ఆడియో సమీక్ష : అ..ఆ.. – వినసొంపైన సాహిత్యంతో మ్యాజిక్!

ఆడియో సమీక్ష : అ..ఆ.. – వినసొంపైన సాహిత్యంతో మ్యాజిక్!

Published on May 5, 2016 5:51 PM IST

a.aa_
త్రివిక్రమ్ సినిమాలంటే ఓ అందమైన కథ, దానిచుట్టూ అంతే అందమైన భావోద్వేగాలు, కుటుంబ బంధాలు, తనదైన టచ్ ఉన్న ఎవ్వరికీ సాధ్యం కాని సంభాషణల గురించి చెప్పుకుంటూంటాం. అదేవిధంగా ఆయన సినిమాల్లో పాటలకు కూడా మంచి ప్రాధ్యాన్యత ఉంటుంది. త్రివిక్రమ్ సినిమాలన్నింటిల్లో సూపర్ హిట్ పాటలున్నాయి. తాజాగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘అ..ఆ..’ సినిమాకు సంబంధించిన ఆడియో ఈమధ్యే విడుదలైంది. మొదటిసారి త్రివిక్రమ్, మిక్కీ జే మేయర్‌తో జతకట్టి ఓ రొమాంటిక్, కూల్ ఆల్బమ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. మరి ఈ ఆల్బమ్ ఎంతమేరకు ఆకట్టుకునేలా ఉందీ? చూద్దాం..

1. పాట : యా.. యా..
గాయనీ గాయకులూ : అభయ్ జోధ్‍పూర్, చిత్ర, అంజనా సౌమ్య, సాయి శివాని
సాహిత్యం : రామ జోగయ్య శాస్త్రిg (3)

‘యా.. యా..’ అంటూ సాగే ఈ పాట పల్లెటూరి పచ్చదనాన్ని, పల్లెకి మాత్రమే తెలిసిన మెలోడీని పరిచయం చేసే పాట. రామ జోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం, మిక్కీ జే మేయర్ ట్యూన్ ఈ పాటలో పోటీ పడి మరీ మెప్పించే ప్రయత్నం చేశాయి. మిక్కీ, ఫోక్ పాటలాగా మొదలుపెట్టి రకరకాల మూడ్స్‌ను పరిచయం చేస్తూ పాటకు ట్యూన్ సమకూర్చిన విధానం అద్భుతం. ఇక రామ జోగయ్య శాస్త్రి ఈ పాటలో పదాలతో చాలా ప్రయోగాలు చేశారు. ‘కోపాల గోపాల..’ అంటూ వచ్చే బిట్ పాటను మరో స్థాయికి తీసుకెళ్ళిందనే చెప్పాలి. గాయనీ గాయకుల ప్రతిభను కూడా మెచ్చుకోవాల్సిందే!

2. పాట : రంగ్‌దేg (2)
గాయనీ గాయకులూ : రమ్య బెహరా, సాయి శివాని, రాహుల్ నంబియార్
సాహిత్యం : రామ జోగయ్య శాస్త్రి

‘రంగ్‌దే.. రంగ్‌దే..’ అంటూ కథానాయిక ఇష్టాలను, ఆలోచనను తెలియజేసే ఈ పాట వినగా వినగా బాగా ఎక్కే పాట. ముఖ్యంగా ఈ పాటలో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’లోని ‘ఆరడుగులుంటాడా?’ ప్రభావం కనిపించినా, కొన్ని కొత్త ఇన్స్ట్రుమెంట్స్ వాడి మిక్కీ మరో కొత్త పాట ఫీల్ కల్పించారు. రమ్య బెహరా, సాయి శివానిల గానం ఈ పాటకు మంచి అందాన్ని తీసుకురాగా, రాహుల్ నంబియార్ వచ్చాక పాట స్థాయి మరింత పెరిగింది. రామ జోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం చాలా బాగుంది. సినిమాతో, కథానాయిక పాత్ర తీరుతో కలిపి చూసినప్పుడు ఈ పాటకు మరింత అందం వస్తుందని ఆశించొచ్చు.

3. పాట : అనసూయ కోసంg (1)
గాయనీ గాయకులూ : కార్తీక్, రాప్ : రోల్ రిద
సాహిత్యం : కృష్ణ చైతన్య

‘అనసూయ కోసం..’ అంటూ సాగే ఈ పాట సాహిత్య ప్రధానంగా సాగే ఫన్నీ పాట. మిక్కీ జే మేయర్ అందించిన ట్యూన్ మొదట్లో చాలా నార్మల్‌గా మొదలై, ఆ తర్వాత మెల్లిగా ఊపందుకుంటూ బాగా ఆకట్టుకుంటుంది. కృష్ణ చైతన్య అందించిన సాహిత్యం, కార్తీక్ దాన్ని పాడిన విధానం ఈ పాటలో బాగా ఆకట్టుకునే అంశాలు. ఈ పాట కూడా కథ ప్రకారంగా వచ్చే పాట కాబట్టి సినిమాతో కలిసి చూసినప్పుడు బాగా ఆకట్టుకుంటుందని చెప్పొచ్చు.

4. పాట : మమ్మీ రిటర్న్స్4
గాయనీ గాయకులూ : శ్రావణ భార్గవి
సాహిత్యం : రామ జోగయ్య శాస్త్రి

‘మమ్మీ రిటర్న్స్’ అంటూ సాగే ఈ పాట ఈ ఆల్బమ్‌లో కొంచెం కొత్తదనమున్న పాట. మిక్కీ జే మేయర్ అందించిన ట్యూన్‌లో కొత్తదనం ఈ పాటలో చూడొచ్చు. శ్రావణ భార్గవి పాడిన విధానాన్ని కూడా మెచ్చుకోవాలి. ముఖ్యంగా ‘ఓ గాడ్ వాట్ టు డూ.. పద పద పరుగిడూ..’ అన్నప్పుడు శ్రావణ భార్గవి ఈ పాటలో చేసిన మ్యాజిక్ చూడొచ్చు. రామ జోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం కూడా పాట మూడ్‌కి తగ్గట్టుగా, ఎక్కువగా ఇంగ్లీష్ పదాలే వాడినా బాగుంది.

5. పాట : ఎళ్ళిపోకే శ్యామలా5
గాయనీ గాయకులూ : కార్తీక్
సాహిత్యం : రామ జోగయ్య శాస్త్రి

‘ఎళ్ళిపోకె శ్యామలా’ అంటూ వచ్చే ఈ పాటను ఈ ఆల్బమ్‌లో బెస్ట్ పాటగా చెప్పుకోవచ్చు. ట్యూన్, లిరిక్స్, సింగింగ్ ఈ మూడు అంశాలూ సరిగ్గా కలిస్తే ఎలా ఉంటుందో ఈ పాట బలంగా చూపించింది. రామ జోగయ్య శాస్త్రి సాహిత్యం అర్థవంతంగా ఉండడంతో పాటు ఓ బ్రేకప్ సాంగ్‍కు కావాల్సిన బలమైన ఫీల్‌ను కూడా తెచ్చిపెట్టింది. కార్తీక్ గానం కూడా చాలా బాగుంది. ఎక్కడెక్కడ ఏ మూడ్ అవసరమో దాన్ని కార్తీక్ సరిగ్గా పట్టుకున్నట్టు ఈ పాట వింటే అర్థమైపోతుంది. మిక్కీ కూడా రకరకాల సంగీత పరికరాలతో ప్రయోగాలు చేశాడు.

తీర్పు :

సాధారణంగా కమర్షియల్ సినిమాల్లో పాటలు ఓ ఫార్మాట్ గీస్కొని దానిచుట్టూనే తిరుగుతూ ఉంటాయి. ‘అ..ఆ..’ ఆల్బమ్ ఇందుకు భిన్నంగా, కథను, కథా ఆలోచనను తెలియజేస్తూ సందర్భానుసారంగా వచ్చే పాటలతో సాగుతూ కనిపించేదిగా చెప్పుకోవచ్చు. మిక్కీ జే మేయర్ ఎప్పట్లానే తన సంగీతం స్థాయి ఏంటో చాటుకున్నారు. త్రివిక్రమ్‌తో కలిసి మొదటిసారి పనిచేసిన మిక్కీ, అన్నివిధాలా ఓ మంచి ఆల్బమ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎక్కువగా సాహిత్యమే మార్కులే కొట్టేసే ఈ ఆల్బమ్‌లో ‘ఎళ్ళిపోమాకే’, ‘యా యా’, ‘రంగ్‍దే’.. సంగీతం, సాహిత్యం రెండింటి పరంగా ఆకట్టుకునే పాటలుగా చెప్పాలి. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఇలాంటి సినిమాల్లో పాటలన్నీ వినగా వినగా, సినిమాతో పాటు చూడగా వాటి స్థాయి పెంచుకుంటూ పోతాయన్నది వాస్తవం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు