సమీక్ష : వారి జర్నీ రేణిగుంట వరకు సాగింది కానీ…!

 
విడుదల తేది : 8 మార్చి 2012
123తెలుగు.కాం రేటింగ్: 2.75/5
దర్శకుడు : పన్నీర్ సెల్వం
నిర్మాత : సురేష్  కొండేటి
సంగిత డైరెక్టర్ : గణేష్  రాఘవేంద్ర
తారాగణం : జా నీ ,  సనుష , నిశాంత్

పన్నీర్ సెల్వం డైరెక్షన్లో తమిళంలో ‘రేణిగుంట’ పేరుతో తెరకెక్కిన చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో ప్రముఖ నిర్మాత సురేష్ కొండేటి నిర్మాతగా అనువదించారు. జానీ, సనూష మరియు నిశాంత్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఈ రోజే విడుదలవగా ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం.

కథ:

తరిగొండ అనే ఊర్లో మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన శివ (జానీ) ఒక హత్య కేసులో తన తండ్రి సాక్షిగా ఉండటం వలన కుటుంబాన్ని కోల్పోతాడు. తన తల్లి తండ్రులని చంపిన ఖాదర్ అనే హంతకుడిని చంపబోయి జైలుకు వెళతాడు. భయస్తుడిగా ఉండే శివని చూసి జైలులో ఉండే పండు మరియు అతని ముగ్గురు స్నేహితులు చేరదీస్తారు. వారు ముంబై వెళ్ళాలని జైలు నుండి తప్పించుకుంటారు. వీరిని పట్టుకోవడానికి రాధాకృష్ణ అనే పోలీసుని నియమిస్తారు. ముంబైకి బయల్దేరిన వారు అనుకోకుండా వారు రేణిగుంట చేరుకుంటారు. అక్కడ బంకర్ అనే పాత ఖైది కోసం సేతు అనే వ్యాపరస్తుడిని హత్య చేస్తారు. మరో హత్య కూడా చేసిపెట్టమని బంకర్ కోరడంతో తప్పక అంగీకరిస్తారు. మరో వైపు సనూష (సినిమాలో ఆమె పాత్రకి పేరు లేదు) ని శివ మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. ఆమె కూడా అతనిని ప్రేమిస్తుంది. సనూష బావ అనుకోని ప్రమాదంలో ఇరుక్కుని ఆమెను ఫైనాన్షియర్ కి అంటగట్టాలని చూస్తాడు. ఇది తెలుసుకున్న శివ అతని స్నేహితులు ఏం చేసారు? బంకర్ అడిగినట్లు మరో హత్య చేసారా? వారి కోసం వెతుకుతున్న రాధాకృష్ణ వారిని పట్టుకోగలిగాడా? అనేది మిగతా చిత్ర కథ.

ప్లస్ పాయింట్స్:

ఈ సినిమాలో నటించిన వారందరు దాదాపు కొత్త వాళ్ళు. భయస్థుడైన శివ పాత్రలో జానీ బాగానే నటించాడు. సనూష మాటలు రాని యువతిగా చాలా బాగా నటించింది. కేవలం హావ భావాలతో చక్కగా చేసింది. నటనతో పాటు చాలా అందంగా కూడా ఉంది. శివ స్నేహితులుగా నటించిన వారిలో నిశాంత్ మంచి నటన కనబరిచాడు. అవిటి వాడుగా నటించిన తీపెట్టి గనేషన్ అనే కుర్రాడు బాగానే నవ్వించాడు. సుమన్ శెట్టి అతనికి డబ్బింగ్ చెప్పాడు.

తమిళంలో తీసి తెలుగు తెలుగులో డబ్ చేసినప్పటికీ రేణిగుంట నేపధ్యంగా సినిమా తీయటంతో తెలుగు సినిమానే చూస్తున్నాం అనే భావన కలుగుతుంది. సినిమా అంతా తెలుగు నేమ్ బోర్డులు, తెలుగు నేటివిటీ కనిపిస్తుంది. చిత్ర మొదటి భాగం కథనం వేగంగా ఉండటం మంచి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా తోడవడంతో తరువాత ఏం జరగబోతుందా అన్న ఆసక్తిని ప్రేక్షకుడికి కలిగించాడు దర్శకుడు. క్లైమాక్స్ ముందు సన్నివేశాలు బాగా తీసారు. ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ అందించిన వాయిస్ ఓవర్ సినిమాకి హెల్ప్ అయింది.

మైనస్ పాయింట్స్:

ముఖ్య పాత్రలు పోషించిన శివ మరియు అతని నలుగురు స్నేహితులు చింపిరి జుట్టుతో చిరిగిపోయిన బట్టలతో కనిపిస్తారు. వారి చేతలు కూడా అదే విధంగా ఉంటూ కింది స్థాయి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసారు కాని మిగతా వారిని మాత్రం అసహ్యానికి గురి చేసారు. చిత్ర కథ అంత దాదాపు మొదటి భాగంలో చెప్పేసి రెండవ భాగాన్ని నత్త నడకన సాగించాడు. దీనికి తోడు సినిమా నిడివి కూడా పెద్దగా ఉండటంతో ఇంకా ఎప్పుడు ముగుస్తుందా అని ప్రేక్షకుడు అనుకునేలా చేసారు. శివ ప్రేయసి పిన్ని పాత్రకి శాంతి అనే పేరు ఉంటుంది కానీ సనూష పాత్రకి పేరు లేకపోవడం విచారకరం. దాదాపు ఏ తమిళ చూసిన విశాదంతపు ముగింపునే ఇస్తారు. ఈ చిత్ర మాతృకలో కూడా విషాదంతో కూడిన ముగింపే ఉంటుంది. కానీ తెలుగు ప్రేక్షకులకు ఇది రుచించకపోవచ్చు అని చిత్రాన్ని అర్ధాంతరంగా ముగించారు. నిర్మాణాత్మక విలువలు చాలా తక్కువగా ఉన్నాయి. పాటలు అస్సలు బాగా లేకపోగా సరైన టైమింగ్ లేక చిరాకు పుట్టిస్తాయి. డబ్బింగ్ విషయంలో ఇంకా జాగ్రత్త తీసుకుని ఉంటే బావుండేది.

సాంకేతిక విభాగం:

చిత్ర మొదటి భాగం వరకు ఎడిటింగ్ బాగానే ఉన్నప్పటికీ రెండవ భాగంలో అనవసరమైన సన్నివేశాలు చాలా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ పరవాలేదు. మొత్తంగా సాంకేతిక విలువలు సాధారణ స్థాయిలో ఉన్నాయని చెప్పుకోవాలి.

తీర్పు:

జైలు నుండి తప్పించుకున్న అయిదుగురు యువకుల జర్నీ రేణిగుంట వరకు సాగి అటు నుంచి ముంబై వెళ్ళాల్సిన వారు జీవితాలు అర్ధాంతరంగా ముగిసాయి. ఏ పాత్రకి సరైన ముగింపు ఇవ్వకుండా దర్శకుడు చిత్రాన్ని రేణిగుంట లోనే ముగించాడు.

123తెలుగు.కాం రేటింగ్ : 2.75/5

– అశోక్ రెడ్డి

Clicke Here For ‘Renigunta ’ English Review

సంబంధిత సమాచారం :