సమీక్ష : దండుపాళ్యం – రియాలిటీకి చాలా దగ్గరగా

విడుదల తేదీ : 25 జనవరి 2013
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
దర్శకుడు : శ్రీనివాస రాజు
నిర్మాత : వెంకట్
సంగీతం : అర్జున్ జన్య
నటీనటులు : పూజా గాంధీ, రవి శంకర్, రవి కాలే, నిషా కొఠారి

గత సంవత్సరం కన్నడంలో ‘దండుపాళ్య’ అనే సినిమా కర్ణాటకలో విడుదలై సంచనలం సృష్టించింది. ఈ సినిమాని తెలుగులో ‘దండుపాళ్యం’ పేరుతో డబ్ చేసి ఈ రోజే విడుదల చేసారు. పూజ గాంధీ, రవి కాలే, మకరంద్ దేశ్ పాండే, రవి శంకర్, నిషా కొఠారి ప్రధాన పాత్రల్లో నటించిన శ్రీనివాస రాజు డైరెక్ట్ చేసిన ఈ సినిమా కన్నడలో సంచలన విజయం సాధించగా తెలుగులో ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం.

కథ :

దండుపాళ్యం ఊరికి చెందిన లక్షి (పూజా గాంధీ) తిమ్మడు, హనుమ, చిన్న మునియ, నల్ల వెంకటేశు, ముని కృష్ణ, దండుపాళ్యం కృష్ణ ఇలా తొమ్మిది మంది కలిసిన ఒక ముఠాగా ఏర్పడి ఒంటరిగా ఉన్న ఇంటిని ఎంచుకుని వారిని దోచుకుంటూ రేప్ చేసి గొంతు కోసి హత్యలు చేస్తూ ఉంటారు. రెండు వేలకి మూడు వేలకి కిరాయి హత్యలు కూడా చేస్తుంటారు. ఇలా వరుస హత్యలు చేస్తూ బెంగుళూరు చేరుకుంటారు. బెంగళూరులో కూడా పకడ్బందీగా దొంగతనాలు, హత్యలు చేస్తుంటారు. వరుస హత్యలు జరుగుతుండటంతో పై అధికారులు ఈ కేసుని ఇన్స్పెక్టర్ చలపతి (రవి శంకర్) కి అప్పగిస్తారు. ఎలాంటి కేసునైనా చాకచక్యంగా పరిష్కరించే చలపతికి ఈ కేసు విషయంలో మాత్రం క్లూ దొరకవు. ఎమ్మెల్యే కుటుంబాన్ని చంపే ప్రయత్నంలో పొరపాటున సుశీల (నిషా కొఠారి) ఆమె వదినని అతి దారుణంగా గొంతు కోసి హత్య చేస్తారు. ఈ ముఠాని చలపతి ఎలా కనిపెట్టాడు అనేది మిగతా చిత్ర కథ.

ప్లస్ పాయింట్స్ :

వాస్తవ కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా కన్నడ నేటివిటీ ప్రతిబింబిస్తుంది. పూజా గాంధీ అయితే లక్ష్మి పాత్రలో జీవించింది. నేర ప్రవృత్తి కలిగిన ఆడవారు ఎలా ఉంటారో ఆమెని చూస్తే అర్ధమవుతుంది. రవి శంకర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ మాత్రమే కాదు మంచి నటుడు కూడా ఇటీవల వచ్చిన ఢమరుకం చూసాక అర్ధమైంది. ఈ సినిమాలో కూడా బాగా చేసాడు. ఆయనకి దక్కిన పాత్రని బాగా ఎలివేట్ చేస్తూ నటించాడు. ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలు అన్ని బాగా వచ్చాయి. మిగతా వారిలో రవి కాలే, మకరంద్ దేశ్ పాండే ఇలా ఆ గ్యాంగ్ మెంబెర్స్ అందరూ ఒక్కొక్కరు ఒక్కో విభిన్నమైన శైలి ప్రదర్శిస్తూ బాగా చేసారు. నిషా కొఠారి పరిమితి కలిగిన పాత్ర అయినా ఉన్నంతలో బాగానే చేసింది. దర్శకుడు శ్రీనివాస రాజు ఎంచుకున్న పాయింట్ మీదే పూర్తి దృష్టి నిలిపి అనవసరమైన కమర్షియల్ అంశాల జోలికి వెళ్ళలేదు. వాస్తవ కథ ఆధారంగా నేచురాలిటీకి చాలా దగ్గరగా రూపొందించాడు. ఫస్ట్ హాఫ్ పకడ్బందీ స్క్రీన్ ప్లేతో ఆసక్తికరంగా సాగింది.

మైనస్ పాయింట్స్ :

వాస్తవికతకి చాలా దగ్గరగా ఉండటంతో చాలా మంది ప్రేక్షకులు జీర్ణించుకోలేని పరిస్థతి ఎదురైంది. గొంతు కోసే చంపే సన్నివేశాలు మరీ క్రూరంగా ఉండటం చాలా మంది చూడటానికి ఇష్టపడకపోవచ్చు. సున్నిత మనస్కులు సినిమాకి దూరంగా ఉండటం మేలు. ఎంటర్టైన్మెంట్ కోరుకునే వారికి కూడా నిరాశే మిగుల్తుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ తరువాత సుశీలని హత్య చేసిన తరువాత వచ్చే సన్నివేశాలన్నీ చిరాకు తెప్పిస్తాయి. వీటికి తోడు అర్ధం పర్ధం లేని పాటలు సహనాన్ని పరీక్షించాయి. క్లైమాక్స్ లో వచ్చే కోర్ట్ సన్నివేశాలు కూడా ఆశించిన స్థాయిలో లేవు. సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే పకడ్బందీగా రాసుకొని, నిడివి ఇంకాస్త తగ్గించి వుంటే బావుండేది. క్రూరంగా ఉండే చాలా సన్నివేశాలకి సెన్సార్ కత్తెరలు వేయడంతో జంప్ కట్స్ చాలా ఉన్నాయి.

సాంకేతిక విభాగం :

ఈ సినిమాకి మెయిన్ అసెట్ అర్జున్ జన్య అందించిన నేపధ్య సంగీతం. హత్యలు చేసి వెళ్ళిపోయే సన్నివేశాల్లో ఇచ్చిన నేపధ్య సంగీతం అదరహో. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. సెన్సార్ కట్స్ వల్ల ఎడిటర్ కూడా కవర్ చేయలేకపోయాడు. దర్శకుడు తన ఎంచుకున్న కథకి న్యాయం చేసాడు.

తీర్పు :

కొత్తదనం కోరుకుంటూ వెరైటీ సినిమాలు నచ్చేవారు దండుపాళ్యం ఒకసారి చూడవచ్చు. వాస్తవికతకి చాలా చాలా దగ్గరగా ఉండటం వల్ల అందరికి నచ్చదు.

రేటింగ్ 2.75/5

అశోక్ రెడ్డి .ఎమ్

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం :

X
More