా నియమిస్తుంది. కృష్ణ ఇలా హత్యలు చేయడానికి గల కారణం ఏంటి? ఆ హత్యలన్నింటినీ లైవ్‌లో ఎందుకు ప్రదర్శిస్తూంటాడు? ఈ కథలో రామ చంద్రయ్య (రావు రమేష్), ప్రియ (దీప్తి సతి), సుప్రీత్, సంపత్ ఎవరు? అన్న ప్రశ్నలకు సమాధానమే సినిమా.

ప్లస్ పాయింట్స్ :

ముందుగా సినిమాకు ఎంచుకున్న ప్రధాన కథ బాగుంది. ఆ కథలో ఉన్న ఎమోషన్ కూడా బలమైనది కావడం సినిమాకు ఒక అర్థాన్ని తెచ్చింది. రావు రమేష్ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ సినిమాకి హైలైట్‌గా చెప్పాలి. ముఖ్యంగా ఈ ఎపిసోడ్‌లో రమేష్ తన సహజమైన నటనతో బాగా ఆకట్టుకున్నాడు. ఇంటర్వెల్ ట్విస్ట్, క్లైమాక్స్ కూడా బాగున్నాయి. ఇక మొదటి పది నిమిషాల ఛేజింగ్ ఎపిసోడ్, మధ్యలో కార్ ఎపిసోడ్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు బాగున్నాయి.

నిఖిల్ గౌడ డ్యాన్సుల్లో, యాక్షన్ ఎపిసోడ్స్‌లో బాగా ఆకట్టుకున్నాడు. యాక్టింగ్ విషయంలో మాత్రం ఇంకా పరిణతి చెందాల్సి ఉంది. జగపతి ఓ స్టైలిష్ సీబీఐ ఆఫీసర్‌గా బాగా చేశాడు. ముఖ్యంగా ఆయన పాత్రను పరిచయం చేసిన విధానం బాగుంది. ముందే చెప్పినట్లు రావు రమేష్ తన పాత్రలో ఒదిగిపోయి నటించేశాడు. రమ్యకృష్ణ క్లైమాక్స్‌లో ఇచ్చిన అప్పీయరన్స్ ఆ సన్నివేశాలకు బలాన్నిచ్చింది. ఆదర్శ్ ఒక పూర్తి స్థాయి పాజిటివ్‌ రోల్‍లో చాలా బాగా చేశాడు.

మైనస్ పాయింట్స్ :

అసలు కథను పక్కనబెడితే ఈ స్క్రీన్‌ప్లే ఫార్మాట్ తెలుగులో ఇప్పటికే ఎన్నో సినిమాల్లో చూసి ఉంటాం. అదే ఫార్మాట్‌లో వచ్చే పాటలు, లవ్‌ట్రాక్ సాగదీసి బోర్ కొట్టించాయి. సెకండాఫ్‌లో అనవసరంగా ఇరికించిన కామెడీ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. హీరో, హీరోయిన్ల లవ్‌ట్రాక్ కూడా సిల్లీగానే అనిపించింది. ఇక లాజిక్ అన్నది పెద్దగా పట్టించుకోకపోవడమే మంచిది. హీరో అనుకున్నవి అనుకున్నట్లు జరిగిపోయే సన్నివేశాలు, గేంప్లాన్స్ అన్నీ ఓవర్ అనిపించేలా ఉన్నాయి. అసలు కథలోని ఎమోషన్‌ను బలంగా చెప్పే సన్నివేశాలను మినహాయిస్తే మిగతా సినిమా అంతా అర్థం లేని సన్నివేశాలతో నడుస్తూ విసుగు పుట్టించింది. విలన్ పాత్ర కూడా పవర్‍ఫుల్‌గా లేకపోవడం మైనస్ పాయింటే!

సాంకేతిక విభాగం :

ముందుగా దర్శకుడు మహదేవ్ విషయానికి వస్తే, విజయేంద్ర ప్రసాద్ అందించిన కథకు మహదేవ్ అల్లిన స్క్రీన్‍ప్లే సాదాసీదాగా ఉంది. కథకు అనవసరమైన ఎపిసోడ్స్‌ను జతచేస్తూ పోయి మంచి కమర్షియల్ సినిమా కాగల కథను అలా వదిలేశారు. మేకింగ్ పరంగానూ మహదేవ్ చూపిన ప్రతిభ పెద్దగా ఏమీ కనిపించలేదు.

సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు టెక్నికల్‌గా బిగ్గెస్ట్ ప్లస్. విజువల్స్ అన్నీ రిచ్‌గా కనిపించేలా, లొకేషన్స్‌ను సరిగ్గా వాడుకుంటూ, లైటింగ్, ఫ్రేమింగ్‌తో మనోజ్ పరమహంస ప్రతిచోటా ఆకట్టుకున్నారు. ఎస్.ఎస్.థమన్ అందించిన పాటలు చెప్పుకోదగ్గ స్థాయిలో లేకపోయినా ఆయన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా బాగుంది. రూబెన్ ఎడిటింగ్ బాగానే ఉంది. యాక్షన్ డైరెక్టర్స్ పనితనాన్ని కచ్చితంగా అభినందించాల్సిందే. ఫస్టాఫ్ ఛేజ్, సెకండాఫ్‌లో కార్ ఛేజ్ బాగా డిజైన్ చేశారు. ప్రొడక్షన్ వ్యాల్యూస్‌కు ఎక్కడా కాస్త కూడా వంక పెట్టడానికి లేదు.

తీర్పు :

జాగ్వార్.. తెలుగు కమర్షియల్ సినిమాల పరంపరలో ఎప్పుడూ వస్తూ పోతూండే వాటిల్లో ఒక సినిమా. అయితే ఈ సినిమాలో స్టార్ హీరో లేకపోవడమన్నదే ఇక్కడ పెద్ద మైనస్. అసలు కథలోని ఎమోషన్ బాగుండడం, కొన్ని ఛేజింగ్ సన్నివేశాలు బాగా ఆకట్టుకోవడం లాంటి ప్లస్‌లతో వచ్చిన ఈ సినిమా మిగతా అన్నిచోట్లా రొటీన్ అయిపోవడం నిరాశపరిచే అంశం. ఒక్కమాటలో చెప్పాలంటే.. రొటీన్ కమర్షియల్ అంశాలతో, జస్ట్ ఓకే అనిపించే స్పీడ్‌తో వచ్చిన ‘జాగ్వార్’ ఇది..!

123telugu.com Rating : 2.75/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం :