సమీక్ష : కార్తికేయ – మిమ్మల్ని థ్రిల్ చేసే ‘సస్పెన్స్ థ్రిల్లర్’

విడుదల తేదీ : 24 అక్టోబర్ 2014
123తెలుగు. కామ్ రేటింగ్ : 3.5/5
దర్శకత్వం : : చందూ మొండేటి
నిర్మాత : వెంకట శ్రీనివాస్ బొగ్గరం
సంగీతం : శేఖర్ చంద్ర
నటీనటులు : నిఖిల్, స్వాతి…

‘స్వామి రారా’ సినిమాతో తన కెరీర్లో బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ అందుకున్న యంగ్ హీరో నిఖిల్ హీరోగా నటించిన సూపర్ నాచురల్ థ్రిల్లర్ ‘కార్తికేయ’. ఈ మూవీ ట్రైలర్స్ రిలీజ్ అయిన టైం నుంచి ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అంతే కాకుండా ‘స్వామి రారా’ లాంటి సూపర్ హిట్ తర్వాత మళ్ళీ నిఖిల్ – స్వాతి జంటగా నటిస్తున్న ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చందు మొండేటి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమా తన కెరీర్లో పెద్ద హిట్ గా నిలుస్తుందని నిఖిల్ ఆశిస్తున్నాడు. మరి నిఖిల్ కోరికను నెరవేర్చేలా ఈ సినిమా ఉందా? అలాగే ‘స్వామిరారా’ మేజిక్ ని నిఖిల్ – స్వాతిలు మళ్ళీ ‘కార్తికేయ’తో రిపీట్ చేసారా.? అనేది ఇప్పుడు చూద్దాం..

కథ :

ద్రవిడులు కాలంలో రాష్ట్రకూట వంశానికి చెందిన కీర్తి వర్మ రాజు ఆంధ్ర – తమిళనాడు బోర్డర్ ని పరిపాలిస్తూ ఉంటాడు. ఆ రాజ్యానికి దుర్భిక్షం రావడంతో అదే రాజ్యంలో గుడికూడా లేని ఓ సుబ్రహ్మణ్య స్వామికి ఆ రాజ్యాన్ని దుర్భిక్షం నుండి కాపాడమని మొక్కుకుంటాడు. దాంతో ఆ రాజ్యం మొత్తం సస్యశ్యామలంగా మారుతుంది. దాంతో ఆ రాజు సుబ్రహ్మణ్య స్వామికి ఓ గుడిని కట్టిస్తాడు. ఆ ఆనాటి నుంచి ఆ గుడి ప్రతి రోజూ దీపారాధనతో, ప్రతి కార్తీక పౌర్ణమి టైం కి సుబ్రహ్మణ్య స్వామికి షష్టి పూజ చెయ్యడం మొదలు పెడతారు. నిర్విరామంగా కొనసాగిన ఆ గుడి పూజలు 2013లో కొన్ని అనుకోని కారణాల వల్ల మూసేస్తారు. అప్పటి నుంచి ఆ గుడి గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళంతా పాము కాటుతో చనిపోతూ ఉంటారు.

ఇప్పుడు సినిమా మొదటికి వస్తే… కార్తీక్(నిఖిల్) మెడిసిన్ ఫైనలియర్ చదివే కుర్రాడు. కార్తీక్ చాలా ప్రాక్టికల్ ఎక్కడైనా ఓ సమస్య లేదా ఓ ప్రశ్న ఉంది అని తెలిస్తే దాని చేధించడానికి ఎంత దూరం అయినా వెళ్తాడు. ఇలాంటి కార్తీక్ వల్లి (స్వాతి రెడ్డి)ని చూసి ప్రేమలో పడతాడు. తను కూడా అదే కాలేజీలో చదువుతూ ఉంటుంది. మెడిసిన్ పూర్తి చేసుకున్న కార్తీక్ మెడికల్ క్యాంపు కోసం సుబ్రహ్మణ్య పురంకి వెళతాడు. అక్కడ అనుకోని సంఘటనలు మరియు గుడి గురించి తెలుసుకున్న కార్తీక్ ఆ చావుల వెనుక ఉన్న కారణాన్ని తెలుసు కోవడానికి ఏం చేసాడు.? ఈ జర్నీలో కార్తీక్ ఏమేమి తెలుసుకున్నాడు.? అసలు ఆ గుడి మూత పడటానికి గల కారణం ఏమిటి.? ఆ గుడి గురించి తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు పాము కాటుకే ఎందుకు చనిపోతున్నారు.? కీర్తి వర్మ రాజు ఆ గుడిని కట్టించినప్పుడు ఆ గుడికి ఏదైనా విశిష్టతని కల్పించాడా.? అన్నది మీరు వెండి తెరపైనే చూడాలి.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ చందు మొండేటి రాసుకున్న కథ మరియు దానిని తెరపై అద్భుతంగా చూపించడం. కొత్త డైరెక్టర్ ఇలాంటి కాన్సెప్ట్ ని ఎలా డీల్ చేస్తాడో అనే సందేహం లేకుండా ఈ కాన్సెప్ట్ ని ఓకే చేసి, సినిమా చేయడానికి ముందుకు వచ్చిన నిఖిల్ సిద్దార్థ్ కి కూడా మా హ్యాట్సాఫ్..

ఇక ముందుగా నటీనటుల విషయానికి వస్తే.. నిఖిల్ పాత్ర చాలా బాగుంది. కార్తీక్ పాత్రని డైరెక్టర్ చాలా బాగా రాసుకున్నాడు, దానికన్నా బాగా నిఖిల్ ఆ పాత్రని చేయడమే కాకుండా, ఆడియన్స్ కి కనెక్ట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. నిఖిల్ ఈ మూవీలో చూడటానికి చాలా హన్డ్సం గా ఉన్నాడు, అందుకే ఈ సినిమాతో లవర్ బాయ్ ఇమేజ్ వస్తుంది. ఒక నటుడిగా నిఖిల్ చాలా మెచ్యూరిటీ చూపించాడు. నిఖిల్ ఇందులో ఓ పక్క లవర్ బాయ్ గా కనిపిస్తూనే, కథలో ఉన్న సస్పెన్స్ ని కూడా బాగా మెయిన్టైన్ చేసాడు. అలాగే నటన పరంగా నిఖిల్ కి ఇదొక మైలురాయిగా నిలుస్తుందని చెప్పవచ్చు. ఇక స్వాతి పెర్ఫార్మన్స్ చాలా బాగుంది. కథా పరంగా సస్పెన్స్ ఎలిమెంట్స్ కి స్వాతికి సంబంధం లేకపోయినప్పటికీ ఉన్న లవ్ ట్రాక్ లో మాత్రం చిన్ని చిన్ని క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. కొన్ని చోట్ల మాత్ర కాస్త ఎక్కువ వయసైన అమ్మాయిలా కనిపిస్తుంది. ముఖ్యంగా నిఖిల్ – స్వాతి మధ్యలో వచ్చే లవ్ ట్రాక్ చాలా బాగుంది. వీరి మధ్య వచ్చే లవ్ ట్రాక్స్ ని చందు చాలా బాగా పిక్చరైజ్ చేసాడు.

ఇక సినిమాలో నిఖిల్ ప్రెండ్స్ గా చేసిన ప్రవీణ్, సత్య తమ కామెడీతో మిమ్మల్ని నవ్విస్తూ ఉంటారు. సినిమాలో కీలకమైన పాత్రలు చేసిన వారిలో ముందుగా రావు రమేష్ గురించి చెప్పాలి. రావు రమేష్ పాత్ర సినిమాపై మరింత ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. అలాగే ఆయన నటన చాలా బాగుంది. ఇక పోలీస్ ఆఫీసర్ గా కిషోర్, పూజారిగా తనికెళ్ళ భరణిల పెర్ఫార్మన్స్ చాలా బాగుంది. అతిధి పాత్రలో కనిపించిన జయ ప్రకాష్ చాలా బాగా చేసాడు. నటీనటుల తర్వాత చెప్పుకోవాల్సింది.. సినిమా ఫ్లో గురించి.. సినిమా ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. ఎక్కడా బోర్ కొట్టదు.. ముఖ్యంగా లవ్ ట్రాక్ మరియు మధ్యలో వచ్చే కొన్ని సస్పెన్స్ ఎలిమెంట్స్ ని చాలా బాగా డీల్ చేసారు. సెకండాఫ్ లో కూడా సస్పెన్స్ ఎలిమెంట్స్ ని డైరెక్టర్ చందు చాలా బాగా డీల్ చేసాడు, అలాగే ఆడియన్స్ అందరికీ అర్థమయ్యేలా చెప్పాడు.

ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ని తను చెప్పిన విధానం, చూడగానే అందరికీ కథ బాగా అర్థమవ్వడమే కాకుండా కథకి బాగా కనెక్ట్ అయిపోతారు. ఈ థ్రిల్లర్ సినిమాకి సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరియు గ్రాఫికల్ ఎలిమెంట్స్ కూడా చాలా ప్లస్ అయ్యాయి. అలాగే 2 గంటలా 4 నిమిషాలు మాత్రమే అయిన ఈ చిత్ర రన్ టైం కూడా సినిమాకి చాలా పెద్ద ప్లస్ పాయింట్.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమా ఫస్ట్ హాఫ్ చాలా వేగంగా సాగుతుంది. కానీ సెకండాఫ్ అక్కడక్కడా తగ్గుతుంది. కథా పరంగా వచ్చే కొన్ని ఫ్యామిలీ సీన్స్ సినిమాకి పెద్దగా హెల్ప్ కాలేదు. దానివల్ల సెకండాఫ్ లో కాన్సెప్ట్ లోకి కాస్త ఆలస్యంగా వెళ్ళారు అనిపిస్తుంది. ఈ సినిమాకి క్లైమాక్స్ లాజికల్ పరంగా చాలా బాగుంది. కానీ మొదటి నుంచి చూస్తున్న ఆడియన్స్ మైండ్ ని ఓ రేంజ్ లో క్లైమాక్స్ ఉంటుంది అనే ఫీల్ సెట్ చేసిన డైరెక్టర్ చందు ఆ రేంజ్ కి రీచ్ అవ్వకుండా చాలా సింపుల్ గా క్లైమాక్స్ ముగించేసాడు అనిపిస్తుంది.

ఈ సినిమాలో చాలా లాజికల్ పాయింట్స్ ని పర్ఫెక్ట్ గా రివీల్ చేసిన డైరెక్టర్ కొన్ని కొన్నిటిని మాత్రం వదిలేసాడు. ఉదాహరణకి ఆ పోలీస్ ఆఫీసర్ వెహికల్ తో సహా అలా ఎలా చనిపోయాడనేది చెప్పలేదు. అతని మరణం వెనుక ఉన్న కారణం కూడా చెప్పలేదు. ఇకపోతే ఓవరాల్ గా సినిమా చూసాక ఇలాంటి కాన్సెప్ట్ తో వచ్చిన సినిమాలు గతంలో కూడా ఉన్నాయి కదా అనే భావన కొంతమందికి కలుగుతుంది.

సాంకేతిక విభాగం :

ఓక మంచి పని అనుకుంటే దానికి పంచ భూతాలు సహాయం చేస్తాయి అంటారు.. అలానే ఒక మంచి కథ సెట్ అయితే ఆ సినిమాకి దొరికే టెక్నికల్ టీం మరియు వాళ్ళ అవుట్ పుట్ కూడా పెద్ద ప్లస్ అవుతుందని ఇది వరకే చాలా చిన్న సినిమాలు ప్రూవ్ చేసాయి. అదే విషయాన్ని ఇప్పుడు కార్తికేయ మరోసారి ప్రూవ్ చేసింది. ముందుగా ఈ సినిమా కాన్సెప్ట్ కి ఒక అద్భుతమైన రూపాన్ని ఇచ్చింది సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని. తన విజువల్స్ ఈ సినిమా చాలా పెద్ద ప్లస్ అయ్యాయి. అలాగే విజువల్స్ చాలా ఫ్రెష్ గా అనిపిస్తాయి. ఇక ఆ రూపానికి శేఖర్ చంద్ర తన మ్యూజిక్ తో ప్రాణం పోసాడని చెప్పాలి. శేఖర్ చంద్ర అందించిన సాంగ్స్ బాగుంటే అవి స్క్రీన్ పై ఇంకా బాగున్నాయి. ఇక తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆడియన్స్ లో ఉత్కంఠ కలిగించేలా ఉంది. కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. ఎక్కడా ఆడియన్స్ ని పక్కకి తిప్పుకోనీకుండా చేసాడు. ఇక ఆర్ట్ డైరెక్టర్ సాహి సురేష్ క్రియేట్ చేసిన డిజైన్స్ చాలా బాగున్నాయి. అవి ఆడియన్స్ కి కథని మరింత బాగా కనెక్ట్ అయ్యేలా చేసాయి.

ఇక ఈ సినిమాకి మెయిన్ పిల్లర్ మరియు కెప్టెన్ అయిన చందు మొండేటి విషయానికి వద్దాం.. కథ – స్క్రీన్ ప్లే – మాటలు – దర్శకత్వం విభాగాలను చందు డీల్ చేసాడు. కథ – వెతుక్కుంటే దీనికి దగ్గరగా ఉండే కథలు మనకు దొరుకుతాయి, కానీ వాటితో సంబంధం లేకుండా అవి ఎక్కడా మనకు గుర్తుకు రానివ్వకుండా చందు కథని రాసుకోవడంలో సక్సెస్ అయ్యాడు. అంతే కాకుండా కథలో కొన్ని కొత్త కొత్త విషయాలను చెప్పాడు. అందువల్ల ఆడియన్స్ చాలా వరకు పాత కథలు గుర్తుకు రాకపోవచ్చు. స్క్రీన్ ప్లే – చాలా ఆసక్తిగా మొదలు పెట్టి మధ్యలో ఆడియన్స్ కి ఉత్కంఠ కలిగించడంలో సక్సెస్ అయ్యాడు. ఒక్క క్లైమాక్స్ పై ఇంకాస్త వర్కౌట్ చేసి ఉంటే బాగుండేది. మాటలు – చాలా బాగున్నాయి. ముఖ్యంగా దేవుడు ఉన్నాడు అని నమ్మేవారికి – దేవుడు లేడని నమ్మేవారికి సంబదించి రాసుకున్న డైలాగ్స్ ఎవరికీ ఇబ్బందిని కలిగించకుండా రాసుకున్నాడు. ఇకపోతే దర్శకత్వం పరంగా చందు ది బెస్ట్ ఇచ్చాడని చెప్పాలి. అనుక్కున్న పాయింట్ ని చెప్పడం దగ్గర నుంచి, లోకేషన్స్, సెట్స్, డిజైన్స్, విజువల్స్, మ్యూజిక్ మరియు నటీనటుల పెర్ఫార్మన్స్ వరకూ అన్నింటిలో సూపర్బ్ టాలెంట్ ని కనబరిచాడు. చందు ఈ సినిమా ద్వారా చెప్పిన ‘సాధనాథ్ సాధనే సర్వం’ అనే పాయింట్ తనే ఈ సినిమాతో ప్రూవ్ చేసుకున్నాడు. ఇక వెంకట శ్రీనివాస్ బొగ్గరం ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్ గా ఉన్నాయి. చెప్పుకోవడానికి చిన్న సినిమా అయినా విజువల్స్ మాత్రం భారీ బడ్జెట్ మూవీలా ఉన్నాయి.

తీర్పు :

‘స్వామి రారా’ లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత నిఖిల్ చేసిన సస్పెన్ థ్రిల్లర్ ‘కార్తికేయ’ ఆడియన్స్ ని థ్రిల్ చేసి నిఖిల్ కి మరో సూపర్ హిట్ ని ఇచ్చింది. ముందు నుంచి ఈ సినిమాపై ఉన్న అంచనాలను అందుకోవడంలో సక్సెస్ అయ్యింది. డైరెక్టర్ చందు మొండేటి కొత్తవాడైనా ఎక్కడా తడబడకుండా అనుకున్నది అనుకున్నట్టుగా, సామాన్య ప్రజలకి సైతం అర్థమయ్యేలా పూసగుచ్చినట్లు చెప్పడం ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. నిఖిల్ పెర్ఫార్మన్స్, కథ, సస్పెన్స్ ఎలిమెంట్స్, విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ అయితే సెకండాఫ్ లో అక్కడక్కడా కాస్త స్లో అనిపించడం, కొన్ని లాజికల్ పాయింట్స్ మిస్ అవ్వడం లాంటివి చెప్పదగిన మైనస్ పాయింట్స్. మొత్తంగా ‘కార్తికేయ’ సినిమా మిమ్మల్ని సస్పెన్స్ తో థ్రిల్ చేసి థ్రిల్లింగ్ ఎంటర్టైనర్. చివరిగా ఈ టీం చెప్పిన ‘సాధనాథ్ సాధనే సర్వం’ అనే సిద్దాంతమే ఈ కార్తికేయ సినిమా విజయానికి ప్రధాన కారణం. ఇక మీ వంతు ఫ్రెండ్స్.. మీరు ఈ సిద్దాంతాన్ని ఫాలో అవ్వండి. మీరు అనుకున్న విజయాలను సాధించండి…

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.5/5
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం :