సమీక్ష : జెండాపై కపిరాజు – నాని కమర్షియల్ అటెంప్ట్.!

సమీక్ష : జెండాపై కపిరాజు – నాని కమర్షియల్ అటెంప్ట్.!

Published on Mar 21, 2015 5:15 PM IST
Janda Pai Kapiraju

విడుదల తేదీ : 21 మార్చి 2015

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

దర్శకత్వం : సముద్రఖని

నిర్మాత : రజిత్ పార్ధసారధి, శ్రీనివాసన్

సంగీతం :జివి ప్రకాష్ ప్రకాష్

నటీనటులు : నాని, అమలా పాల్, రాగిణి ద్వివేది, శరత్ కుమార్…

చాలా కాలం నుంచి విడుదలకి నోచుకునుండా ఉన్న సినిమా ‘జెండాపై కపిరాజు’. ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి, అన్ని ఫైనాన్సియల్ ఇబ్బందులను క్లియర్ చేసుకున్న ఈ సినిమా ఉగాది కానుకగా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యంగ్ హీరో నాని మొదటిసారి ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో అమలా పాల్, రాగిణి ద్వివేది హీరోయిన్స్ గా నటించారు. సముద్రఖని డైరెక్ట్ చేసిన ఈ సినిమా రజిత్ పార్ధసారధి, శ్రీనివాసన్ లు నిర్మించారు. చాలా రోజులుగా వాయిదా పడి రిలీజ్ అయిన ఈ జెండాపై కపిరాజు ఎలా ఉంది.? నానికి కావలసిన హిట్ ని ఇచ్చిందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం..

కథ :

‘ప్రపంచాన్ని మార్చాలి అంటే ముందు నువ్వు మారాలి, నువ్వు మారితే ప్రపంచం దానంతట అదే మారుతుందని’ చెప్పడమే ఈ సినిమా కథాంశం. ఇక ఈ పాయింట్ ని ఎలా చెప్పారు అన్న విషయానికి వస్తే.. తనకు చదివించే స్తోమత లేకపోవడం వలన అరవింద్(నాని) తల్లి అరవింద్ ని నాజర్ ఉన్న ఓ గురుకులంలో చేరుస్తుంది. చిన్నప్పటి నుంచి అక్కడే పెరిగి, బాగా చదువుకొని ఉద్యోగం తెచ్చుకొని అక్కడి నుంచి బయటపడతాడు. కానీ అరవింద్ కి గురుకులంలో సమాజంలో ఎప్పుడూ నిజాయితీగా ఉంటూ, అన్ని రూల్స్ ఫాలో ఆవుతూ జీవించాలని చెప్పిన భావాలు అలానే ఉంటాయి. అందుకే అరవింద్ అసలైన ప్రపంచంలో ఇమడలేక పోతాడు. దానివల్ల పలు సమస్యలు ఎదుర్కుంటూ ఉంటాడు. ఆ సమస్య వల్ల తన ప్రాణమే పోయే పరిస్థితి వస్తుంది. దాంతో విసుగెత్తి పోయిన అరవింద్ తన ఫ్రెండ్స్ సపోర్ట్ తో అన్యాయంగా అక్రమాలు చేస్తూ, లంచాలు మరిగిన 147 మంది ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఒక మినిస్టర్ బాగోతాన్ని కూడా మీడియా ముందు ఉంచుతాడు.

వాళ్ళ మీద కోర్టులో కేసు వేసి వాళ్ళకి సరైన శిక్ష పడాలని అనుకుంటాడు. కానీ కట్ చేస్తే ఆ ప్రభుత్వ ఉద్యోగులు, ఎం.పి తమ పలుకుబడితో బయటపడడం కోసం అరవింద్ నే ఇబ్బందులు పడేలా చేయడమే కాకుండా, చూడటానికి అరవింద్ ని పోలి ఉండే తమిళనాడుకి చెందిన మయ ఖన్నన్ ని రంగంలోకి దింపుతారు. మయఖన్నన్ ఎవరు.? అసలు ఈ కథలోకి ఎందుకు వచ్చాడు.? అరవింద్ కి – మయ ఖన్నన్ కి ఏమన్నా సంబంధం ఉందా.? చివరికి అరవింద్ ఆ లంచగొండి ఉద్యోగులకు శిక్ష పడేలా చేసాడా.? లేదా అన్నది.? మీరు వెండితెరపై చూసి తెలుసుకోవాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

డైరెక్టర్ సముద్రఖని ఈ సినిమాలో సమాజంలో మార్పు కోసం నువ్వు మార్చాల్సింది ప్రపంచాన్ని కాదు, ముందు నువ్వు మారాలి, నువ్వు మారితే సమాజం దానంతట అదే మారుతుంది అని చెప్పాలనుకున్న స్టొరీ లైన్ చాలా బాగుంది. ఆ పాయింట్ ని ఫస్ట్ హాఫ్ ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ నుంచి చాలా కమర్షియల్ గా చెప్పగలిగడమే కాకుండా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇంటర్వల్ ముందు వచ్చే 20-30 నిమిషాల ఎపిసోడ్ సినిమాకి మేజర్ హైలైట్. సెకండాఫ్ లో వచ్చే మయ ఖన్నన్ రోల్ సినిమాకి హైలైట్ గా నిలిస్తుంది.

ఇక సినిమాలోని నటీనటుల పెర్ఫార్మన్స్ విషయానికి వస్తే.. నాని మొదటి సారి డబుల్ రోల్ చేసాడు. అందులో మొదట అమాయకంగా ఉంటూ చివరికి న్యాయం కోసం తన ప్రాణాన్ని కూడా బలివ్వడానికి సిద్దపడే పాత్రే అరవింద్. ఈ పాత్రలో వచ్చే మార్పును నాని చాలా బాగా చూపించాడు. ఇక మయ ఖన్నన్ పాత్రలో పవర్ఫుల్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. ఈ పాత్రలో నాని చూపిన వైవిద్యం, నెగటివ్ షేడ్స్ చూసే ఆడియన్స్ కి నానిలోని కొత్త యాంగిల్ ని పరిచయం చేస్తుంది. ఈ పాత్ర సెకండాఫ్ లో సినిమాకి మంచి ఊపు తెస్తుంది. అమలా పాల్ పక్కింటి అమ్మాయి లాంటి పాత్రలో కనిపించి ఆకట్టుకుంది. రాగిణి ద్వివేది చేసింది చిన్న పాత్ర అయినా మయఖన్నన్ పాత్రకి పర్ఫెక్ట్ జోడీ. వెన్నెల కిషోర్ నాని ఫ్రెండ్ గా ఫస్ట్ హాఫ్ లో నవ్విస్తాడు.

సిబిఐ ఆఫీసర్ గా గెస్ట్ రోల్లో కనిపించే శరత్ కుమార్ పాత్ర సినిమాకి చాలా హెల్ప్ అయ్యింది. శివబాలాజీ టీవీ రిపోర్టర్ గా మంచి నటనని కనబరిచాడు. నాజర్, తనికెళ్ళ భరణి, పార్వతి నాయర్ లు తమ పాత్రల పరిధిమేర నటించారు. నాని ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉన్న అవినీతిని చూపడానికి ఎంచుకునే పాయింట్, ఆ ఎపిసోడ్ ని తీసిన విధానం బాగుంటుంది. అలాగే సెకండాఫ్ లో ఇద్దరు నానిల మధ్య వచ్చే యాక్షన్ ఎపిసోడ్, కోర్టు సీన్ అందరినీ ఆకట్టుకుంటుంది.

మైనస్ పాయింట్స్ :

మైనస్ పాయింట్స్ లో ముందుగా చెప్పాల్సింది సినిమా మొదటి అర్థ భాగంలో వచ్చే మొదటి 30-40 నిమిషాలు.. ఆ ఎపిసోడ్ మొత్తం చాలా స్లోగా ఉంటుంది. నాని మొదటి పాత్ర అరవింద్ నిజాయితీగా ఉంటుందని చూపడానికి ఒక రెండు మూడు సీన్స్ చూపిస్తే సరిపోతుంది. కానీ ఫస్ట్ హాఫ్ లో మొదటి 40 నిమిషాలు చూపించడం. మధ్య మధ్యలో కమర్శియాలిటీ కోసం హీరోయిన్ అని, లవ్ ట్రాక్ అని పెట్టి సినిమాని సాగాదీసేసారు. ముఖ్యంగా నాని – అమలా పాల్ లవ్ ట్రాక్ ఆసక్తికరంగా లేకపోవడమే కాకుండా, అలాంటి ట్రాక్ ని ఎక్కడో చూసాం అన్న ఫీలింగ్ కలిగిస్తుంది.

ఇంటర్వల్ బ్లాక్ ని చాలా ఆసక్తికరంగా ముగించి, సెకండాఫ్ మొదలయ్యాక మళ్ళీ సినిమాని స్లో చేసేసారు. చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ చివరికి వచ్చే ముందే డైరెక్టర్ చెప్పాలనుకున్న పాయింట్ ని రివీల్ చేసేస్తాడు. ఆ తర్వాత అంతా మనం ఊహించిందే జరుగుతుంది. అలాగే మయ ఖన్నన్ ఎపిసోడ్ లో నాని పెర్ఫార్మన్స్ బాగున్నా చివరి వరకు ఆ ఎపిసోడ్ బోరింగ్ గా అనిపిస్తుంది. సినిమాలో చెప్పాలనుకున్న పాయింట్ బాగున్నా కథా విస్తరణ పరంగా సినిమా లెంగ్త్ బాగా ఎక్కువైనట్లు అనిపిస్తుంది. రన్ టైంని బాగా తగ్గించి 2 గంటల్లో చెప్పగలిగి ఉంటే ఈ సినిమా కంటెంట్ ఆడియన్స్ కి ఇంకా బాగా కనెక్ట్ అయ్యేది. సినిమా ఎప్పుడు డైరెక్టర్ అనుకున్న పాయింట్ చుట్టూనే తిరుగుతూ ఉండడం వలన సినిమాలో రెగ్యులర్ ఆడియన్స్ కోరుకునే కామెడీ, ఎంటర్టైన్మెంట్ ఉండదు. ఇక ఉన్నవి రెండు పాటలే అయినా అవి కూడా సినిమాకి స్పీడ్ బ్రేకర్స్ లా అనిపిస్తాయి.

సాంకేతిక విభాగం :

టెక్నికల్ డిపార్ట్ మెంట్ లో కత్తి, కేక అని చెప్పుకునే రేంజ్ లో ఏమీ లేకపోయినా ఉన్నంతలో బాగా చేసారు అని చెప్పుకునే పాయింట్స్ మాత్రం కొన్ని ఉన్నాయి. అందులో మొదటిది సుకుమార్ – జీవన్ ల సినిమాటోగ్రఫీ. విజువల్స్ చాలా డీసెంట్ గా ఉన్నాయి. సినిమాటోగ్రఫీకి సంబంధం లేని కొన్ని సిజి షాట్స్, విజువల్స్ మాత్రం చాలా నాశిరకంగా ఉన్నాయి. జివి ప్రకాష్ కుమార్ పాటలు పెద్దగా లేకపోయినా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం బాగుంది. ఇకపోతే ఫాజిల్ ఎడిటింగ్ ఇంకాస్త బెటర్ గా ఉండి ఉంటే బాగుండేది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ కాస్త, సెకండాఫ్ లో కాస్త లెంగ్త్ తగ్గించి ఉంటే బాగుండేది. యాక్షన్ ఎపిసోడ్స్ ఇంకాస్త బెటర్ గా ఉండాల్సింది.

ఇక కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం చేసింది సముద్రఖని.. కథ – ఓ సోషల్ మెసేజ్ ని స్టొరీ లైన్ గా తీసుకోవడం బాగుంది, దాని రాసుకోవడం బానే ఉంది, కానీ కమర్శియాలిటీ కోసం అనవసరపు ఎపిసోడ్స్ అన్నీ పెట్టేసి రాసుకోవడం మైనస్ అయ్యింది. స్క్రీన్ ప్లే – ఫస్ట్ హాఫ్ ని ఇంకాస్త బెటర్ గా స్టార్ట్ చేసి, సెకండాఫ్ ని కొత్తగా ఏమన్నా ప్లాన్ చేసుకొని ఉంటే బాగుండేది. డైరెక్షన్ – ఒక డైరెక్టర్ గా అనుకున్న పాయింట్ బాగానే రీచ్ అయ్యించి. కానీ మొదటి నుంచి చివరి దాకా ఆసక్తికరంగా ఆడియన్స్ కి చెప్పలేకపోయాడు. మధ్య మధ్యలో బోరింగ్ కొట్టించేసారు. శశాంక్ వెన్నెలకంటి డైలాగ్స్ డీసెంట్ గా ఉన్నాయి. రజిత్ పార్ధసారధి, శ్రీనివాసన్ ల నిర్మాణ విలువలు కూడా ఓకే అనేలా ఉన్నాయి.

తీర్పు :

చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న నాని ‘జెండాపై కపిరాజు’ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చి బాగానే ఉంది అనే టాక్ ని సొంతం చేసుకుంది. నాని మొదటిసారి ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో నాని నటన పరంగా తనలోని కొత్త కోణాన్ని చూపాడు. ప్రస్తుతం సొసైటీలో ఉన్న బర్నింగ్ పాయింట్ లంచం చుట్టూ తిరిగే కథ కావడం వలన ఆడియన్స్ కి బాగానే కనెక్ట్ అవుతుంది. ఈ కథ ఇంటర్వల్ ఎపిసోడ్ అయ్యే టైంకి ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది. కానీ సెకండాఫ్ లో ఆ ఫీలింగ్ కాస్త తగ్గుతుంది. డైరెక్టర్ చెప్పిన స్టొరీ లైన్ మాత్రం సింప్లీ సూపర్బ్. ఓవరాల్ గా నాని అటెంప్ట్ చేసిన ఈ కమర్షియల్ సినిమా ‘జెండాపై కపిరాజు’ని ఓ సారి చూడవచ్చు.

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు