ఆడియో సమీక్ష : బాహుబలి – ‘బాహుబలి’ స్థాయికి తగ్గ ఆడియో!

ఆడియో సమీక్ష : బాహుబలి – ‘బాహుబలి’ స్థాయికి తగ్గ ఆడియో!

Published on Jun 14, 2015 11:21 AM IST

Baahubali-pposter
దర్శకుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ‘బాహుబలి’. ఈ సినిమాకు సంబంధించిన ప్రతీ విషయాన్ని అభిమానులు ఎంతో ఆసక్తిగా గమనిస్తున్నారు. తాజాగా బాహుబలి మొదటి భాగానికి సంబంధించిన ఆడియో ఆవిష్కరణ వేడుక నిన్న తిరుపతిలో వైభవంగా జరిగింది. ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న ఆడియో విడుదలతో అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. మరి ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఆడియో ఆ అంచనాలను అందుకుందా? చూద్దాం..

071. పాట : పచ్చ బొట్టేసి
గానం : కార్తిక్, దామిని
సాహిత్యం : అనంత శ్రీరామ్

‘పచ్చ బొట్టేసిన’ అంటూ సాగిపోయే పాట కీరవాణి రొమాంటిక్ రిథమ్‌ల స్టైల్లో సాగిపోయే అందమైన పాట. వినడానికి ఎంతో అందంగా ఉన్న ఈ పాట వినగానే పల్లవిని హాయిగా పాడుకునేంత అందంగా ఉంది. కార్తీక్, దామినిల గొంతుక ఈ పాటలో తీయగా వినిపిస్తాయి. కీరవాణి స్టైల్ అచ్చమైన తెలుగు రిథమ్ ఈ పాటకు మంచి అందాన్ని తెచ్చింది. అనంత శ్రీరామ్ ఇలాంటి పాటలు రాయడంలో చేయి తిరిగిపోయాడని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

2. పాట : ధీవరా
గానం : రమ్య బెహరా, దీపు01
సాహిత్యం : రామ జోగయ్య శాస్త్రి

ధీవరా అంటూ సాగే ఈ పాటలో కీరవాణి వాడిన ఇన్స్ట్రుమెంట్లు వినడానికి చాలా బాగున్నాయి. రమ్య బెహరా గొంతుతో అందంగా మొదలయ్యే ఈ పాటలో ధీవరా అంటూ వచ్చే సౌండ్‌తో పాట మరో ఎత్తులోకి వెళ్ళిపోతుంది. రామ జోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం బాగుంది. సంస్కృత సాహిత్యం కీరవాణి పాటల్లో మంచి అందాన్ని తెచ్చిపెడతాయని మరోసారి నిరూపించిందీ పాట. దీపు గొంతులో ఈ పాట వినడం బాగుంది.

                                 3. పాట : మమతల తల్లి
06గానం : సత్య యామిని
సాహిత్యం : శివశక్తి దత్తా

బాహుబలి ధీరత్వాన్ని, మహిశ్మతి ప్రతిష్టతను తెలియజెప్పే ఈ పాట కీరవాణి సంగీతం నుంచి బయటకొచ్చిన మరో అద్భుతమైన పాట. ఈ పాటలో వాడిన సంగీత పరికరాలు, అద్భుతమైన సాహిత్యం ఈ పాటను మరో ఎత్తులో నిలబెట్టింది. బాహుబలి టీజర్‌లో వినిపించిన మ్యూజిక్ ఈ పాటలో వినొచ్చు. విజువల్స్‌తో కలిపి చూస్తే ఈ పాట ఇంకా ఏ స్థాయిలో ఉంటుందోనని ఇప్పట్నుంచే అనిపించక మానదు.

4. పాట : శివుని ఆన
గానం : కీరవాణి, మౌనిమ02
సాహిత్యం : ఇనగంటి సుందర్

ఎవ్వడంట ఎవ్వడంట అంటూ వచ్చే ఈ పాట బాహుబలి ఆల్బ‌మ్‌లో టాప్ సాంగ్స్‌లో ఒకటి. ఈ పాటలో కీరవాణి సంగీతం కట్టిపడేస్తుంది. పై స్థాయిలో వినిపించే డ్రమ్స్ చప్పుడు ఈ పాటను ఓ రేంజ్‌కి తీసుకెళ్ళింది. కీరవాణి స్వయంగా ఈ పాటను పాడగా, ఆయన గొంతులో వినిపించే ఎనర్జీ ఈ పాటకు మేజర్ హైలైట్. ఇక సాహిత్యం కూడా ఈ పాటను ఇంతలా ఆకట్టుకునేలా చేయడంలో ప్రధాన పాత్ర వహించింది. మౌనిమ గొంతులో చివర్లో వినిపించే.. ఎక్కడా కనందీ, ఎప్పుడూ వినందీ అన్న సౌండ్ పాట అయిపోయాక కూడా వెంటాడుతుంది.

                                   5. పాట : మనోహరి
గానం : మోహన భోగరాజు, రేవంత్08
సాహిత్యం : చైతన్య ప్రసాద్

వీరా వీరా అంటూ సాగే ఈ పాట ఐటెమ్ నంబర్ తరహాలో కనిపిస్తుంది. సాహిత్యం, సంగీతం అన్నీ అదే స్టైల్లో ఉండడాన్ని చూడొచ్చు. లేడీ వాయిస్ హస్కీగా కిక్కిస్తే, మేల్ వాయిస్ అదే స్థాయిలో వినూత్నంగా వినిపిస్తూ కిక్కిస్తూ ఉంటుంది. ‘ఇరుక్కు.. పో..’ అన్నట్టు వినిపించే సౌండ్ రిపీటెడ్‍గా వినిపించేంతలా ఉంది. చైతన్య ప్రసాద్ సాహిత్యంలో మంచి గమ్మత్తుంది. కీరవాణి ఆ గమ్మత్తును తన మ్యూజిక్‌తో మరింత గమ్మత్తుగా వినిపించేలా చేశాడు.

6. పాట : నిప్పులే శ్వాసగా
04గానం : ఎమ్.ఎమ్.కీరవాణి
సాహిత్యం : ఇనగంటి సుందర్

నిప్పులే శ్వాసగా అంటూ సాగే ఈ పాటలో కీరవాణి పై స్థాయిలో పాడే పాటలో ఉండే కిక్ ఏంటో చూడొచ్చు. మాహిష్మతే అంటూ వచ్చే సంస్కృత సాహిత్యం కీరవాణి అందించిన అద్భుతమైన మ్యూజిక్‌కు బలంగా నిలిచింది. బలమైన సందర్భంలో వచ్చే పాటగా ఈ పాట కనిపిస్తోంది. విజువల్స్‌తో చూసినప్పుడు ఆ మ్యూజిక్, సాహిత్యంలోని వైబ్రేషన్ ఏ స్థాయిలో ఉంటుందో ఊహించేసుకోవడమే ఈ పాట విన్న వెంటనే మనం చేసే పనంటే అతిశయోక్తి కాదు.

                                 7. పాట : జీవనది
06గానం : గీతా మాధురి
సాహిత్యం : ఇనగంటి సుందర్

‘బంగారు కలల్ని..’ అంటూ మొదలయ్యే ఈ పాటలోని ఫీల్ కట్టిపడేస్తుంది. కీరవాణి సంగీతం, గీతామాధురి గొంతు, ఇనగంటి సుందర్ సాహిత్యం ఈ పాటలోని బాధను అర్థం చేసుకోవడానికి సరిగ్గా సరిపోయాయి. సినిమాలో బలమైన సన్నివేశంలో వచ్చే పాటగా దీన్ని ఊహించవచ్చు. ఆ సందర్భంతో చూసినప్పుడు ఈ పాటలోని భావోద్వేగం, బాధ ఎలా ఉంటుందో అన్నది ఇప్పట్నుంచే ఊహించకుండా ఉండలేం.

తీర్పు :

ఒక్కసారి పాటలన్నింటినీ కలిపి సమీక్షించుకుంటే ‘బాహుబలి’ లాంటి ప్రతిష్టాత్మక సినిమాకు మనం ఏ స్థాయి పాటలను ఊహిస్తామో అందుకు ఏమాత్రం ఈ ఆల్బమ్ తగ్గలేదు. అన్నీ సందర్భానుసారంగానే వచ్చే పాటలే కావడంతో ఆల్బమ్ వినగానే, సినిమాతో పాటు చూసినపుడు ఇవే పాటలు ఇంకెంత అద్భుతంగా కనిపిస్తాయోనన్నది ఇప్పట్నుంచే ఊహించుకోవడం మొదలుపెట్టేస్తామంటే అతిశయోక్తి కాదు. శివుని ఆన, ధీవరా, పచ్చ బొట్టేసిన, మమతల తల్లి అందరి నోటా మారుమోగిపోతాయని చెప్పుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే.. కీరవాణి మరో అద్భుతమైన ఆల్బమ్‌తో మనముందుకు వచ్చాడనే చెప్పుకోవాలి. బాహుబలి ఆడియోపై ఉన్న అంచనాలన్నీ కీరవాణి అందించిన ఆల్బమ్ అందుకొని సినిమాకు తగ్గ ఆల్బంగా నిలిచిందని చెప్పుకోవచ్చు.


బాహుబలి ఆడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు