సమీక్ష : నేను లోకల్ – యాటిట్యూడ్ ఉన్న కుర్రోడి ప్రేమ కథ

సమీక్ష : నేను లోకల్ – యాటిట్యూడ్ ఉన్న కుర్రోడి ప్రేమ కథ

Published on Feb 4, 2017 3:00 PM IST
Nenu Local review

విడుదల తేదీ : ఫిబ్రవరి 3, 2017

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

దర్శకత్వం : త్రినాథరావ్ నక్కిన

నిర్మాతలు : దిల్ రాజు

సంగీతం : దేవి శ్రీ ప్రసాద్

నటీనటులు : నాని, కీర్తి సురేష్

ఐదు వరుస విజయాల తర్వాత యంగ్ హీరో నాని చేసిన చిత్రమే ఈ ‘నేను లోకల్’. దర్శకుడు త్రినాథ రావ్ నక్కిన డైరెక్షన్లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రంపై మొదటి నుండి మంచి అంచనాలున్నాయి. పైగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించడంతో ఈ హైప్ మరింత పెరిగింది. మరి ఇన్ని అంచనాల మధ్య ఈ రోజే విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ :

యాటిట్యూడే సర్వసంగా లైఫ్ ను హ్యాపీగా గడిపే కుర్రాడు బాబు (నాని) అతి కష్టం మీద బీటెక్ పాసై తర్వాత ఏం చెయ్యాలి అని ఆలోచిస్తున్న సమయంలో కీర్తి (కీర్తి సురేష్) ని చూసి లవ్ లో పడతాడు. ఆమె కూడా తనను ప్రేమించేలా చేస్తాడు. కానీ ఆమె నాన్న మాత్రం వీళ్ళ ప్రేమకు ఒప్పుకోడు.

అదే సమయంలో బాబు ప్రేమకు మరో అనుకోని అవాంతరం ఎదురవుతుంది. ఆ అనుకోని అవాంతరం ఏమిటి ? బాబు దాన్ని ఎలా ఫేస్ చేశాడు ? చివరికి బాబు కీర్తి నాన్నను ఒప్పించాడా లేదా ? అసలు నాని యాటిట్యూడ్ ఎలా ఉంటుంది ? అనేదే తెరపై నడిచే సినిమా.

ప్లస్ పాయింట్స్ :

సినిమాలోని ఆకట్టుకునే అంశాల్లో నాని క్యారెక్టరైజేషన్ ప్రధానమైనది. ఎప్పుడూ చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తూ అన్నింటినీ లైట్ గా తీసుకుని తాను అనుకున్నదే చేసే కుర్రాడు బాబు పాత్ర బాగుంది. ఆ పాత్రలో నాని నటన కూడా కొత్తగా ఉండి ఆకట్టుకుంది. నాని కనిపించిన ప్రతి సీన్ పంచ్ డైలాగులతో నిండి ఆహ్లాదకరంగా ఉంది. ఇక ఫస్టాఫ్ సినిమా మొత్తం నాని పాత్ర చుట్టూ తిరుగుతూ, సరదా సన్నివేశాలతో ఎక్కడా బోర్ కొట్టకుండా సాఫీగా సాగిపోయింది. సినిమాలో కీలకమైన ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా బలంగా ఉండి సెకండాఫ్ మీద ఆసక్తిని పెంచింది.

ఇక సెకండాఫ్ లో వచ్చే పోలీస్ స్టేషన్ సన్నివేశం, నిశ్చితార్థం సీన్ చాలా బాగా నవ్వించాయి. కీర్తి సురేష్ నటన సినిమాకి మరో పెద్ద ప్లస్ పాయింట్. అందంగా కనిపిస్తూనే అద్భుతమైన నటనను ప్రదర్శించి సినిమాలో రొమాంటిక్ ఫీల్ ని ఎక్కడా తగ్గకుండా నిలబెట్టింది. ఇద్దరు ప్రతిభ ఉన్న నటులు కలిసి నటిస్తే ఎంత చూడ చక్కగా ఉంటుందో నాని – కీర్తి సురేష్ ల జంట అలానే ఉంది. అలాగే క్లైమాక్స్ ఎపిసోడ్ లో వచ్చే ఎమోషన్ సన్నివేశం కాస్త పర్వాలేదనిపించింది.

దేవి శ్రీ పాటలు, వాటికి త్రినాథరావు నక్కిన టేకింగ్, సినిమాటోగ్రఫీ చాలా బాగా కుదిరి అందంగా తయారయ్యాయి. కీలకమైన నవీన్ చంద్ర పాత్ర, నాని తండ్రి స్థానంలో పోసాని కృష్ణ మురళి నటన, హీరోయిన్ తండ్రిగా సచిన్ ఖేడేకర్ పెర్ఫార్మెన్స్ బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ :

మైనస్ పాయింట్స్ అంటే ముందుగా చెప్పాల్సింది సినిమా కథ గురించి. అన్ని పాత సినిమాల్లోలాగే ఈ స్టోరీ కూడా రొటీన్ గానే ఉంటుంది. ఎక్కడా కొత్తదనముండదు. ఫస్టాఫ్, సెకండాఫ్ లలో వచ్చే కొన్ని సన్నివేశాలు రన్ టైమ్ ను పెంచడానికే తీసినట్టు అనిపించాయి.

ఇక సెకండాఫ్ లో ఫస్టాఫ్ లో ఉన్నంత ఫన్, స్పీడ్ లేకపోవడంతో కాస్త నిరుత్సాహం ఎదురైంది. చాలా సీన్లను ముందుగానే ఊహించవచ్చు. దాంతో కథనంలో కాస్త పట్టు తప్పి రొటీన్ భావన కలిగింది. క్లైమాక్స్ ఎపిసోడ్ ఎమోషన్ కలిగి కాస్త పర్వాలేదనిపించినా దాని ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ మాత్రం మరీ సాగదీసినట్టు తోచి సినిమాపై ఆసక్తిని తగ్గించింది.

సాంకేతిక విభాగం :

దర్శకుడు త్రినాథరావు నక్కిన తాను తీసుకున్న కథ పాతదే అయినా దానికి కొత్తగా ఉండే హీరో క్యాటెక్టరైజేషన్ ను, నాని, కీర్తి సురేష్ నటనను జోడించి తన టాలెంట్ చూపాడు. నిజార్ షఫీ సినిమాటోగ్రఫీ చూడ చక్కగా ఉండి ప్రతి ఫ్రేమ్ ను అందంగా తయారు చేసింది. దేవి శ్రీ అందించిన పాటలు ఎంటర్టైనింగా ఉంటూ సినిమాకి అదనపు బలాన్నిచ్ఛాయి.

నాని పాత్రకు రాసిన పంచ్ డైలాగులు చాలా బాగా ఆకట్టుకున్నాయి. సురేందర్ రెడ్డి, ప్రసన్న కుమార్ ల స్క్రీన్ ప్లే ఫస్టాఫ్ వరకు బాగానే ఉన్నా సెకండాఫ్ లో ఊహాజనితంగా ఉండి అంతంగా మెప్పించలేదు. నిర్మాత దిల్ రాజు మరోసారి తన గొప్ప నిర్మాణ విలువలను చాటుకున్నాడు. ఎడిటింగ్ బాగానే ఉంది.

తీర్పు :

కథానాయకుడి క్యారెక్టరైజేషనే ప్రధాన బలంగా రూపుదిద్దుకున్న ఈ ‘నేను లోకల్’ సినిమా నాని మార్క్ సినిమాలను కోరుకునే వాళ్లకు, ఎంటర్టైన్మెంట్ ఆశించే వాళ్లకు, ముఖ్యంగా యువతకు నచ్చుతుంది. నాని పాత్ర చిత్రీకరణ, అతని నటన, కీర్తి సురేష్ పెర్ఫార్మన్స్, ఎంటర్టైనింగా సాగిపోయే ఫస్టాఫ్, మంచి పాటలు ఇందులో ప్రధాన బలాలు కాగా కొత్త కథంటూ లేకపోడం, సెకండాఫ్ ముందుగానే ఊహించే విధంగా ఉండటం, కాస్త సాగదీసినట్టుండే ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ ఇందులో బలహీనతలుగా ఉన్నాయి. మొత్తం మీద చెప్పాలంటే ఎంటర్టైన్మెంట్ కోరుకుని నాని సినిమాలని ఇష్టపడే ప్రేక్షకులకు ఈ యాటిట్యూడ్ ఉన్న కుర్రోడి ప్రేమ కథ ఈ వారాంతంలో మంచి చాయిస్ అవుతుంది.

123telugu.com Rating : 3.25/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు