సమీక్ష : నేనే రాజు నేనే మంత్రి – పొలిటీషియన్ గా మారిన ప్రేమికుడి కథ

సమీక్ష : నేనే రాజు నేనే మంత్రి – పొలిటీషియన్ గా మారిన ప్రేమికుడి కథ

Published on Aug 11, 2017 11:45 PM IST
Nene Raju Nene Mantri movie review

విడుదల తేదీ : ఆగష్టు 11, 2017

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

దర్శకత్వం : తేజ

నిర్మాత : సురేష్ బాబు

సంగీతం : అనూప్ రూబెన్స్

నటీనటులు : రానా, కాజల్, క్యాతరిన్ థ్రెస

‘లీడర్, కృష్ణ వందే జగద్గురుమ్, ఘాజి’ వంటి సినిమాలతో మిగతా హీరోలకంటే తాను భిన్నమని చెప్పి ‘బాహుబలి’ తో జాతీయ స్థాయి నటుడిగా ఎదిగిన నటుడు రానా చేసిన తాజా చిత్రం ‘నేనే రాజు నేనే మంత్రి’. ఒకప్పటి స్టార్ డైరెక్టర్ తేజ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం…

కథ :

ఒక ఊళ్ళ్లో రైతులకు న్యాయమైన వడ్డీ ధరకు అప్పులిస్తూ తను ప్రాణంగా ప్రేమించే భార్య రాధ(కాజల్ అగర్వాల్) తో కలిసి ఆనందంగా బ్రతికే మామూలు వ్యక్తి రాధా జోగేంద్ర (రానా) కొన్ని క్లిష్టమైన పరిస్థితుల్లో రాధ కోసం తనకెలాంటి అనుభవంలేని రాజకీయాల్లోకి దిగుతాడు.

అలా స్వార్థపరులైన రాజకీయ శక్తుల మధ్యకు వెళ్లిన రానా అందరికన్నా ఎత్తుకు ఎదదిగే ప్రయత్నంలో తనకు తెలియకుండానే పూర్తిగా మారిపోయి పరిస్థితుల్ని బట్టి తప్పులు చేస్తూ ముందుకెళుతుంటాడు. అలాంటి సమయంలో శత్రువులు అతన్ని అణగదొక్కడానికి అన్ని దారుల నుండి చుట్టుముడతారు. అలా రాజకీయ చదరంగంలో చిక్కుకున్న రాధ జోగేంద్ర ఎలాంటి కష్టాల్ని పడ్డాడు, ఎవరెవర్ని కోల్పోయాడు, అతని రాజకీయ ప్రయాణం ఎలా సాగింది, చివరికి అతని జీవితం ఏమైంది, అనేదే ఈ సినిమా.

ప్లస్ పాయింట్స్ :

దర్శకుడు తేజ ఈసారి కథను ఆధారంగా చేసుకుని పనిచేయడం సినిమాకు బాగా కలిసొచ్చింది. ఆయన పాలిటిక్స్ నైపథ్యంలో బలమైన ప్రేమ కథను చెప్పిన తీరు ఆద్యంతం ఆకట్టుకుంది. అంతేగాక కథకి కావాల్సిన పాత్రల్ని కూడా చాలా బలంగా రాసుకున్నారు తేజ. ముఖ్యంగా హీరోయిన్ కాజల్ చేసిన రాధ పాత్ర, ఆమెను అంటుకుని నడిచే జోగేంద్ర పాత్ర అద్భుతంగా పండాయి. రానా, కాజల్ కూడా తమ తమ పాత్రల్లో ఒదిగిపోయి నటించారు. వీరి మధ్య నడిచే భార్య భర్తల ట్రాక్ ను తేర మీద చాలా అందంగా ఆవిష్కరించారు తేజ. వీరిద్దరి మీద నడిచే ప్రతి సన్నివేశం ఆసక్తికరంగానే సాగింది. సెకండాఫ్ ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ఎమోషనల్ సన్నివేశమైతే నిజంగా కళ్ళలో నీళ్లు తిరిగేలా చేసింది.

ఇక ఫస్టాఫ్ ఆరంభం నుండే ఏమాత్రం ఆసలస్యం లేకుండా సినిమా కథలోకి ప్రవేశించడం, జోగేంద్ర రాజకీయ రంగప్రవేశం చేసి, ఎదురనేదే లేకుండా ఎదిగిపోవడం వాటికి తోడు బలమైన పాత్రలు, వాటి నటన ప్రేక్షకుడు సినిమాతో పాటే ప్రయాణం చేసేలా చేశాయి. ఇక సెకండాఫ్ కు వచ్చే సరికి జోగేంద్ర పాత్ర కళ్ళ ముందే అసలు సిసలు రాజకీయ నాయకుడిగా మారిపోవడం, సినిమా మొదట్లో కుర్రాడిలా, లేతగా కనబడే రానా క్లైమాక్స్ కు వచ్చేసరికి రాటుదేలిపోయి, గంభీరంగా తయారవడం చూస్తే తేజ ప్రధాన పాత్ర ప్రయాణాన్ని ఎంత పక్కాగా రాసుకున్నారో అర్థమైపోతుంది. ఇక సినిమా చివర్లో జోగేంద్రతో శత్రువులు ఆడే పొలిటికల్ గేమ్ కూడా బాగానే అనిపించింది.

సినిమా ముగింపు కూడా లవ్ ట్రాక్ తో ముడిపడి ఉండి, పర్ఫెక్ట్ గా ఉంది. ఇక అనూప్ రూబెన్స్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సంగీతం సినిమాకి వెయిట్ ను పెంచింది. లక్ష్మి భూపాల్ రాసిన డైలాగ్స్, పాటలు చాలా బాగున్నాయి. వెంకట్ సి. దిలీప్ సినిమాటోగ్రఫీ సినిమాకు కావాల్సినంత సహజత్వాన్ని తీసుకొచ్చి, కథ మన మధ్యలోనే జరుగుతుందేమో అనిపించింది.

మైనస్ పాయింట్స్ :

సినిమా సెకండాఫ్ చివర్లో హీరో 200 మంది ఎమ్మెల్యేలను చంపడం, అందుకుగాను పడిన ఉరి శిక్ష తప్పే సన్నివేశాలు బలహీనంగా, లాజిక్స్ కు దూరంగా అనిపిస్తాయి. ఆ ఎపిసోడ్లో జనాల ఇన్వాల్మెంట్ కూడా ఓవర్ గా ఉండి మొహమాటపెడుతుంది. ముఖ్యమైన ప్రీ క్లైమాక్స్ అంకంలో వచ్చే అసెంబ్లీ సన్నివేశం పెద్దగా ఉద్వేగం, మాటలు లేకుండానే ముగిసిపోతుంది. అందులో రానా చేత ఇంకాస్త బలమైన పెర్ఫార్మెన్స్ చేయించి ఉంటే రిజల్ట్ ఇంకా మెరుగ్గా ఉండేది.

అలాగే ముందు నుండి కీలకంగా కనిపించిన క్యాథరిన్ పాత్రకు సరైన జస్టిఫికేషన్ కనబడదు. సినిమా ప్రధాన అంశం ప్రేమ కథే అయినా దాన్ని చెప్పడానికి దర్శకుడు ఎంచుకుంది రాజకీయ నైపథ్యం కాబట్టి వీటి రెండింటి మధ్య ఖచ్చితమైన బ్యాలెన్స్ ఉండాలి. కానీ ఇందులో రెండింటినీ పోల్చి చూస్తే రాజకీయ నైపథ్యానికి కాస్త అన్యాయం జరిగినట్టే అనిపించి కొంచెం నిరుత్సాహాం కలిగింది.

సాంకేతిక విభాగం :

ఒక దర్శకుడిగా, రచయితగా తేజ చాలా వరకు విజయం సాధించారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్లో సాగే మంచి ప్రేమ కథను రాసుకున్న ఆయన అందుకు కావాల్సిన పాత్రల్ని కూడా అంతే బలంగా రాసుకుని, వాటికి తగిన నటీ నటుల్ని ఎంచుకుని, వారి నుండి మంచి నటనను రాబట్టుకున్నారు. లక్ష్మి భూపాల్ రాసిన డైలాగ్స్, లిరిక్స్ ఆకట్టుకున్నాయి.

అనూప్ రూబెన్స్ తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో, పాటలకిచ్చిన సంగీతంతో అలరించాడు. వెంకట్ సి. దిలీప్ సినిమాటోగ్రఫీ సినిమాలో సహజత్వాన్ని నింపింది. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాగుంది. సురేష్ బాబు, కిరణ్ రెడ్డి, భరత్ చౌదరిల నిర్మాణ విలువలు గొప్ప స్థాయిలో ఉన్నాయి.

తీర్పు :

‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రం పాత తేజాను చూపించి నటుడిగా రానాకు మంచి మార్కులు వేయిస్తుంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ కు ఖచ్చితమైన జస్టిఫికేషన్ ఇవ్వకపోవడం, కొన్ని లాజిక్స్ ను మిస్సవడం మినహా మంచి కథ, ఆకట్టుకునే నరేషన్, బలమైన పాత్రలు, రాధా – జోగేంద్రల లవ్ ట్రాక్, అద్భుతమైన రానా, కాజల్ ల నటన అన్నీ కలిసి చిత్రం ప్రేక్షకుడ్ని మెప్పించే విధంగా తయారుచేశాయి. మొత్తం మీద పొలిటీషియన్ గా మారిన ప్రేమికుడి కథ ప్రేమ కథల్ని, డ్రామాతో నడిచే సినిమాల్ని ఇష్టపడే వాళ్లకు నచ్చుతుంది.

123telugu.com Rating : 3/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు