ఆడియో రివ్యూ : ‘రభస’ – డీసెంట్ ఆల్బం

‘బృందావనం’, ‘బాద్షా’, ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమాల తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్, యువ సంగీత కెరటం తమన్ కలయికలో వస్తున్న సినిమా ‘రభస’. కందిరీగ ఫేం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సమంత, ప్రణిత కధానాయికలు. బెల్లంకొండ గణేష్ నిర్మాత. ఆగస్ట్ 1, శుక్రవారం సాయంత్రం ఈ సినిమాలో పాటలను విడుదల చేశారు. ఎన్టీఆర్ గత చిత్రాలకు హిట్ మ్యూజిక్ అందించిన తమన్ ‘రభస’కు ఏ రేంజ్ పాటలను కంపోజ్ చేశారో..? ఒకసారి చూద్దాం..! ‘రభస’లో మొత్తం 5 పాటలు ఉన్నాయి.

1)పాట :మార్ సలాం 
గాయకులు : సుచిత్ర సురేషణ్ 
సాహిత్యం :  రామ జోగయ్య శాస్త్రి

‘మార్ సలాం’ పదంతో మొదలైన ఈ పాటను సుచిత్ర సురేషణ్ పాడారు. రామ జోగయ్య శాస్త్రి ఈ పాటలో అద్బుతమైన సాహిత్యం అందించారు. ‘మార్ సలాం’ సాంగ్  లిరిక్స్ ‘రభస’లో ఎన్టీఆర్ పాత్ర స్వభావాన్ని తెలియజేస్తున్నాయి. హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ఇది. తమన్ ట్యూన్ పాటలో భావాన్ని ప్రేక్షకులకు చేరువ కావడంలో సఫలం అయ్యింది. ఫాస్ట్ బీట్ పాటలో మెలోడీ మిక్స్ చేసి తమన్ చేసిన ప్రయోగం ఆకట్టుకునేలా ఉంది.

2) పాట : రాకాసి రాకాసి
గాయకులు : యంగ్ టైగర్ ఎన్టీఆర్
సాహిత్యం : శ్రీమణి 


ప్రేక్షకులు, యంగ్ టైగర్ అభిమానులు ‘రభస’ ఆడియో కోసం ఎదురుచూస్తుంది ఈ పాట కోసమే. శ్రీమణి సాహిత్యం అందించిన ఈ పాటను ఎన్టీఆర్ స్వయంగా పాడడం విశేషం. టోటల్ ‘రభస’ ఆల్బంలో ‘రాకాసి రాకాసి’ సాంగ్ ఇన్స్టంట్ చార్ట్ బస్టర్ హిట్ అవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. మెలోడియస్ గా సాగే ఈ పెప్పి సాంగ్లో తమన్ డ్రమ్స్, గిటార్ లను ఉపయోగించారు. శ్రీమణి చాలా క్యాచి లిరిక్స్ అందించారు. ఆవకాయ, కుక్కపిల్ల, బైకు లేని యవ్వనం అంటూ వాడుక భాషలో శ్రీమణి రాసిన పదాలు అందరికి కనెక్ట్ అవుతాయి. ప్రణిత, ఎన్టీఆర్, సమంతలపై ఈ పాటను చిత్రీకరించారు. హీరోయిన్ ప్రణిత పై హీరో తన ప్రేమను తెలిజేసే విధంగా ఈ పాట ఉంది.
3) పాట : గరం గరం చిలక
గాయకులు : శ్రీకృష్ణ, దీపు, బిందు, పమిక
సాహిత్యం : శ్రీమణి 

టిపికల్ తమన్ స్టైల్ లో సాగిపోయే ఫాస్ట్ బీట్ మాస్ మసాలా సాంగ్ ఇది. గతంలో ఇలాంటి పాటలు తమన్ చాలా కంపోజ్ చేశారు. ఎన్టీఆర్ డాన్స్ చేయడానికి స్కోప్ ఉన్న పాట ఇది. ఈ సాంగ్ లో ఎన్టీఆర్ డాన్స్ స్టెప్పులు ఇరగదీసే అవకాశం ఉంది. సమంత, ఎన్టీఆర్ లపై చిత్రీకరించిన ఈ పాటలో హీరోయిన్ అందాల ప్రదర్శన మెయిన్ హైలైట్ అని సమాచారం. సమంత గ్లామర్ థియేటర్లో ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించడం ఖాయం అని అంటున్నారు.

4) పాట : హవా హవా
గాయకులు : కార్తీక్, మేఘ 
సాహిత్యం : అనంత శ్రీరాం

‘రభస’ ఆల్బంలో ఉన్న ఏకైక మెలోడీ ఇది. అనంత శ్రీరామ్ చక్కని సాహిత్యం అందించారు. కార్తీక్, మేఘ తమ వాయిస్ తో పాటకు అందం తీసుకొచ్చారు. కూల్ గా సాగిపోతున్న మెలోడీ మధ్యలో అప్పుడప్పుడు వచ్చే రాప్ తరహా మ్యూజిక్, డ్రమ్స్ శబ్దాలు కొంచం ఇబ్బంది పెట్టాయి. ఈ పాట ‘బృందావనం’ సినిమాలో నిజమేనా నిజమేనా పాటను కొత్త వరకు గుర్తు తెప్పించినా మొత్తం మీద వినసొంపుగా ఉంది. ఫారిన్ లో అందమైన లొకేషన్లలో ఈ పాటను చిత్రీకరించారు.
5) పాట : డం డమారే 
గాయకులు : సింహ, సూరజ్ సంతోష్, నివాస్, దీప్తి మాధురి, మానస ఆచార్య, పావని 
సాహిత్యం : శ్రీమణి

ఈ పాట చాలా ఆసక్తికరంగా ప్రారంభం అవుతుంది. స్వీట్ ఫిమేల్ వాయిస్ తో మొదలై  ఫాస్ట్ బీట్ లోకి వెళ్తుంది. లిరిక్స్ వింటుంటే ఈ పాట పంతాలు, పట్టింపులతో విడిపోయిన కుటుంబాలు తిరిగి కలసిన సందర్బంలో వచ్చే అవకాశం ఉంది. ఈ పాటలో సంగీతం సో సోగా ఉంది. తమన్ గత చిత్రాలలో ట్యూన్స్ గుర్తొస్తాయి. పాట విన్నప్పుడు అంతగా అనిపించకపోయినా సినిమాలో ఆకట్టుకునే అవకాశం ఉంది. ఫ్యామిలీ ఎమోషనల్ టచ్ ఉన్న సాంగ్ ఇది.

తీర్పు :
ప్రయోగాల జోలికి వెళ్ళకుండా తన రెగ్యులర్ స్టైల్ లో ‘రభస’ పాటలను కంపోజ్ చేశారు సంగీత దర్శకుడు తమన్. అలాగని యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులను నిరాశపరచలేదు. ఎన్టీఆర్ పాడిన ‘రాకాసి రాకాసి’ పాట, ‘మార్ సలాం’, ‘హవా హవా’ పాటలు ‘రభస’ ఆల్బంలో హిట్ సాంగ్స్. కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాకు అవసరమైన రీతిలో తమన్ సంగీతం అందించారు. ఓవరాల్ గా ‘రభస’ డీసెంట్ ఆల్బం ఇది.

సత్య కుమార్ పులగం

సంబంధిత సమాచారం :

More