సమీక్ష : జాబిల్లికోసం ఆకాశమల్లె – ఇది జాబిల్లి కాదు, కేరాఫ్ టార్చర్.!

సమీక్ష : జాబిల్లికోసం ఆకాశమల్లె – ఇది జాబిల్లి కాదు, కేరాఫ్ టార్చర్.!

Published on Jun 13, 2014 5:19 PM IST
 jabilli-kosam-akasamalle విడుదల తేదీ : 13 జూన్ 2014
123తెలుగు. కామ్ రేటింగ్ : 1.5/5
దర్శకత్వం : రాజ్ నరేంద్ర
నిర్మాత : గుగ్గిళ్ళ శివప్రసాద్
సంగీతం : కాసర్ల శ్యామ్
నటీనటులు : శ్రీహరి, అనూప్ తేజ, స్మితిక ఆచార్య, సిమ్మి దాస్..

స్వర్గీయ రియల్ స్టార్ శ్రీ హరి ప్రధాన పాత్రలో అనూప్ తేజని హీరోగా పరిచయం చేస్తూ స్మితిక ఆచార్య, సిమ్మి దాస్ లు హీరోయిన్ లుగా చేసిన సినిమా ‘జాబిల్లికోసం ఆకాశమల్లె’. రాజ్ నరేంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాని గుగ్గిళ్ళ శివ ప్రసాద్ నిర్మించాడు. శ్రీ హరి చనిపోయాక ఆయన పేరు చెప్పుకొని ఆయన నటించిన సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. అలా విడుదలైన ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం…

కథ :

రాజ్(అనూప్ తేజ), గీత(సిమ్మిదాస్), చందు(ఖయ్యూం), వాసు(చంటి) మంచి ఫ్రెండ్స్. రాజ్ కి ఆస్తి ఉన్నా ఎవరూ లేని అనాధ. గీత రాజ్ ని ప్రేమిస్తుంది కానీ రాజ్ మాత్రం తనని ఫ్రెండ్ లానే ట్రీట్ చేస్తాడు. కట్ చేస్తే రాజ్ తొలిచూపులోనే మేఘమాల(స్మితిక ఆచార్య)తో ప్రేమలో పడి ఉంటాడు. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే తను ఎవరు, ఎక్కడ ఉంటది అనేది మాత్రం తెలియదు.

కట్ చేస్తే ఓ రోజు తను సూరన్న(శ్రీ హరి) నక్సల్ దళంలో పనిచేసే పద్మక్క అని తెలుస్తుంది. అది తెలుసుకున్న రాజ్ ఎలాగన్నా తన ప్రేమను దక్కించుకోవాలని సూరన్న దళాన్ని కలుసుకోవడానికి వెళతాడు. అలా వెళ్ళిన రాజ్ తన ప్రేమని మేఘమాల అలియాస్ పద్మక్కకి చెప్పి తన ప్రేమని పొందగలిగాడా? దానికి దళం నాయకుడు సూరన్న ఒప్పుకున్నాడా? అసలు మేఘమాల ఎందుకు పద్మక్కగా మారాల్సి వచ్చింది అనేవి తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాలి..

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాలో ఏదన్నా ప్లస్ పాయింట్ ఉంది అంటే అది ఒక్క రియల్ స్టార్ శ్రీ హరి మాత్రమే. నక్సలైట్ సూరన్న పాత్రలో శ్రీ హరి నటన సింప్లీ సూపర్బ్. అలాగే ఆయనకి రాసిన ప్రతి డైలాగ్ ఒక్కో బుల్లెట్ లా ఉంటుంది. శ్రీ హరి చేత చెప్పించిన కొన్ని డైలాగ్స్ యువతని ఆలోజింపజేసేలా ఉన్నాయి. ఖయ్యూం కూడా తన పాత్రకి న్యాయం చేసాడు. నటనా పరంగా స్మితిక ఆచార్య కూడా బాగా చేసింది.

మైనస్ పాయింట్స్ :

ఒక్క శ్రీ హరిని పక్కన పెట్టేస్తే ఈ సినిమా అంతా తప్పులే కనిపిస్తాయి. ఎక్కడ మొదలు పెట్టి ఎక్కడ ఆపాలో తెలియడంలేదు.. ముందుగా ఒక్కమాట చెప్పాలి.. ఈ సినిమాలో దాదాపు అన్ని ఏదో ఒక సినిమా నుంచి తీసుకున్నవే.. సొంతంగా క్రియేట్ చేసినవి ఒకటో అరో కనిపించవచ్చు. ముందుగా కథ తీసుకుంటే పూరి జగన్నాధ్ ‘143’ కథలానే ఉంటుంది. మక్కికి మక్కి ఉంటుందనే ఉద్దేశంతో పాత్రల్లో చిన్న చిన్న మార్పులు చేసారు. ఇక స్కీన్ ప్లే.. ఈ మధ్య కాలంలో వచ్చిన చెత్త సినిమాలల్లో ది వరస్ట్ స్క్రీన్ ప్లే ఈ సినిమాకే రాసుకున్నారు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే డైరెక్టర్ గొప్ప ట్విస్ట్ లని ఫీల్ అయిపోయినవి అన్ని ఆడియన్స్ ఎప్పుడో ఊహించేస్తారు.

ఇక నటీనటుల ఎంపిక విషయానికి వస్తే.. బిగ్గెస్ట్ మైనస్ హీరో అనూప్ తేజ్.. తను ఏదో చెయ్యాలని తెగ ట్రై చేస్తున్నాడు కానీ సీన్ కి కావాల్సిన ఎమోషన్ తప్ప వేరే ఏదో వస్తోంది కానీ మన డైరెక్టర్ మాత్రం షాట్ ఓకే చేసేసి ఆడియన్స్ పైకి వదిలేశాడు. దాంతో ఆడియన్స్ హీరో ఏ ఎమోషన్ కి ఏ ఎక్స్ ప్రెషన్ ఇస్తున్నాడో తెలియక జుట్టు పీక్కుంటున్నారు. ఇక హీరోయిన్స్ లో మొదటిగా సిమ్మి దాస్ గురించి మాట్లాడుకుందాం. ఈ పాత్రకి తెలంగాణ యాస డైలాగ్స్ పెట్టారు. తెలుగే రాని వారికి తెలంగాణ యాస డైలాగ్స్ పెట్టడం వల్ల లిప్ సింక్ అస్సలు కుదరలేదు. అలాగే సినిమాని సాగాదీయడానికి, పాటలకి తప్ప ఉపయోగం లేని పాత్ర. ఇక రెంవవ హీరోయిన్ నక్సలైట్ అని చూపిస్తారు కానీ నక్సలైట్ క్వాలిటీస్ ఒక్కటి కూడా లేకుండా పాత్ర రాయడం అనేది చెప్పదగిన విషయం. అలాగే తాగుబోతు రమేష్, చంటి, సుమన్ లాంటి పాత్రల వల్ల సినిమాకి పెద్దగా ఉపయోగం లేదు.

కామెడీ లేకపోగా ఈ మధ్యకాలంలో బాగా ఫేమస్ అయిన పంచ్ డైలాగ్స్, భూతు డైలాగ్స్ ని ఇందులో కూడా బాగా ఎక్కువగానే పెట్టారు. కానీ సందర్భానికి అతకని ఈ డైలాగ్స్ ప్రేక్షకులను చిరాకు తెప్పిస్తాయి. పాటల వల్ల అస్సలు ఉపయోగం లేదు. సినిమాని బాగా సాగాదేశారు. ఫస్ట్ హాఫ్ లో కథ ఇంచు కూడా ముందుకు వెళ్ళదు.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగంలో చెప్పడానికి గుడ్డి కంటే మెల్ల మేలు అన్నట్లు.. కెమెరామెన్ పనితనం మాత్రమే బెటర్ గా ఉంది. ఇక మ్యూజిక్ ఎలా ఉంది అంటే యాజిటీజ్ గా ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ కాసర్ల శ్యాం మణిశర్మ, తమన్ లకి మంచి అభిమాని ఏమో, వారు కొట్టిన ట్యూన్స్ ని యాజిటీజ్ గా పెట్టేసి జస్ట్ లిరిక్స్ మాత్రం మార్చేశాడు. ఈ మాత్రం దానికి మ్యూజిక్ డైరెక్టర్ ఎందుకు దర్శకుడే తనకు నచ్చిన ట్యూన్ తీసేసుకొని లిరిక్స్ మార్చేస్తే సరి కదా.. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా లానే ఉంది. ఎడిటర్ అస్సలు శ్రద్ధ తీసుకోలేదు. ఏ సీన్ ఎందుకు వస్తోంది ఎలా కట్ అవుతోంది అనేది కూడా క్లారిటీ లేకుండా పోయింది. డైరెక్టర్ కే క్లారిటీ లేనప్పుడు ఎడిటర్ మాత్రం ఏం చేస్తాడు పాపం..

ఇక కథ – మాటలు స్క్రీన్ ప్లే – దర్శకత్వం అన్ని ఒకరే వేసుకోవడం బాగా ఫాషన్ అయిపోయిందనే చెప్పాలి. అన్ని డీల్ చేయలేనప్పుడు ఒక్క దర్శకత్వ బాధ్యతలు మాత్రం తీసుకొని దానికి న్యాయం చేస్తే సరిపోతుంది కదా.. రాజ్ నరేంద్ర డీల్ చేసిన డిపార్ట్మెంట్స్ గురించి చెప్పాలంటే కథ – కాపీ, స్క్రీన్ ప్లే – వరస్ట్, డైలాగ్స్ – శ్రీహరి ఎపిసోడ్ కి తప్ప మిగతా డైలాగ్స్ అంతా పెద్ద రోతగా ఉన్నాయి, డైరెక్షన్ – ఇన్ని బాలేనప్పుడు దర్శకుడిగా మాత్రం ఏం చేస్తాడు అక్కడా అట్టర్ ఫ్లాప్ అయ్యాడు.

తీర్పు :

‘జాబిల్లికోసం ఆకాశమల్లె’ అనే సినిమాలో జాబిల్లి లేదు, ఆకాశం లేదు కానీ మీ బుర్రని బాయిల్ చేసే టార్చర్ మాత్రం కావాల్సినంత ఉంది. ఈ సినిమాలో శ్రీ హరి పాత్రని మాత్రమే చూడగలం. మీరు శ్రీ హరి అభిమానులైతే, ఆయన్ని మరోసారి తెరపై చూడాలనుకుంటే ఈ సినిమా టికెట్ తీసుకొని ఇంటర్వల్ అయ్యేంతవరకూ అలా థియేటర్ బయట తిరిగి సెకండాఫ్ మొదలయ్యాక లోపలికి వెళ్ళండి. అలాగే జస్ట్ శ్రీ హరి మీద తప్ప వేరే ఎవరి మీద దృష్టి పెట్టొద్దు.. అలా పెట్టారో మీకు తలనొప్పి రావడం ఖాయం. కావున మిగిలిన వారు ఈ సినిమాకి దూరంగా ఉండడమే చాలా ఉత్తమం అని నా సలహా..

123తెలుగు.కామ్ రేటింగ్ : 1.5/5


123తెలుగు టీం

సంబంధిత సమాచారం

తాజా వార్తలు