సమీక్ష : పండగ చేస్కో – ఫార్ములా కామెడీ ఎంటర్‌టైనర్..!

సమీక్ష : పండగ చేస్కో – ఫార్ములా కామెడీ ఎంటర్‌టైనర్..!

Published on May 21, 2015 1:30 PM IST
Pandaga-Chesko-Review

విడుదల తేదీ : 29 మే 2015

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

దర్శకత్వం : గోపీచంద్ మలినేని

నిర్మాత : పరుచూరి కిరీటి

సంగీతం : థమన్

నటీనటులు : రామ్, రకుల్ ప్రీత్ సింగ్, సోనాల్ చౌహన్

ఎనర్జిటిక్ హీరో రామ్, సూపర్ హిట్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘పండగ చేస్కో’. రకుల్ ప్రీత్ సింగ్, సోనాల్ చౌహన్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ పెద్ద ఎత్తున నేడు విడుదలైంది. కలర్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా చెప్పబడిన ఈ సినిమా ఏ మేరకు ఆకట్టుకుంది? గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న రామ్, ఈ సినిమాతో హిట్ బాట పడతాడా? చూద్దాం..

కథ :

కార్తీక్ (రామ్) పోర్చుగల్‌లో ఓ పెద్ద బిజినెస్ మేన్. తన కుటుంబంతో పాటే అక్కడే ఉంటూ తాను సొంతంగా స్థాపించుకున్న బిజినెస్‌తో రిచ్‌గా బతుకుతుంటాడు. అదే ప్రాంతంలో ఉండే పెద్ద బిజినెస్ వుమెన్ అనుష్క (సోనాల్ చౌహన్)తో కార్తీక్ పరిచయం పెళ్ళికి దారితీస్తుంది. తమ బిజినెస్‌ను విస్తరించుకోవచ్చనే ఆలోచనలో ఇద్దరూ ఈ ప్రపోజల్‌తో పెళ్ళికి సిద్ధమవుతారు. ఇదే సమయంలో కార్తీక్ తన ఫ్యాక్టరీ గొడవలను తీర్చే పనంటూ హైద్రాబాద్ వస్తాడు. కార్తీక్ ఫ్యాక్టరీ ఓ కేసులో ఇరుక్కోవడానికి తన కుటుంబాన్ని వదిలి హైద్రాబాద్‌కు పారిపోయి వచ్చిన దివ్య (రకుల్ ప్రీత్ సింగ్) కారణమవుతుంది.

దివ్య రెండు కుటుంబాల ఆధిపత్యాల మధ్యన నలిగిపోయే యువతి. మేనమామ సాయిరెడ్డి (సాయి కుమార్) దగ్గరే పెరిగిన ఆమె పెళ్ళి బాధ్యతలను తండ్రి భూపతి (సంపత్)కి కోర్టు అప్పజెబుతుంది. ఇది ఏమాత్రం ఇష్టం లేని సాయిరెడ్డి, దివ్యకు తానే పెళ్ళి చేయాలనుకుంటాడు. వీరిద్దరి మధ్యన వైరం ఇలా ఉండగా, భూపతి, దివ్య పెళ్ళి కోసం కార్తీక్‌ను సెలెక్ట్ చేస్తాడు. వీరి కథలోకి కార్తీక్ ఎందుకొచ్చాడు? కార్తీక్‌కు భూపతికి మధ్యనున్న సంబంధం ఏంటి? భూపతి సాయిరెడ్డిల మధ్యనున్న వైరం ఏంటి? అనుష్క కార్తీక్‌ల కథ ఏమైంది? అన్న ప్రశ్నలకు సమాధానమే సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాలో మేజర్ ప్లస్‌పాయింట్స్ గురించి చెప్పుకోవాలంటే.. కూల్‌గా సాగిపోయే కామెడీ, సెకండాఫ్‌లో వచ్చే ఫ్యామిలీ ఎమోషన్స్ గురించి చెప్పుకోవాలి. సినిమాలో రకరకాల క్యారెక్టర్స్ వస్తూ పోతూ తెరంతా నిండుగా కనిపిస్తుంది. ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో ఇన్ని రకాల క్యారెక్టర్‌లు ఉండడం, వాటి మధ్యన వచ్చే కన్ఫూజన్‌తో కూడిన కామెడీ ఎప్పుడూ ఆకర్షించే విషయమే! రామ్-రకుల్ ప్రీత్ సింగ్‌ల మధ్య వచ్చే సన్నివేశాలు, రామ్-సోనాల్ చౌహన్‌ల పర్పస్ బేస్‌డ్ రిలేషన్‌షిప్ సన్నివేశాలు బాగా ఆకట్టుకుంటాయి. సెకండాఫ్‌లో వచ్చే ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాకు ఒక అర్థాన్ని తెచ్చిపెట్టింది. బ్రహ్మానందం పాత్ర బాగా నవ్విస్తుంది. ఇక ఆ పాత్రను కథలో జొప్పించిన విధానం కూడా బాగుంది. ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ కామెడీ ట్రాక్ నవ్వులు పూయిస్తుంది.

కార్తీక్‌గా రామ్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌లో ఒదిగిపోయాడనే చెప్పాలి. ఒక టాప్ బిజినెస్ మేన్‌కి ఉండే పొగరు, స్టైల్‌ను ఫస్టాఫ్‌లో, తన నేపథ్యం గురించి తెలుసుకున్న తర్వాత వచ్చే పరిణితిని సెకండాఫ్‌లో బాగా పలికించాడు. రామ్ ఎనర్జీ సినిమాకు హైలైట్. రకుల్ ప్రీత్ సింగ్ చాలా బాగా నటించింది. చిలిపి ఎక్స్‌ప్రెషన్స్‌తో పాటు, భావోద్వేగాన్ని కూడా బాగానే పండించింది. సోనాల్ చౌహన్ బాగా నటించింది. ఇక గ్లామర్ విషయంలో హీరోయిన్లద్దరికీ వంక పెట్టలేం. మిగతా నటీనటులంతా తమ పరిధిమేరకు బాగానే నటించారు. వీకెండ్ వెంకట్రావుగా నటించిన బ్రహ్మనందం సినిమాకు మేజర్ అట్రాక్షన్. సినిమా పరంగా చూస్తే ఫస్టాఫ్‌లోని ఫన్, సెకండాఫ్‌‌లోని ఎమోషన్‌ను మేజర్ ప్లస్‌పాయింట్స్‌గా చెప్పుకోవచ్చు.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకు మేజర్ మైనస్ పాయింట్స్ అంటే ఫార్ములా కథ, స్క్రీన్‌ప్లే అనే చెప్పాలి. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ తరహా కథల్లో ఎప్పట్నుంచో చూస్తూ ఉన్న ప్లాట్‌నే ఈ సినిమాకూ వాడుకోవడం కొత్తదనం కోరుకునేవారిని ఏమాత్రం ఆకట్టుకోదు. కథ పాతదే అయినా కథలో కొన్ని అంశాలను దాచిపెట్టడం, సందర్భానుసారంగా ఆ అంశాలను రివీల్ చేయడంలోనూ కొత్తదనం లేకపోవడం స్క్రీన్‌ప్లే వైఫల్యమే. సినిమా మొదలైన కాసేపటికే అన్నీ తెలిసిపోవడం బోర్ కొట్టిస్తుంది. ఫార్ములా స్క్రీన్‌ప్లే వల్ల సినిమాలోని కామెడీ, ఎమోషన్‌ను అర్థం చేసుకోవడమే తప్ప అనుభవించలేం.

సోనాల్ చౌహన్ పాత్ర విషయంలో క్లారిటీ ఉన్నా, ఆ పాత్ర మరీ సిల్లీగా ఉంది. అభిమన్యు సింగ్ ట్రాక్ సినిమాలో చివర్లో ఏదో చిన్న ట్విస్ట్ కోసం తయారుచేశారు. అదీ ఆకట్టుకునేలా లేదు. అక్కడక్కడా వచ్చే కొంత అడల్ట్ కామెడీ సినిమాను మామూలుగా సాగిపోయే కూల్ ట్రాక్ నుండి పక్కకు తప్పించింది. సినిమా నిడివి కూడా కొంత ఎక్కువైందనే చెప్పాలి. ఎక్కువ క్యారెక్టర్లు ఉండడం, అన్నింటికీ సరైన డీటైల్ ఇచ్చే ప్రయత్నం చేయకపోయినా సినిమా నిడివి పెరగడమనేది అనవసర ట్రాక్‌ల వల్లేనని ఇట్టే తెలిసిపోతుంది.

సాంకేతిక విభాగం :

ముందుగా దర్శకుడు గోపీచంద్ మలినేని గురించి చెప్పుకుంటే.. కథ విషయంలో ఎలాంటి కొత్తదనమూ లేదు. ఆ విషయంలో కథ పరంగా అతడి ప్రతిభ కూడా పెద్దగా బయటకొచ్చే అవకాశం లేదు. అదేవిధంగా ఒక ఫార్ములా కథకు ఫార్ములా స్క్రీన్‌ప్లేనే అందించడం ద్వారా కోన వెంకట్ కొత్తగా చేసిందేమీ లేదు. డైలాగుల విషయంలో మాత్రం కోన వెంకట్ తన మార్క్‌ను మళ్ళీ చూపించారు. పంచ్ డైలాగుల జోలికి వెళ్ళకుండా అర్థవంతమైన డైలాగులు ఇచ్చే ప్రయత్నం చేశారు.

ఇక కథకుడిగా ఏమీ చేయలేకపోయినా, దర్శకత్వం విషయంలో మాత్రం గోపీచంద్ మలినేని చాలా చోట్ల మెరిశాడు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. పోర్చుగల్, బొబ్బిలి ఇలా రెండు విభిన్న నేపథ్యాలనే కాక, విభిన్న పరిస్థితుల మూడ్‌ కూడా బాగా క్యాప్చర్ చేశారు. ఎడిటింగ్ బాగుంది. థమన్ పాటల పరంగా ఫర్వేలేదనిపిస్తే.. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌లో మూడ్‌ను ఫాలో చేసి బాగుందనిపించాడు.

తీర్పు :

రామ్‌కి మంచి హిట్ తెచ్చిపెడుతుందన్న నేపథ్యంలో తెరకెక్కిన ‘పండగ చేస్కో’, ఒక హిట్ సినిమా కోసం తెలుగు సినిమా ఎప్పట్నుంచే నమ్ముకున్న ఫార్ములా ఎలిమెంట్స్ అన్నింటినీ కుదుర్చుకున్న ఎంటర్‌టైనర్. రామ్ ఎనర్జీ, ఇద్దరు హీరోయిన్ల గ్లామర్, కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్, కలర్‌ఫుల్ పాటలు, ఒకే లేయర్‌లో కలిసిపోయిన ఎన్నో పాత్రలు ఇలా అన్నింటినీ ప్యాకేజీగా తీసుకొని తెరకెక్కిన ఈ సినిమా ఫార్ములా ప్యాకేజీ కమర్షియల్ సినిమాను కోరుకునే వారికి బాగా నచ్చే సినిమా. ఇక ఎప్పట్నుంచో చూసి ఉన్న కథనే తెలుగు సినిమా ఫార్మాట్‌లో తెరకెక్కించిన విధానం వల్ల ఈ సినిమా కొత్తదనం కోరుకునేవారికి పెద్దగా నచ్చదు. ఒక్కమాటలో చెప్పాలంటే.. కొత్తదనం అటుంచి, ఈ వేసవిలో సరదా సరదాగా ఓ తెలిసిన కథనే మళ్ళీ కొత్త సినిమాలో చూడడం ఇబ్బంది కాకపోతే.. హ్యాపీగా ‘పండగ చేస్కో’వచ్చు.

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు