ఆడియో సమీక్ష : కళ్యాణ వైభోగమే – కూల్ అండ్ క్లాస్ ఆల్బమ్!

ఆడియో సమీక్ష : కళ్యాణ వైభోగమే – కూల్ అండ్ క్లాస్ ఆల్బమ్!

Published on Jan 3, 2016 10:32 AM IST

kalayana-vaibogame

వరుస సినిమాలతో మెప్పిస్తూ వస్తోన్న యువహీరో నాగశౌర్య, ‘అలా మొదలైంది’తో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన లేడీ డైరెక్టర్ నందిని రెడ్డిల కాంబినేషన్‌లో కళ్యాణ వైభోగమే అన్న సినిమా సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. తన సినిమాల్లో పాటలను అందంగా ఉండేలా చూసుకునే నందిని రెడ్డి, కళ్యాణ్ కోడూరితో కలిసి మరోసారి మెప్పించేందుకు కళ్యాణ వైభోగమే ఆడియోతో మనముందుకు వచ్చారు. సినిమాకు క్రేజ్ తెచ్చేదిగా చెప్పబడేది ఆడియోనే.. మరి ఈ ఆడియో ఎంతవరకు మెప్పించిందీ? చూద్దాం..

011. పాట : చక్కందాలా చుక్కా..
గాయనీ గాయకులూ : కళ్యాణ్ కోడూరి, సునీత
సాహిత్యం : లక్ష్మీ భూపాల్

‘కళ్యాణ వైభోగమే’ అని పేరులోనే నిండుతనాన్ని నింపుకున్న ఈ సినిమా ఆడియోలోని మొదటి పాటే ‘చక్కందాలా చుక్కా’ అంటూ పెళ్ళి వైభోగాన్ని ఆవిష్కరించింది. ‘శతమానం భవతి’ అంటూ పెళ్ళి మంత్రాలతో మొదలయ్యే పాట ఆ తర్వాత ‘చక్కందాలా చుక్కా..’ అంటూ పల్లవిని అందుకొని సాగుతుంది. కళ్యాణ్ కోడూరి సమకూర్చిన ట్యూన్ బాగుంది. మొదట్నుంచీ చివరివరకూ నాలుగు రకాల ఎమోషన్స్‌తో పాట సాగడం బాగుంది. కళ్యాణ్ కోడూరి, సునీతల గానం ఈ పాటకు ఓ ప్రత్యేకత తెచ్చింది. లక్ష్మీ భూపాల్ అందించిన సాహిత్యం కూడా చాలా బాగుంది. ఈ పాటలోని ఎమోషన్‌ని బట్టిచూస్తే విజువల్స్‌తో కలిపి చూస్తే ఈ పాట ఎంతో అందంగా ఉంటుందని ఊహించొచ్చు.

 

022. పాట : చిరునవ్వులే..
గాయనీ గాయకులూ : హరిచరణ్, సుష్మా త్రియా
సాహిత్యం : లక్ష్మీ భూపాల్

‘చిరునవ్వులే..’ అంటూ సాగే రెండో పాటకు కళ్యాణ్ కోడూరి సింపుల్ ట్యూన్‌నే ఎంచుకొని పాటను పాడించే విధానంలో కొత్తదనం చూపించి మెప్పించారు. ఈ పాటకు లక్ష్మీ భూపాల్ అందించిన సాహిత్యం కూడా గమ్మత్తుగా ఉంది. ట్యూన్‌కి సరిగ్గా కుదిరే ఫన్నీ లిరిక్స్ బాగా ఆకట్టుకుంటాయి. హరిచరణ్, సుష్మా త్రియాల గానం బాగుంది. మధ్య మధ్యలో ‘చిరునవ్వులే.. చిరుగాలులై వీయగా..’ అంటూ వచ్చే బీట్ చాలా బాగుంది. కాస్త రొటీన్ అనిపించినా వినగా వినగా బాగా ఎక్కే పాటగా దీన్ని చెప్పుకోవచ్చు.

 

033. పాట : పల్ పల్
గాయనీ గాయకులూ : రాహుల్ నంబియార్, పియర్ల్ మానే
సాహిత్యం : లక్ష్మీ భూపాల్

హిందీ, తెలుగు పదాల కలయికలో లిరిక్స్‌తో మెప్పించే పాటగా దీన్ని చెప్పుకోవచ్చు. ట్యూన్ యూత్‌ఫుల్‌గా ఉంటూ ఎక్కువగా చిన్న చిన్న బిట్ మ్యూజిక్స్‌కు ప్రాధాన్యత ఇచ్చారు. సింగర్స్ రాహుల్ నంబియార్, పియర్ల్ మానేల ఇద్దరి కాంబినేషన్ బాగుంది. తెలుగు, హిందీ పదాలతో లక్ష్మీ భూపాల్ చేసిన ప్రయోగం బాగుంది. ఇకపోతే ఈ పాట ట్యూన్ మొదట్లో వినిపించే బీట్ ‘శివమ్’ సినిమాలోని ఓ పాట బీట్‌ను పోలి ఉంది. కళ్యాణ్ కోడూరి పెద్దగా ప్రయోగం సింపుల్ మ్యూజిక్‌తో పాటను పూర్తి చేశారు. విజువల్స్‌తో చూసినప్పుడు బాగా మెప్పించే పాట పల్ పల్.

044. పాట : మనసంతా మేఘమై..
గాయనీ గాయకులూ : చిన్మయి శ్రీపాద
సాహిత్యం : లక్ష్మీ భూపాల్

‘మనసంతా మేఘమై.. తేలిపోదా..’ అంటూ వచ్చే ఈ పాటను ఈ ఆల్బమ్‌లోనే హైలైట్ పాటగా చెప్పుకోవచ్చు. కళ్యాణ్ కోడూరి పాట మొత్తానికీ ఒక అందమైన రొమాంటిక్ పాటకు కావాల్సిన మూడ్ తెచ్చేలా ఇన్స్ట్రుమెంట్స్‌తో అద్భుతమైన ప్రయోగం చేశారు. ‘ఊహలు గుసగుసలాడే’లో కళ్యాణ్ కోడూరి అందించిన ‘ఏం సందేహం లేదు’ పాట తరహాలో విన్నాకొద్దీ వినాలనిపించేంత మెలోడియస్‌గా ఈ పాటా ఉందనడంలో సందేహం లేదు. చిన్మయి శ్రీపాద గాత్రం ఈ పాటకు ఓ మెయిన్ హైలైట్. లక్ష్మీ భూపాల్ అందించిన అద్భుతమైన సాహిత్యాన్ని పద్ధతిగా పాడుతూ కళ్యాణ్ కోడూరి ట్యూన్‌తో అందుకున్న విధానంలో చిన్మయి ప్రతిభను చూడొచ్చు. ఒక్కసారి కనెక్ట్ అయితే ఈ పాటను లూప్‌లో వింటామనడంలో అతిశయోక్తి లేదు.

055. పాట : పెళ్ళి పెళ్ళి…
గాయనీ గాయకులూ : దీపు, ధన్‌రాజ్, లభూ, హేమంత్
సాహిత్యం : లక్ష్మీ భూపాల్

‘పెళ్ళి పెళ్ళి’ అంటూ సాగే ఈ పాట వింటున్నంత సేపూ సరదా సరదాగా సాగిపోతూ మెప్పిస్తుంది. పెళ్ళిపైన సెటైర్‌లా రూపొందిన ఈ పాటలో లిరిక్స్‌దే మేజర్ హైలైట్. లక్ష్మీ భూపాల్ అందించిన గమ్మత్తైన సాహిత్యానికి సింగర్స్ దీపు, హేమంత్, లభూ నటుడు ధన్‌రాజ్‌ల గాత్రం కట్టిపడేసేలా ఉంది. ముఖ్యంగా ధన్‌రాజ్ పాడే చిన్న పార్ట్ ఈ పాటలో విపరీతంగా కట్టిపడేసే అంశం. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మూడు భాషల పదాలతో చేసిన ప్రయోగం యూత్‌కి బాగా నచ్చుతుంది. కళ్యాణ్ కోడూరి ఎంచుకున్న ట్యూన్ కూడా బాగుంది. ‘జై బోలో జవానీ..’ అంటూ వచ్చే బీట్‌తో పాటను ఎప్పటికప్పుడు రిఫ్రెషింగ్‌గా ఉండేలా ట్యూన్ డిజైన్ చేశారు. విన్నప్పుడల్లా సరదాగా చిరునవ్వు తెప్పించే పాటగా దీన్ని చెప్పుకోవచ్చు.

066. పాట : ఎవరు నీవూ..
గాయనీ గాయకులూ : విజయ్ యేసుదాసు
సాహిత్యం : లక్ష్మీ భూపాల్

కళ్యాణ్ కోడూరి ఈ ఆడియోను ఓ విషాద గీతంతో ముగించారు. పాటకు ఎంచుకున్న ట్యూన్ చాలా సింపుల్‌గానే ఉన్నా ప్రతీ ఇంటర్వెల్‌కూ కళ్యాణ్ ఇన్స్ట్రుమెంట్స్‌తో చేసిన ప్రయోగం కట్టిపడేస్తుంది. విజయ్ యేసుదాసు గాత్రం ఈ పాటకు మేజర్ హైలైట్. లక్ష్మీ భూపాల్ అందించిన మంచి సాహిత్యానికి యేసుదాసు గాత్రం తోడవ్వడంతో పాట భావం సరిగ్గా రీచ్ అయింది. సినిమాలో సన్నివేశం ప్రకారం చూసినప్పుడు ఈ పాట మరింత ఫీల్ ఇస్తుందన్నది ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.

తీర్పు :

కళ్యాణ్ కోడూరి ఆడియో అంటే తెలుగు సినిమా సంగీత ప్రియులకు ఎప్పుడూ మంచి ఆసక్తి ఉంటుంది. తనదైన మార్క్‌తో మంచి ఆడియోలను అందిస్తూ వస్తోన్న ఆయన ‘కళ్యాణ వైభోగమే’ సినిమాతో మరోసారి అదే పంథాలో వచ్చి మెప్పించారు. ఎక్కడా హంగులు, ఆర్భాటాలు లేకుండా చాలా సింపుల్‌గా ఆడియోను డిజైన్ చేశారు. మెలోడీలను, పాటల్లో ఫన్‌ను ఇష్టపడే శ్రోతలను కళ్యాణ వైభోగమే విపరీతంగా అలరిస్తుందనే చెప్పొచ్చు. అన్ని సందర్భానుసారంగా కనిపిస్తోన్న ఈ సినిమాలోని ఆరుపాటలకూ లక్ష్మీ భూపాల్ సాహిత్యం సమకూర్చారు. ఆయన అందించిన సాహిత్యం ఈ ఆడియోకు ఓ హైలైట్‌గా చెప్పుకోవచ్చు. ‘చక్కందాల చుక్క’, ‘చిరునవ్వులే’, ‘మనసంతా మేఘమై’.. ఈ ఆల్బమ్‌లో మా పరంగా ది బెస్ట్. నందిని రెడ్డి ఆలోచనలతో, కథ పరంగా విజువల్స్‌తో పాటలను చూసినప్పుడు ఈ పాటల్లో ఫీల్ మరింత అందంగా ఉంటుందని చెప్పుకోవచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు