సమీక్ష : ‘మిస్టర్ మజ్ను’ – అక్కడక్కడే బాగుంది !

Published on Jan 26, 2019 2:34 am IST

విడుదల తేదీ : జనవరి 25, 2019

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : అఖిల్, నిధి అగర్వాల్, నాగబాబు, వి జయప్రకాష్ , సితార తదితరులు.

దర్శకత్వం : వెంకీ అట్లూరి

నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్

సంగీతం : ఎస్ తమన్

ఎడిటర్ : నవీన్ నూలి

‘తొలిప్రేమ’ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో యంగ్ హీరో అక్కినేని అఖిల్ హీరోగా ‘అఖిల్, హలో’ చిత్రాల తరువాత చేస్తోన్న మూడవ చిత్రం ‘మిస్టర్ మజ్ను’. ఈ సినిమాలో అఖిల్ సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఈ రోజే విడుదల అయింది. మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!

కథ :

విక్కీ (అఖిల్) అమ్మాయిలను తన లుక్స్ అండ్ మాటలతోనే తనవైపు తిప్పుకునే రొమాంటిక్ ప్లే బాయ్. మరో పక్క నిక్కీ (నిధి అగర్వాల్) తనకు రాముడు లాంటి భర్త కావాలని కోరుకుంటుంది. కాగా ఇలాంటి విరుద్ధమైన స్వభావాలు, ఆలోచనలు ఉన్న వీరిద్దరూ.. కొన్ని నాటకీయ పరిణామాల మధ్య కలవాల్సి వస్తోంది. ఈ క్రమంలో విక్కీని అర్ధం చేసుకున్న నిక్కీ అతన్ని లవ్ చేస్తోంది. కానీ విక్కీ మాత్రం అలాంటి సిన్సియర్ లవ్ నా వల్ల కాదు అంటూనే ఆమెతో ప్రేమలో పడతాడు.ఆ తర్వాత జరిగే కొన్ని అనుకోని సంఘటనల కారణంగా నిక్కీ విక్కీ ఇద్దరు విడిపోతారు. ఆ తరువాత మళ్ళీ విక్కీ నిక్కీ ఎలా కలిసారు ? విక్కీ నిక్కీ ప్రేమను దక్కించుకోవడానికి ఏమి చేసాడు ? చివరకి ఇద్దరూ ఒక్కటయ్యారా ? లేదా ? ఈ క్రమంలో విక్కీ ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు ? లాంటి విషయాలు తెలయాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

తన మొదటి సినిమా కూడా రిలీజ్ ఆవ్వకముందే, అఖిల్ యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నప్పటికీ.. తను చేసిన మొదటి రెండు సినిమాలు మాత్రం అఖిల్ కి ఆశించిన స్థాయిలో స్టార్ డమ్ ని తెచ్చి పెట్టలేకపోయాయి. అయితే ప్రస్తుతం మిస్టర్ మజ్నుతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అఖిల్ ఈ సారి ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమా కోసం అన్నీ రకాల జాగ్రత్తలు తీసుకుని మరి చేశాడు.

ముఖ్యంగా తన బాడీ లాంగ్వేజ్, తన మాడ్యులేషన్ విషయంలో అఖిల్ పెట్టిన ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి. ప్లే బాయ్ అయిన విక్కీ పాత్రలో చక్కని నటనను కనబరిచాడు. గత తన సినిమాల్లో కంటే ఈ సినిమాలో కొత్త లుక్ తో ఫ్రెష్ గా కనిపించాడు. తన నటనతో అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేస్తూనే, ఇటు సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో హీరోగా తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. ఇక హీరో హీరోయిన్ల మధ్య సీన్లు, వారి మధ్య కెమిస్ట్రీ బాగానే అలరిస్తుంది. అలాగే తన బాబాయ్ గా నటించిన రావు రమేష్ ఆస్తికి సంబంధించిన లాంటి కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా అఖిల్ నటన చాలా బాగుంది.

ఇక అఖిల్ సరసన కథానాయకిగా నటించిన నిధి అగర్వాల్ తన స్క్రీన్ ప్రెజెన్స్ మరియు తన గ్లామర్ తో పాటుగా తన నటనతోనూ మెప్పించే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో మరియు ప్రేమ సన్నివేశాల్లో ఆమె చాలా బాగా నటించింది. ఇక కమెడియన్స్ హైపర్ ఆది, ప్రియదర్శి కూడా తమ కామెడీ టైమింగ్ తో మ్యానరిజమ్స్ తో కొన్ని చోట్ల నవ్వించారు.

అలాగే జయప్రకాశ్, సుబ్బరాజు, ఆజేయ్, సితార, అలగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. దర్శకుడు వెంకీ కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో అలాగే కొన్ని కామెడీ సన్నివేశాల్లో కూడా మంచి దర్శకత్వ పనితనం కనబరిచారు.

మైనస్ పాయింట్స్ :

దర్శకుడు వెంకీ అట్లూరి ప్లే బాయ్ క్యారెక్టరజేషేన్ సంబంధించి మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నారు కానీ, ఆ లైన్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథనాన్ని మాత్రం రాసుకోలేదు. దీనికి తోడు సినిమాలో కొన్ని కీలక సన్నివేశాలు సాగతీతగా అనిపిస్తాయి. అయితే కథనం ఇంకా ఆసక్తికరంగా నడిపే అవకాశం ఉన్నప్పటికీ.. దర్శకుడు మాత్రం ఆ దిశగా మలచలేకపోయారు.

ముఖ్యంగా సెకెండ్ హాఫ్ లో హీరోయిన్ హీరోన్ని రిజెక్ట్ చేసే సన్నివేశాలు, అసలు హీరోను అంతగా ఎందుకు రిజెక్ట్ చేస్తోందో అనే విషయంలో బలమైన కారణాలు కనిపించవు. ఫస్ట్ హాఫ్ లో హీరోయిన్ తనకి నచ్చిన ఒక ప్లే బాయ్ అయిన హీరోతో ప్రేమలో పడే సన్నివేశాలను బాగా రాసుకున్న దర్శకుడు, సెకెండ్ హాఫ్ లో హీరో ప్రేమను రిజెక్ట్ చేసే సన్నివేశాలను మాత్రం చాలా సింపుల్ గా అనిపించాయి.

సాంకేతిక విభాగం :

దర్శకుడు వెంకీ అట్లూరి కొన్ని సన్నివేశాల్లో మెప్పించే ప్రయత్నం చేసినా, పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథా కథనాన్ని మాత్రం రాసుకోలేదు. ఇక సినిమాలో సినిమాటోగ్రఫీ బాగుంది. లండన్ లో తెరకెక్కించిన దృశ్యాలన్నీ ఆయన చాలా అందంగా చూపించారు.

ఇక సంగీత దర్శకుడు ఎస్ తమన్ అందించిన పాటలు పర్వాలేదనిపస్తాయి. ముఖ్యంగా సెకండాఫ్ లో వచ్చే ఎమోషనల్ సాంగ్ , అలాగే కొన్ని కీలక సన్నివేశాల్లో ఆయన అందించిన నేపధ్య సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. నవీన్ నూలి ఎడిటింగ్ బాగుంది. సినిమాలోని నిర్మాత పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి.

తీర్పు :

వెంకీ అట్లూరి దర్శకత్వంలో అక్కినేని అఖిల్ హీరోగా, నిధి అగర్వాల్ హీరోయిన్ గా భారీ అంచనాల మధ్యన వచ్చిన ఈ చిత్రం హీరో క్యారెక్టరైజేషన్ తో అలాగే కొన్ని సన్నివేశాలతో బాగా ఆకట్టుకున్నప్పటికీ.. కథ మరియు సెకెండ్ హాఫ్ విషయంలో మాత్రం వెంకీ అట్లూరి పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయారు. ముఖ్యంగా సెకెండ్ హాఫ్ లో హీరోయిన్ హీరోన్ని రిజెక్ట్ చేసే సన్నివేశాలు, అసలు హీరోను అంతగా ఎందుకు రిజెక్ట్ చేస్తోందో అనే విషయంలో బలమైన కారణాలు లేకపోవడం, హీరోయిన్ క్యారెక్టరైజేషన్ లో సరైన క్లారిటీ లేకపోవడం వంటి అంశాలు సినిమాకి బలహీనతలుగా నిలుస్తాయి.

అయితే అఖిల్ తన లుక్స్ అండ్ పెర్ఫార్మెన్స్ తో సినిమాని నిలబెట్టే ప్రయత్నం చేసారు. నిధి అగర్వాల్ నటన కూడా చాలా బాగుంది. ఇక హైపర్ ఆది, ప్రియదర్శి తమ కామెడీ టైమింగ్ తో బాగానే నవ్వించారు. మొత్తం మీద అక్కినేని అభిమానులకు ఈ చిత్రం బాగా నచ్చుతుంది. అయితే మిగిలిన అన్నివర్గాల ప్రేక్షకులని ఎంత వరకు అలరిస్తుందో చూడాలి.

123telugu.com Rating : 2.75/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం :