సమీక్ష : పంచతంత్రం – స్లోగా సాగే ఎమోషనల్ డ్రామా !

సమీక్ష : పంచతంత్రం – స్లోగా సాగే ఎమోషనల్ డ్రామా !

Published on Dec 10, 2022 3:04 AM IST
Panchathantram Movie-Review-In-Telugu

విడుదల తేదీ : డిసెంబర్ 09, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు: డా. బ్రహ్మానందం, స్వాతి రెడ్డి, సముద్రఖని, రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్, నరేష్ అగస్త్య, దివ్య శ్రీపాద, వికాస్, ఆదర్శ్ బాలకృష్ణ, శ్రీ విద్యా మహర్షి

దర్శకుడు : హర్ష పులిపాక

నిర్మాతలు: అఖిలేష్ వర్ధన్, సృజన్

సంగీత దర్శకులు: శ్రవణ్ భరద్వాజ్, ప్రశాంత్ ఆర్ విహారి

సినిమాటోగ్రఫీ: రాజ్ కె నల్లి

ఎడిటర్: గ్యారీ బి హెచ్

 

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

హర్ష పులిపాక దర్శకత్వంలో ఐదు కథల సమాహారం గా రూపొందిన లేటెస్ట్ మూవీ పంచతంత్రం. కాగా ఈ సినిమా ఈ రోజు విడుదల అయింది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

 

కథ :

 

ఓ రిటైర్డ్ ఉద్యోగి వేద వ్యాస్ మూర్తి (డా. బ్రహ్మానందం) అరవై ఏళ్ల వయసులో రచయితగా కెరీర్ ను మొదలుపెట్టి.. తన జీవితంలో కొత్త దశను ప్రారంభించాలని ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో మూర్తి స్టోరీ టెల్లింగ్ పోటీలో పాల్గొంటాడు, ఈ క్రమంలో వేద వ్యాస్ మూర్తి ఐదు కథలను చెబుతాడు. ఆ ఐదు కథలకు ఇతివృత్తాన్ని పంచేంద్రియాలు అనే కాన్సెప్ట్ ను ఎంచుకుంటాడు. మొదటి కథ యొక్క ఇతివృత్తం వినడం, ఇది నరేష్ అగస్త్య పోషించిన ఓ విసుగు చెందిన సాఫ్ట్‌వేర్ కథ. రెండవ కథ యొక్క ఇతివృత్తం రుచి, ఇది రాహుల్ విజయ్ – శివాత్మిక కీలక పాత్రలలో సాగుతుంది. పర్ఫెక్ట్ జీవిత భాగస్వామి కోసం చూస్తున్న ఓ వ్యక్తి జీవితంలో ఏం జరిగింది ?, ఇక మూడవ కథ యొక్క ఇతివృత్తం స్మెల్ (వాసన), ఈ కథలో సముద్రఖని కనిపించారు. నాలుగవ కథ యొక్క ఇతివృత్తం టచ్, ఇది వికాస్ ముప్పాలా – దివ్య శ్రీపాద పోషించిన భార్యాభర్తల పై ఎమోషనల్ స్టోరీ. చివరగా, చివరి కథ యొక్క ఇతివృత్తం దృశ్యం, ఇది స్వాతి రెడ్డి పోషించిన లేఖ అనే స్టోరీ టెల్లర్ కథ. ఫైనల్ గా స్టోరీ టెల్లింగ్ పోటీలో వేద వ్యాస్ మూర్తి గెలుస్తాడు.

 

ప్లస్ పాయింట్స్ :

 

ఈ సినిమాకి ప్రధానంగా ప్లస్ పాయింట్.. ఈ కథ థీమే. దర్శకుడు హర్ష పులిపాక రాసుకున్న సున్నితమైన కథలు కూడా ఈ సినిమాకు ప్రధాన బలం. ముఖ్యంగా ఆయన భావోద్వేగమైన పాత్రలతో సున్నితమైన మెసేజ్ ను పండించిన విధానం బాగుంది. అలాగే ప్రధానంగా సాగే ఐదు కథలు కూడా ప్రేక్షకుడ్ని సినిమాతో పాటే ప్రయాణించేలా చేస్తాయి. వీటితో పాటు హర్ష పులిపాక టేకింగ్ సినిమాకు కావాల్సినంత సహజత్వాన్ని అందించింది.

ముఖ్యంగా కథనంలో ఫ్లో తగ్గుతుంది అనుకునే సమయానికి ఒక ఎమోషనల్ సీన్ వస్తూ సినిమా పై ఆసక్తిని పెంచుతాయి. దాంతో పాటు కథలోని ప్రతి పాత్ర చాలా సహజంగా ఉంటుంది. ప్రతి పాత్ర అర్ధవంతంగా సాగుతూ కథను అంతర్లీనంగా ముందుకు నడుపుతుంది. పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందం, స్వాతి రెడ్డి, శివాత్మిక, సముద్రఖని, దివ్య శ్రీపాద, ఉత్తేజ్, ఆదర్శ్ బాలకృష్ణ, రాహుల్ విజయ్ వంటి వారు కీలక పాత్రలు పోషించి అలరించారు. స్వాతి రెడ్డి చేసిన చివరి కథలో కొన్ని భావోద్వేగాలు మన హృదయాన్ని కదిలిస్తాయి.

 

మైనస్ పాయింట్స్ :

 

కథ, పాత్రల పరంగా ఎలాంటి వంకా పెట్టలేని పనితీరుని కనబర్చిన దర్శకుడు హర్ష పులిపాక.. సినిమాను ఇంట్రెస్టింగ్ గా మలచలేకపోయాడు. దీనికితోడు కొన్ని కథలను డ్రైవ్ చేయడంలో కూడా చాలా నెమ్మదిగా కనిపించారు. దీనికితోడు ఎలాంటి కమర్షియల్ అంశాలు లేకుండా ఈ సినిమాని తెరకెక్కించడం కూడా ఈ సినిమా ఫలితాన్ని దెబ్బతీసింది.

పైగా కథలకు బలం పెంచలేని సీన్స్ ఎక్కువైపోయాయి. అలాగే కొన్ని ఓవర్ డ్రామా సీన్స్ కూడా సినిమాకి బలహీనతగా నిలుస్తాయి. మొత్తానికి దర్శకుడు తాను అనుకున్న కంటెంట్ ను స్క్రీన్ మీద బాగా ఎలివేట్ చేసినా.. సినిమాలో కొన్ని రొటీన్ సీన్స్ ను ట్రిమ్ చేసి వుంటే సినిమాకి ప్లస్ అయ్యేది. ముఖ్యంగా రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ కి అలవాటు పడ్డ ప్రేక్షకులను ఏ మాత్రం కమర్షియల్ హంగులు ఆర్భాటాలు లేని ఈ చిత్రం ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి.

 

సాంకేతిక విభాగం :

 

హర్ష పులిపాక దర్శకుడిగా రచయితగా ఈ సినిమాకు న్యాయం చేశారు. మంచి కథ, ఆసక్తికరమైన పాత్రలతో చిత్రాన్ని అందంగా తీర్చిదిద్దారు. కాకపోతే కథనం పై ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది. సినిమాలో నేపధ్య సంగీతం అద్భుతంగా ఉంది. సినిమాటోగ్రఫీ సినిమాకి తగట్లు ఉంది. సన్నివేశాలన్నీ చాలా సహజంగా సినిమా మూడ్ కి అనుగుణంగా నడుస్తాయి. ఎడిటింగ్ ఇంకా బెటర్ గా ఉంటే బాగుండేది. నిర్మాతలు సృజన్, అఖిలేష్ ఇలాంటి చిత్రాన్ని నిర్మిచినందుకు అభినందించి తీరాలి. వారి ప్రొడక్షన్ డిజైన్ కూడా ఆకట్టుకుంటుంది.

 

తీర్పు :

 

ఐదు కథల సమాహారంగా వచ్చిన ఈ పంచతంత్రం చిత్రం ఓ వర్గం ప్రేక్షకులను ఆకట్టుకుంది. భావోద్వేగమైన కథలతో పాటు సున్నితమైన మెసేజ్ ఈ సినిమాలో ఆకట్టుకుంది. కానీ, కమర్షియల్ గా మాత్రం ఆకట్టుకోదు. అలాగే ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ పెద్దగా లేకపోవడం, ఇక సెకండ్ హాఫ్ కూడా బోర్ గా సాగడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి. ఓవరాల్ గా ఈ సినిమా ఓ వర్గం ప్రేక్షకులకు నచ్చుతుంది.

 

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు