సమీక్ష : కవ్వింత – అర్థం లేని ‘బూతు’ కవ్వింత!!

సమీక్ష : కవ్వింత – అర్థం లేని ‘బూతు’ కవ్వింత!!

Published on Jan 9, 2016 6:25 PM IST
Kavvintha review

విడుదల తేదీ : 08 జనవరి 2016

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

దర్శకత్వం : త్రిపురనేని విజయ్ చౌదరి

నిర్మాత : పువ్వల శ్రీనివాసరావు

సంగీతం : సునీల్ కశ్యప్

నటీనటులు : విజయ్ దాట్లా, దీక్షా పంత్


విజయ్ దాట్లా, దీక్షాపంత్‌లు హీరో హీరోయిన్లుగా నటించగా అంజనీ మూవీస్ పతాకంపై పువ్వల శ్రీనివాసరావు నిర్మించిన సినిమా ‘కవ్వింత’. విజయ్ చౌదరి దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే ప్రేమకథకు, నకిలీ కరన్సీ ముఠా జరిపే ఓ అక్రమ కార్యకలాపానికి ముడిపెడుతూ రూపొందించిన సినిమా ఎంతమేరకు ఆకట్టుకుంది? అనేది చూద్దాం…

కథ :

శీను (విజయ్ దాట్లా) తన సొంత ఊరైన సాలురులో అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉండే ఓ సాధారణ గ్రామీణ యువకుడు. అదే ఊర్లో ఉండే తన మరదలైన రాణి (దీక్షా పంత్)ని శీను చిన్నప్పట్నుంచీ ప్రేమిస్తూ ఉంటాడు. అయితే ఏ పనీ చేయక అల్లరిగా తిరిగే అతడికి రాణినిచ్చి పెళ్ళి చేసేది లేదని చెప్పడంతో వారి ప్రేమకథకు బ్రేక్ పడుతుంది.

ఇక ఇదిలా ఉంటే సర్కార్ అనబడే ఓ మాఫియా లీడర్ పాకిస్థాన్ నుంచి ఇండియాకు దొంగ నోట్లను తీసుకొచ్చి వాటిని చలామణీ చేసేందుకు ఓ పెద్ద ప్లాన్ గీస్తాడు. ఆ క్రమంలోనే ఇండియాకు తరలించిన డబ్బును సాలురులోని ఓ గౌడోన్‌లో ఉంచుతాడు. సమాంతరంగా సాగిపోయే ఈ రెండు కథలూ ఎలా కలిశాయి? శీనుకి దొంగనోట్ల ముఠాకు సంబంధం ఏంటి? చివరకు ఆ ముఠా పని ఏమైంది? శీను ప్రేమకథ ఏమైంది? అన్న ప్రశ్నలకు సమాధానమే కవ్వింత!

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్ అని చెప్పుకోవాలంటే రెండు సంబంధం లేని, వేర్వేరు కథలను సమాంతరంగా నడుపుతూ ఆ రెండింటినీ సెకండాఫ్‌లో కలిపేసే చిన్న పాయింట్‌ను ఓ ప్లస్‌గా చెప్పుకోవచ్చు. ఇంటర్వెల్ బ్యాంగ్ ఉన్నంతలో బాగుంది. ఇక సినిమాకు ఉన్నంతలో మేజర్ హైలైట్ అంటే ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలను చెప్పుకోవచ్చు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో మంచి ఫన్ ఉంది. రెండు రొమాంటిక్ పాటల పిక్చరైజేషన్ బాగుంది.

హీరో విజయ్ ఓ గ్రామీణ యువకుడిగా బాగానే నటించాడు. అతని లుక్ కూడా పాత్రకు బాగానే సెట్ అయింది. దీక్షా పంత్ పాత్రకు కథలో పెద్దగా ప్రాధాన్యం లేకున్నా గ్లామర్‌తో మాత్రం బాగానే మెప్పించింది. ధన్‌రాజ్, సత్య, నవీన్ తదితర కమెడియన్స్ చాలాచోట్ల సినిమాను నిలబెట్టే సన్నివేశాలలో పంచ్ డైలాగ్స్ వేసి బాగా నవ్వించారు. సినిమా పరంగా ప్రేక్షకులకు నచ్చే పాయింట్స్ ఏమన్నా ఉన్నాయా అంటే.. ఫస్టాఫ్‌లోని రొమాన్స్, సెకండాఫ్‌లో ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌ లు మాత్రమే చెప్పుకోదగినవి.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకు మేజర్ మైనస్ పాయింట్ అంటే ఒక బలమైన కథంటూ లేకుండా, దానికి కనీసం ఆసక్తికరమైన స్క్రీన్‌ప్లే అంటూ రాసుకోకుండా రెండు గంటల అర్థం పర్థం లేని సినిమాను చెప్పాలన్న ఆలోచన గురించి చెప్పుకోవాలి. మొదటి సీన్‌తోనే సినిమాలో చివర్లో ఏం జరగబోతోందో చెప్పగలిగేంత విషయం చెప్పేసి ఆ తర్వాత ఎటూకానీ సన్నివేశాలతో లాక్కొచ్చారు. ఇక క్లైమాక్స్ వరకూ చేసేదేమీ లేక పూర్తిగా బూతు డైలాగులనే నమ్ముకోవడం దర్శక, నిర్మాతల అభిరుచికి నిదర్శనం. బూతు కామెడీ అనే జానర్, అలాంటివి కోరుకునే ప్రేక్షకులకు బాగుంటుందేమో కానీ ఇక్కడ కామెడీ కూడా లేకపోవడం అసలు విశేషం!

సినిమాలో ఏ పాత్రకూ ఒక అర్థమూ, విశేషమూ లేకపోవడం కూడా పెద్ద మైనస్. హీరోయిన్ పాత్ర కేవలం పాటల కోసం వచ్చిపోయే పాత్రలా కనిపిస్తుంది. ఫస్టాఫ్‌లో హీరో, హీరోయిన్ల రొమాన్స్ కూడా ఏమాత్రం ఆకట్టుకునేలా లేదు. ఈ సినిమాలో మాఫియా నేపథ్యంలో నడిచే రెండో కథ అంతా ఫక్తు కామెడీ వ్యవహారంలా ఉంటుంది. సర్కార్ అంటూ పిలవడబడే డాన్ అసలు డాన్‌లాగే ఉన్నాడా అన్న ప్రశ్న మొదటి సన్నివేశంలోనే మీకనిపిస్తుంది. ఇక రెండు ఐటమ్ సాంగ్స్ ఎందుకున్నాయో, ఎందుకొస్తాయో కూడా తెలీదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సినిమాలో ఇంకా చాలా మైనస్‌లున్నాయి. ఒక్క మాటలో సినిమాలో లాజిక్ అనేది ఉందా అనడిగితే సరిపోతుంది!

సాంకేతిక విభాగం :

సాంకేతిక అంశాల పరంగా ఈ సినిమాలో చెప్పుకోదగ్గవి ఏమైనా ఉన్నాయా అంటే అవి సునీల్ కశ్యప్ అందించిన మ్యూజిక్, సినిమాటోగ్రఫీ అని చెప్పుకోవచ్చు. పాటల్లో రెండు పాటలతో పాటు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విషయంలోనూ సునీల్ కశ్యప్ చాలాచోట్ల మంచి రిలీఫ్ ఇచ్చాడు. ఇక మాఫియా నేపథ్యంలో వచ్చే సన్నివేశాలను పక్కనబెడితే విలేజ్ నేపథ్య కథను సరిగ్గా చూపించడంలో సినిమాటోగ్రఫీ పనితనం బాగుంది. ఎడిటింగ్ ఏమాత్రం ఆకట్టుకునేలా లేదు. కొన్ని డైలాగులు బాగున్నా, ఓవరాల్‌గా కట్టిపడేసే స్థాయి డైలాగ్ ఒక్కటీ లేదు.

ఇక దర్శకుడు విజయ్ చౌదరి ఎంచుకున్న పాయింట్ దగ్గరే తప్పటడుగు వేశాడు. బలహీన కథను.. నిర్లిప్తంగా. అనవసరమైన సన్నివేశాలతో నడిపించి రచయితగా ఎక్కడా మెప్పించలేదు. దర్శకుడిగా కొంత కామెడీని పండించడం విషయాన్ని పక్కనబెడితే మెరుపులేమీ లేవు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఫర్వాలేదు.

తీర్పు :

చెప్పాలనుకున్న కథలో బలం లేనప్పుడు, చెప్పే సన్నివేశాల్లో క్లారిటీ లేనప్పుడు చాలా సినిమాలు కామెడీని నమ్ముకుంటాయి. కొన్ని సినిమాలు ఈ కామెడీకి కొంత బూతు మిక్స్ చేస్తుంటాయి. ఇక కామెడీకి తక్కువ, బూతుకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చి మనముందుకు వచ్చిన సినిమాయే ‘కవ్వింత’. ఇంటర్వెల్, క్లైమాక్స్, అక్కడక్కడ ఫర్వాలేదనిపించే కామెడీని వదిలేస్తే, ఈ సినిమాలో చెప్పుకోదగినవి, ప్రేక్షకులకి నచ్చే అంశాలు ఏమీ లేవు. ఒక సినిమాకు కావాల్సిన అసలైన సరుకునే పక్కనపెట్టి ఈ సినిమాను కేవలం బూతు డైలాగుల (అది కూడా కామెడీని మిక్స్ చేయని) కోసమే చూస్తామంటే చూడొచ్చు. అంతకుమించి ఈ సినిమా ఇవ్వగలిగేది ఏదీ లేదు!

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు