సమీక్ష : నెపోలియన్ – అక్కడక్కడా పర్లేదు

సమీక్ష : నెపోలియన్ – అక్కడక్కడా పర్లేదు

Published on Nov 24, 2017 5:40 PM IST
Napoleon movie review

విడుదల తేదీ : నవంబర్ 24, 2017

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

దర్శకత్వం : ఆనంద్ రవి

నిర్మాత : భోగేంద్ర గుప్త

సంగీతం : సిద్దార్థ్ సదాశివుని

నటీనటులు : ఆనంద్ రవి, రవి వర్మ

‘ప్రతినిధి’ చిత్రంతో రచయితగా మంచి పేరు తెచ్చుకున్న ఆనంద్ రవి దర్శకుడిగా మారి చేసిన చిత్రం ‘నెపోలియన్’. ఇందులో ఆయనే ప్రధాన పాత్ర పోషించడం విశేషం. ట్రైలర్స్ తో నీడను పోగొట్టుకున్న మనిషి అంటూ ఆసక్తిని రేకెత్తించిన ఈ చిత్రం ఈరోజే విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం…

కథ:

నెపోలియన్(ఆనంద్ రవి) అనే వ్యక్తి తన నీడ పోయిందని, ఆ విషయాన్ని కలలో దేవుడు కనిపించి చెప్పదని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి సంచలనం రేపి, పోలీసులు ఆ గందరగోళంలోనే ఉండగా వారిచేత యాక్సిడెంట్ కేసుగా పరిగణించి మూసివేయబడిన ఒక హత్య కేసును ఓపెన్ చేయిస్తాడు.

అసలు నెపోలియన్ ఎవరు, అతని నీడ ఎలా పోయింది, అసలతను మూసివున్న కేసును ఎందుకు ఓపెన్ చేయించాడు, అతనికి ఆ కేసుకు సంబంధం ఏమిటి, పోయిన అతని నీడ తిరిగొచ్చిందా లేదా, అసలతని లక్ష్యమేమిటి అనేదే ఈ సినిమా.

ప్లస్ పాయింట్స్ :

సినిమాకు ప్లస్ పాయింట్ ఫస్టాఫ్. ఇందులో దర్శకుడు ఆనంద్ రవి తనలోని రచనా ప్రతిభను పూర్తిగా బయటపెట్టి మంచి కథనాన్ని రాశాడు. నిజంగా కథానాయకుడి నీడ కనిపించకుండాపోవడం, అతను పోలీస్ స్టేషన్ కి వచ్చి వాళ్ళను తికమకపెట్టి, మూసివేయబడిన కేసును ఓపెన్ చేయించడం వంటి సన్నివేశాలు ఆసక్తికరంగా సాగాయి. కొన్ని సీన్లలో హీరో నీడ నిజంగానే కనిపించకపోవడంతో ఎలా పోయింది, దీనికి ఎలాంటి కారణం చూపిస్తారో చూడాలని మంచి ఉత్కంఠ రేగింది.

అంతేగాక సినిమా ఫస్టాఫ్లో కొన్ని సామాజిక అంశాలని కూడా టచ్ చేయడంతో ఏదో మంచి, ఎఫెక్టివ్ సోషల్ మెసేజ్ ఏమైనా ఇస్తారమో, ఒక సామాజిక రుగ్మతను టార్గెట్ చేస్తారేమో అనే కుతూహలం కలిగాయి. పోలీసాఫీసర్ గా నటుడు రవి వర్మ ఫుల్ లెంగ్త్ లో కనిపించి నటనతో ఆకట్టుకున్నాడు.
సెకండాఫ్లో ప్రధాన పాత్ర తనలోని బాధను బయటపెట్టే ఒక సన్నివేశం బాగుంది.

మైనస్ పాయింట్స్ :

సినిమా ఫస్టాఫ్ ను సెకండాఫ్ మీదే బేస్ చేసి, అసలు ద్వితీయార్థం మామూలుగా ఉండదు, అందులో ఏదో పెద్ద విషయమే ఉంటుందని బోలెడు అశలు పెట్టుకుని, సెకండాఫ్ సినిమాను సిద్ధంకాగా తీవ్ర నిరూరుత్సాహం ఎదురైంది. ద్వితీయార్థం చూస్తున్నంత సేపు అసలు ఇది ఆ సినిమానేనా వేరే ఏదైనా సినిమానా అనే ఫీలింగ్ కలిగింది.

విడివిడిగా చూస్తే రెండు బాగానే ఉన్నా దర్శకుడు వాటిని కనెక్ట్ చేసిన విధానం బాగోలేదు. అప్పటి వరకు టార్ స్థాయిలో ఉన్న ఆంచనాలు ఇది కూడా రొటీన్ సినిమా అని తేలగానే ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. దర్శకుడు అంతిమంగా చెప్పాలనుకున్న పాయింట్ కు మొదటి నుండి సస్పెన్స్ డ్రామాను నడపడం అనవసరమనిపించింది. ఒక్కమాటలో చెప్పాలంటే కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా సెకండాఫ్ సినిమా తయారైంది.

మొదటి నుండి ప్రేక్షకుడ్ని ఒక మోడ్లో నడిపిన దర్శకుడు సెకండాఫ్ కు వచ్చేసరికి ఉన్నట్టుండి వేరే మోడ్ కి వెళ్లిపోవడంతో ఆ మార్పును అందుకోవడం చాలా కష్టంగా అనిపించింది. అంతేగాక సెకండాఫ్లో బయటపడే నిజాల్లో కొన్ని చాలా అసహజంగా ఉంటాయి.

సాంకేతిక విభాగం :

ఆనంద్ రవి రచయితగా ఫస్టాఫ్ వరకు కథనంలో మంచు ఉత్కంఠను మైంటైన్ చేసి సత్తా చూపినా సెకండాఫ్ ను సాదా సీదాగా తయారుచేసి ప్రేక్షకుడికి అంత సులభంగా మింగుడుపడని పెద్ద మార్పును సినిమాలో ప్రవేశపెట్టి బోల్తాకొట్టాడు. అలా కాకుండా సినిమాను ఏదైనా ఒక పద్దతిలోనే నడిపి ఉంటే బాగుండేది.

మార్గాల డేవిడ్ సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. సిద్దార్థ్ సదాశివుని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది. ఎడిటింగ్ ద్వారా సెకండాఫ్లోని కొన్ని సన్నివేశాలని తొలగించాల్సింది. నిర్మాణ విలువలు కూడా బాగానే ఉన్నాయి.

తీర్పు :

ఈ ‘నెపోలియన్’ చిత్రం మొదటి అర్థ భాగం ఒక రకంగా, సెకండాఫ్ ఒక రకంగా ఉండటంతో రెండింటినీ కలిపి చూడటం కష్టంగానే అనిపిస్తుంది. దర్శకుడు ఆనంద్ రవి మొదటి సగాన్ని మంచి సన్నివేశాలతో, ఉత్కంఠతో నడిపి ఆకట్టుకుని సెకండాఫ్ ను ఇదొక సాదా సీదా సినిమా మాత్రమే అనేలా చేసి భారీగా నిరుత్సాహపరిచారు. ఫస్టాఫ్ కథనం, కొన్ని మంచి సన్నివేశాలు ఇందులో ఆకట్టుకునే అంశాలు కాగా ఉన్నట్టుండి మారిపోయే సినిమా స్వభావం, అఆకట్టుకొని సెకండాఫ్ నిరుత్సాహపరిచే అంశాలు. కథనంలో వచ్చే అనూహ్యమైన మార్పులను తట్టుకోగలిగే వారికి ఈ సినిమా పర్వాలేదు కానీ సాధారణ ప్రేక్షకుల్ని మాత్రం నిరుత్సాహపరుస్తుంది.

123telugu.com Rating : 2.75/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు