సమీక్ష : ‘మధుర వైన్స్’ – ఇంట్రస్ట్ గా సాగని ఎమోషనల్ లవ్ స్టోరీ !

సమీక్ష : ‘మధుర వైన్స్’ – ఇంట్రస్ట్ గా సాగని ఎమోషనల్ లవ్ స్టోరీ !

Published on Oct 23, 2021 3:03 AM IST
Madhura Wines Movie Review

విడుదల తేదీ : అక్టోబర్ 22, 2021

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు: సన్నీ నవీన్, సీమా చౌదరి, సమ్మోహిత్ తూములూరి తదితరులు

దర్శకుడు: జయకిషోర్.బి

నిర్మాతలు: రాజేష్ కొండెపు, సృజన్ యారబోలు

సినిమాటోగ్రఫీ: మోహన్ చారి.సిహెచ్

సంగీత దర్శకుడు: కార్తీక్ రోడ్రిగ్విజ్, జయ్ క్రిష్

ఎడిటర్: వర ప్రసాద్.ఎ

సన్నీ నవీన్, సీమా చౌదరి, సమ్మోహిత్ ప్రధాన పాత్రల్లో జయ కిషోర్ బండి దర్శకత్వంలో రాజేష్ కొండెపు నిర్మించిన చిత్రం ‘మధుర వైన్స్’. కాగా ఈ చిత్రం ఈ రోజే విడుదల అయింది. మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

 

కథ :

 

అజయ్ (సన్నీ నవీన్) మధురను ప్రేమిస్తాడు. అయితే ఆమె పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది. దాంతో ఆమె ప్రేమ మత్తులో పడి అజయ్ ఫుల్ గా తాగుతూ ఖాళీగా తిరుగుతూ ఉంటాడు. ఈ క్రమంలో అంజలి (సీమా చౌదరి) అజయ్ ను చూసి ప్రేమిస్తుంది. అతను కూడా ఆమెను ప్రేమిస్తాడు. అయితే ఆ ప్రేమ అంజలి అన్నయ్య (సమ్మోహిత్) కు ఇష్టం ఉండదు. ఒక తాగుబోతుకు తన చెల్లిని ఇచ్చి పెళ్లి చేయడానికి అతను వ్యతిరేకిస్తాడు. మరి ఈ ముగ్గురు మధ్య నడిచిన ఈ మధుర వైన్స్ డ్రామాలో చివరకు వీరి కథ ఎలా ముగిసింది ? అలాగే అంజలి అన్నయ్య ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు ? అసలు అజయ్ – అంజలి ఒక్కటయ్యారా ? లేదా ? అనే విషయాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

 

ఈ సినిమాలో హీరోగా నటించిన సన్నీ నవీన్ నటన పరంగా చక్కగా నటించాడు. తన మొదటి సినిమా అయినా నటనలో అతను చాలా ఈజ్ తో యాక్ట్ చేశాడు. అయితే కీలక పాత్రలో నటించిన సమ్మోహిత్ నటనే సినిమాకి ప్లస్ అయింది. తన డైలాగ్ డెలివరీ మరియు తన బాడీ లాంగ్వేజ్ తో ఎంతో అనుభవం ఉన్న నటుడిలా సమ్మోహిత్ బాగా నటించాడు.

ఇక సినిమాలో హీరోయిన్ గా సీమా చౌదరి చాలా అందంగా కనిపిస్తూ.. తన నటనతోనూ ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా కొన్ని బోల్డ్ సన్నివేశాల్లో ఆమె ఎక్స్ ప్రెషన్స్ బాగా అలరిస్తాయి. సినిమాలో హీరోకి తండ్రిగా కనిపించిన నటుడు, అలాగే హీరోకి ఫ్రెండ్ పాత్రలో నటించిన నటుడు కూడా తమ పాత్రల్లో ఒదిగిపోయారు. అలాగే హీరోకి అతని ఫాదర్ కి మధ్య వచ్చే కొన్ని భావోద్వేగ సన్నివేశాలు బాగున్నాయి. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు.

 

మైనస్ పాయింట్స్ :

 

దర్శకుడు జయ కిషోర్ బండి ఓ తాగుబోతు కథకు సంబంధించి మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నారు కానీ, ఆ లైన్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథాకథనాలను రాసుకోలేదు. దీనికి తోడు సినిమాలో కొన్ని కీలక సన్నివేశాలు కూడా సినిమాటిక్ గా అనిపిస్తాయి తప్ప, ఇన్ వాల్వ్ అయ్యే విధంగా అనిపించవు. సినిమాను ఇంకా ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నప్పటికీ.. దర్శకుడు మాత్రం ఆ దిశగా సినిమాని మలచలేదు.

ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ మినహా మిగతా సన్నివేశాలు అంతగా ఆకట్టుకోవు. పైగా కొన్ని సన్నివేశాల్లో నాటకీయత ఎక్కువవడంతో కథలో సహజత్వం చాలా వరకు లోపించింది. కానీ సినిమాలో దర్శకుడు చెప్పాలనుకున్న కథాంశం బాగుంది. కథాంశం బాగున్నా ఓవరాల్ గా ఈ చిత్రం నెమ్మదిగా సాగుతూ బోర్ కొట్టిస్తోంది.

 

సాంకేతిక విభాగం :

 

సాంకేతిక విభాగంలో చూసుకుంటే.. మోహన్ చారి.సిహెచ్ సినిమాటోగ్రఫీ బాగాలేదు. సినిమాలోని కొన్ని కీలక దృశ్యాలను కూడా కెమెరామెన్ సమర్ధవంతంగా చిత్రీకరించలేకపోయాడు. సంగీత దర్శకులు కార్తీక్ రోడ్రిగ్వెజ్, జయ్ క్రిష్ లు అందించిన సంగీతం విషయానికి వస్తే.. కొన్ని పాటలు పర్వాలేదనిపిస్తాయి. అలాగే సన్నివేశాల్లో నేపధ్య సంగీతం కూడా పర్వాలేదు. ఎడిటర్ బోర్ కొట్టించే కొన్ని సన్నివేశాలను ట్రిమ్ చేసి ఉంటే సినిమాకు ప్లస్ అయ్యేది. నిర్మాతలు పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకి తగ్గట్టు ఉన్నాయి.

 

తీర్పు :

 

టైటిల్ మాదిరిగానే ఈ సినిమా కూడా మద్యం చుట్టే తిరిగింది. ప్రతి సన్నివేశంలో ఆ మద్యం టాపిక్ లేకుండా సినిమా సాగలేదు. ఇక హీరో హీరోయిన్ల మధ్య వచ్చే కొన్ని లవ్ అండ్ ఎమోషనల్ సన్నివేశాలు పర్వాలేదనిపిస్తాయి. అలాగే సినిమా కథాంశం బాగుంది. కానీ కథాకథనాలు ఆకట్టుకునే విధంగా లేకపోవడం, లాజిక్ లెస్ సీన్స్, బోరింగ్ ట్రీట్మెంట్ వంటి అంశాల వల్ల సినిమా ఆకట్టుకోదు. అయితే, మందు బాబులకు, లవర్స్ కు సినిమాలో కొన్ని సీన్స్ కనెక్ట్ అవుతాయి. మిగిలిన వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా బోర్ కొడుతుంది.

123telugu.com Rating : 2.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Version

సంబంధిత సమాచారం

తాజా వార్తలు