మ్యూజిక్ రివ్యూ : ముకుంద – క్లాస్ ఆల్బం

మెగా అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘ముకుంద’ సినిమా ఆడియో నేడు ప్రేక్షకుల కోలాహలం మధ్య విడుదలైంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మిక్కి జె మేయర్ సంగీత దర్శకుడు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యం అందించారు. ఈ సినిమాలో పాటలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

1. పాట : చేసేదేదో
గాయకులు : రాహుల్ నంబియార్, రేవంత్
సాహిత్యం : సిరివెన్నెల
యూత్ ఫుల్ నెంబర్ తో ‘ముకుంద’ ఆల్బమ్ లో మొదటి పాటను కంపోజ్ చేశారు. ఈ పాటలో లిరిక్స్ చాలా ఇన్స్పిరింగ్ గా ఉన్నాయి. రాహుల్ నంబియార్, రేవంత్ ల వాయిస్ సాంగులో టెంపోను పెంచింది. కంప్లీట్ రాక్ బేస్ ఫీలింగ్ లో ఈ పాట సాగిపోతుంది. హీరో యొక్క స్వభావాన్ని దర్శకుడు ఈ పాటలో చూపించే అవకాశం ఉంది. అనేక సార్లు వినగావినగా ఈ పాటను ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. స్లో పాయిజన్ అనమాట.

2. పాట : దరె ధమ్ దధమ్
గాయకుడు : మిక్కి జె మేయర్, సాయి శివాని
సాహిత్యం : సిరివెన్నెల

‘దరె ధమ్ దధమ్..’ అంటూ సాగిపోయే ఈ పాటను సంగీత దర్శకుడు స్వయంగా పాడడం విశేషం. మిక్కితో సాయి శివాని తన గొంతును కలిపింది. టిపికల్ మిక్కి జె మేయర్ స్టైల్ లో సాగిపోయిన ఈ పాటను ‘ముకుంద’ ఆల్బంలో బెస్ట్ సాంగ్ గా చెప్పుకోవచ్చు. పాటలో కోరస్ క్యాచిగా ఉంది. పాటలో హుక్ అప్ లైన్ ‘దరె ధమ్ దధమ్..’ వినగానే శ్రోతలను ఆకట్టుకుంటుంది. ఈ రొమాంటిక్ సాంగ్ తప్పకుండా చార్ట్ బస్టర్ లో టాప్ ప్లేస్ లో ఉంటుంది. విజువల్స్ కూడా అందంగా ఉంటాయని ఆశించవచ్చు.

3. పాట : చాలా బాగుంది
గాయని : హరిచరణ్
సాహిత్యం : సిరివెన్నెల

మిక్కి జె మేయర్ వినసొంపైన బాణి, సిరివెన్నెల సీతారామ శాస్త్రి అర్ధవంతమైన సాహిత్యం, హరిచరణ్ గానం.. ముగ్గురూ అత్యుత్తమ ప్రతిభ కనబరచడంతో ‘చాలా బాగుంది’ పాటను నిజంగా బాగుంది అని ప్రతి ఒక్కరూ ప్రశంసించేలా చేశాయి. ముఖ్యంగా ‘చాలా బాగుంది’ అనే పదాన్ని హరిచరణ్ పాడిన విధానం సాంగులో ఫీల్ ను ఎఫెక్టివ్ గా ప్రెజెంట్ చేసింది. యూత్ ఫుల్ అప్పీల్ గల ఈ సాంగ్ మధ్యలో వినిపించే గిటార్ మ్యూజిక్ యూత్ ను ఎట్రాక్ట్ చేస్తుంది.

4. పాట : గోపికమ్మ
గాయని : చిత్ర
సాహిత్యం : సిరివెన్నెల

‘ముకుంద’ ఆల్బంకు కంప్లీట్ ట్రెడిషనల్ లుక్ తీసుకొచ్చింది ఈ ‘గోపికమ్మ…’ సాంగ్. లెజెండ్రీ సింగర్ చిత్ర గారి వాయిస్, ‘గోపికమ్మ చాలునే నీ నిదర..’ అంటూ వచ్చే కోరస్ వాయిస్ పాటలో పండుగ వాతావరణం తీసుకొచ్చాయి. తన అనుభవాన్ని అంతా రంగరించి సిరివెన్నెల రాసిన సాహిత్యం టాప్ క్లాస్ లో ఉంది. సాహిత్యం ఎంత సుస్పష్టంగా వినబడుతుందో.. నేపధ్యంలో తబలా, ఇతర వాయిద్యాల శబ్దం, చిత్ర వాయిస్ కూడా అంతే సుస్పష్టంగా వినబడడం ఈ పాటలో ప్రత్యేకత. మిక్కి ఈ సాంగును అద్బుతంగా కంపోజ్ చేశారు. క్లాస్ ఆల్బంలో సూపర్ హిట్ గా నిలిచింది ఈ పాట.

5. పాట : అరరె చంద్రకళ
గాయనీ గాయకులు : కార్తీక్, సాయి శివాని
సాహిత్యం : సిరివెన్నెల

ఆడియోలో కొంచం మాస్ టచ్ తో సాగిపోయే క్లాస్ సాంగ్ ఇది. కార్తీక్, సాయి శివానిల గానం పాటకు రొమాంటిక్ ఫీల్ తీసుకొచ్చాయి. లిరిక్స్ యువతను ఆకట్టుకునేలా ఉన్నాయి. తన క్లాస్ టచ్ వదలకుండా మాస్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు మిక్కి. హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ చిగురించే సమయంలో ఈ పాట వచ్చే అవకాశం ఉంది.

6. పాట : నందనాల
గాయని : శ్వేతా పండిట్
సాహిత్యం : సిరివెన్నెల

శ్వేతా పండిట్ పాడిన ఈ సాంగ్ టిపికల్ మిక్కి జె మేయర్ స్టైల్ లో సాగిపోతుంది. ముఖ్యంగా ‘నందనాల.. ‘ అంటూ కోరస్ పాడిన విధానం, చాలా వినసొంపుగా మిక్కి స్వరపరిచిన ట్యూన్ వినగానే ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఒక్క నందనాల పదం తప్పిస్తే, మిగతా సాహిత్యం అంతా వాడుక భాషలో ఉండడంతో సాంగ్ మళ్లీ మళ్లీ వినాలనిపించేలా చేశాయి. సింగింగ్, లిరిక్స్, మ్యూజిక్ ఈ సాంగులో పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. దర్శకుడి గత సినిమాలలో కూడా ఇలాంటి మెలోడియస్ సాంగ్స్ ఉన్నాయి. శ్రీకాంత్ అడ్డాల అభిరుచిని చాటిన సాంగ్ ఇది.

తీర్పు :

‘ముకుంద’ ఆడియోతో సినిమా విడుదలకు ముందే వరుణ్ తేజ్ పై సగ భారం తగ్గిపోయింది. ‘గోపికమ్మ..’, ‘నందనాల..’, ‘దరె ధమ్ దధమ్..’ పాటలు వినగానే శ్రోతలను ఆకట్టుకుంటాయి. తను క్లాస్ మ్యూజిక్, రొమాంటిక్ సాంగులు కంపోజ్ చేయడంలో తను సిద్దహస్తుడినని మిక్కి జె మేయర్ మరోసారి నిరూపించాడు. మిక్కి క్లాసీ మ్యూజిక్, సిరివెన్నెల లిరిక్స్ ‘ముకుంద’ ఆడియోను హమ్మింగ్ చేసేలా, మెలోడియస్ గా తీర్చిదిద్దాయి.

 

Click here for the Jukebox

సంబంధిత సమాచారం :

More