సమీక్ష : కేశవ – నిఖిల్ చేసిన మరో భిన్నమైన ప్రయత్నం

సమీక్ష : కేశవ – నిఖిల్ చేసిన మరో భిన్నమైన ప్రయత్నం

Published on May 20, 2017 12:20 PM IST
Keshava movie review

విడుదల తేదీ : మే 19, 2017

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

దర్శకత్వం : సుధీర్ వర్మ

నిర్మాత : అభిషేక్ నామ

సంగీతం : సన్నీ ఎం.ఆర్

నటీనటులు : నిఖిల్ సిద్దార్థ, రితు వర్మ, ఇషా కొప్పికర్

‘స్వామిరారా’ సినిమాతో మొదలుపెట్టి ‘కార్తికేయ , సూర్య వెర్సెస్ సూర్య, ఎక్కడికి పోతావు చిన్నవాడ’ లాంటి కొత్త, భిన్నమైన కథలను ఎంచుకుంటూ వరుస విజయాలందుకున్న యంగ్ హీరో నిఖిల్ చేసిన మరో వైవిధ్యమైన ప్రయత్నమే ఈ ‘కేశవ’. సుధీర్ వర్మ డైరెక్షన్లో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా ఎంత వైవిధ్యంగా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ :

చిన్నతనంలో జరిగిన కారు ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన కేశవ (నిఖిల్) అనే కుర్రాడు ఆ ప్రమాదానికి కారణమైన వారిని చంపాలనే పగతో పెరిగి పెద్దై వరుస హత్యలు చేస్తుంటాడు. అది కూడా పోలీస్ ఆఫీసర్లనే కావడంతో వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీస్ డిపార్ట్మెంట్ అతన్ని పట్టుకోవాలని నిర్ణయించుకుని స్పెషల్ ఆఫీసర్ షర్మిల (ఇషా కొప్పికర్) ను అప్పగిస్తుంది.

అలా కేసును టేకప్ చేసిన షర్మిల ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేసింది ? నేరస్థుడు కేశవే అని ఎలా గుర్తించింది ? అసలు కేశవ కుటుంబానికి జరిగిన కారు ప్రమాదానికి, పోలీసులకు లింకేంటి ? కేశవ పోలీసులకు పట్టుబడకుండా తన పగను ఎలా తీర్చుకున్నాడు ? ఎవరెవర్ని చంపాడు ? అనేదే స్క్రీన్ మీద నడిచే కథ.

ప్లస్ పాయింట్స్ :

దర్శకుడు సుధీర్ వర్మ ట్రైలర్లలో చెప్పినట్టు రివెంజ్ డ్రామా అనే అంశానికి ఖచ్చితంగా కట్టుబడి ఆరంభం నుండి చివరి దాకా సినిమాను ఎలాంటి డీవియేషన్స్ లేకుండా అదే అంశం మీద నడపడం బాగా నచ్చింది. పైగా తన కథకు అవసరంలేని కమర్షియల్ అంశాల జోలికి పోకుండా తక్కువ రన్ టైమ్ తో సినిమాను తయారుచేయడంతో ఎక్కడా మన సమయం వృధా చేసుకుంటున్నాం అనే ఫీలింగ్ కలగలేదు. వయసు పరంగా హీరో ఎదగడం అనే అంశాన్ని ఆసక్తికరమైన పద్దతిలో చూపించాడు సుధీర్ వర్మ. కథానాయకుడి పగకు అసలు కారణం ఏమిటనే పాయింట్, దాని చుట్టూ అల్లుకున్న డ్రామా బాగున్నాయి.

ఇక ఫస్టాఫ్ మొత్తం హీరో హత్యలు చేయడం, పోలీసులు తలలు పట్టుకోవడం వంటి విషయాలతో కాస్త తక్కువ ఫ్లోలో నడిపినప్పటికీ మధ్య మధ్యలో జోడించిన వెన్నెల కిశోర్ కామెడీ మాత్రం బాగానే ఎంటర్టైన్ చేసింది. అలాగే సెకండాఫ్లో రివీల్ అయ్యే అసలు వాస్తవాలు, వాటికి సుధీర్ వర్మ రాసిన సన్నివేశాలు మరీ కాకపోయినా కాస్త బలంగానే ఉన్నాయి.

అన్నిటికన్నా ముఖ్యంగా హీరో నిఖిల్ తన పాత్రను పరిచయం చేసినప్పటి నుండి సినిమా పూర్తయ్యే వరకు ఒకేరకమైన భావోద్వేగాలతో, ప్రవర్తనతో సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ చూపించి ఆకట్టుకున్నాడు. దివాకర్ మణి చేసిన కెమెరా వర్క్ అయితే చాలా బాగుంది. సహజమైన లొకేషన్లలో తీసిన ప్రతి ఫ్రేమ్ చాలా డీటైల్డ్ గా ఉండి సినిమాకు అదనపు బలాన్నిచ్చింది.

మైనస్ పాయింట్స్ :

ఫస్టాఫ్ ఆరంభం బాగానే ఉన్నా హీరో హత్యలు చేయడం, పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరగడం వంటి సన్నివేశాల్లో కొత్తదనమంటూ ఏం లేదు. పైగా వాటిలో అంత తీవ్రమైన భావోద్వేగాలు కూడా కనిపించలేదు. అలాగే హీరోకు ఎడమ వైపు ఉండాల్సిన గుండె కుడి వైపు ఉంటుందని ఆరంభంలో చెప్పడమేగాని దాన్ని కథనంలో ఊహించినంత గొప్పగా ఎలివేట్ చేయలేదు.

దర్శకుడు సుధీర్ వర్మ కథనం విషయంలో కొంచెం ఎక్కువ స్వేచ్చనే తీసుకోవడంతో రొటీన్ అంశాలైన పోలీసులు హీరోను ఆపలేకపోవడం, అతను శిక్ష నుండి తప్పించుకోవడం వంటి అంశాలు మరీ నాటకీయంగా ఉండి తేలిపోయాయి. ట్రైలర్లలో హీరో పాత్ర పరిస్థితుల ప్రభావంతో చాలా వైల్డ్ గా మారుతుందనే అంచనా కలిగించారేగాని తెర మీద మాత్రం హీరో పాత్ర సాఫ్ట్ గానే పోతుంటుంది తప్ప ఎక్కడా తారా స్థాయికి చేరుకోకపోవడం నిరుత్సాహాన్ని కలిగించింది.

సాంకేతిక విభాగం :

టెక్నికల్ టీమ్ విషయంలో ముందుగా ప్రస్తావించాల్సింది దివాకర్ మణి కెమెరా వర్క్ గురించి. అయన ప్రతి సన్నివేశాన్ని చాలా వివరంగా చూపించారు. కొన్ని సన్నివేశాల్ని చిత్రీకరించిన తీరు కూడా కొత్తగా ఉంది. ఇక సన్నీ ఎం.ఆర్ సంగీతం పర్వాలేదనిపించింది. ఇక గ్రౌండ్ స్కోర్ అయితే సినిమాకి ఇంటెన్సిటీని తీసుకురావడంలో సక్సెస్ అయింది . ఎస్. ఆర్ శేఖర్ ఎడిటింగ్ సినిమాను అర్థవంతంగా తయారుచేసింది. అభిషేక్ పిక్చర్స్ వారి నిర్మాణ విలువలు గొప్ప స్థాయిలో ఉన్నాయి.

దర్శకుడు సుధీర్ వర్మ విషయానికొస్తే ఆయన ఎంచుకున్న రివెంజ్ డ్రామా అనే పాయింట్ పాతదే కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానం కాస్త కొత్తగా ఉంది. ఫస్టాఫ్ ను రొటీన్ సీన్లతో, మంచి కామెడీతో అలా అలా నడిపినా సెకండాఫ్లో అసలు కథను రివీల్ చేయడం, హీరో పగ తీర్చుకోవడం వంటి అంశాలతో కొంచెం గ్రిప్పింగానే తయారు చేశారు. కానీ కీలకమైన ఇంటర్వెల్, క్లైమాక్స్ సన్నివేశాల్లో, హీరో పాత్రలో తీవ్రతను ఇంకా ఎక్కువగా ప్రదర్శించి ఉంటే బాగుండేది.

తీర్పు :

హీరో నిఖిల్ చేసిన మరో విభిన్నమైన ప్రయత్నం ‘కేశవ’ పూర్తిస్థాయిలో కాకపోయినా చాలా వరకు వర్కవుట్ అయింది. సుధీర్ వర్మ ఎంచుకున్న కథా నైపథ్యం, హీరో నిఖిల్ పెర్ఫార్మెన్స్, సినిమాటోగ్రఫీ, మంచి కామెడీ, అసలు కథ రివీల్ చేయబడే సెకండాఫ్ కథనం వంటి అంశాలు ఆకట్టుకోగా రొటీన్ గా ఉన్న ఫస్టాఫ్, తీవ్రత లోపించి బలహీనంగా మిగిలిన కీలక సన్నివేశాలు, అంచనాలను అందుకోలేకపోయిన కథానాయకుడి పాత్ర చిత్రీకరణ నిరుత్సాహపరిచే అంశాలుగా ఉన్నాయి. మొత్తం మీద చెప్పాలంటే ‘బాహుబలి – ది కంక్లూజన్’ తర్వాత ఈ 19వ తేదీ వరకు విడుదలైన అన్ని తెలుగు సినిమాల్లోకి ఈ ‘కేశవ’ ప్రేక్షకులకు మంచి ఛాయిస్ గా నిలుస్తుంది.

123telugu.com Rating : 3.25/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు