సమీక్ష : రౌడీ ఫెలో – నారా రోహిత్ వన్ మాన్ షో

Rowdy_Fellow_Review1 విడుదల తేదీ : 21 నవంబర్ 2014
123తెలుగు. కామ్ రేటింగ్ : 3/5
దర్శకత్వం : కృష్ణ చైతన్య     
నిర్మాత : ప్రకాష్ రెడ్డి
సంగీతం : సన్నీ ఎంఆర్  
నటీనటులు : నారా రోహిత్, విశాఖ సింగ్… 

‘ప్రతినిధి’తో హిట్ అందుకున్న నారా రోహిత్ మరోసారి డిఫరెంట్ కాన్సెప్ట్ తో పోలీస్ ఆఫీసర్ గా చేసిన సినిమా ‘రౌడీ ఫెలో’. పాటల రచయితగా మంచి పేరు తెచ్చుకున్న కృష్ణ చైతన్య దర్శకుడిగా పరిచయం అవుతూ చేసిన ఈ సినిమా ద్వారా విశాఖ సింగ్ హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ప్రకాష్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి సన్నీ ఎంఆర్ సంగీతం అందించాడు. నారా రోహిత్ ఓ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ తో ట్రై చేసిన ఈ సినిమా ఎలా ఉందో.? అనేది ఇప్పుడు చూద్దాం..

కథ :

రానా ప్రతాప్ జయదేవ్(నారా రోహిత్) ఈగోని ఎవరన్నా హర్ట్ చేస్తే ఎన్ని సంవత్సరాలైనా వాన్ని ఎతుక్కుంటూ వెళ్ళి మరీ తనని కొట్టి తన ఈగోని తృప్తి పరచుకునే మనస్తత్వం కలవాడు. యుఎస్ నుంచి ఇండియాకి వచ్చిన రానా ఒక రోజు పశ్చిమ గోదావరి జిల్లాలో తెలిసిన వారి దగ్గరికి వెళుతుండగా ఓ వ్యక్తి చావు బతుకుల మధ్య ఉంటాడు. అతన్ని కాపాడటానికి పశ్చిమ గోదావరి మినిస్టర్ అయిన అసురగణ దురాప్రసాద్ నిర్వహిస్తున్న ఓ ర్యాలీని చెడగొడతాడు.

దాంతో రానాని పోలీసులు కస్టడీలోకి తీసుకుంటారు. అక్కడ పోలీస్ ఆఫీసర్ అయిన ఆహుతి ప్రసాద్ రానా ఈగోని హర్ట్ చేస్తాడు. దాంతో రానా ఆ పోలీస్ మరియు దుర్గా ప్రసాద్ లకి కౌంటర్ ఇవ్వాలని పోలీస్ అవుతాడు. మరి పోలీస్ అయిన రానా ఆహుతి ప్రసాద్ మరియు దుర్గా ప్రసాద్ లను ఏమి చేసాడు.? అసలు యుఎస్ నుంచి వచ్చిన రానా సడన్ గా పోలీస్ ఎలా అవ్వగాలిగాడు.? అనే ఆసక్తికర విషయాలను వెండితెరపైన చూసి తెలుసుకోవాల్సిందే..

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ మూడున్నాయి. అవే కథ, నారా రోహిత్ మరియు డైలాగ్స్. ముందుగా కథ విషయానికి వస్తే.. కథని ‘పురాణాలన్నీ ఈగో ప్రోబ్లమ్స్ అనమాట’ అనే పాయింట్ లోని ఈగో అనే పదాన్ని మెయిన్ స్టొరీ లైన్ గా తీసుకొని దాన్ని చాలా డిఫరెంట్ గా డీల్ చేయడం మొదటి ప్లస్ పాయింట్. ఇప్పటి వరకూ మనం చాలా సినిమాల్లో ఒక హీరో, ఆ హీరో చుట్టూనే సినిమా కథ మొత్తం తిరుగుతుంది. కానీ ఇందులో ఉన్న స్పెషల్ ఏమిటంటే హీరో పాత్ర అనేది పలువురు పాత్రల జీవితాల్లోకి వెళ్లి వారి సమస్యలని సాల్వ్ చేస్తుంటుంది. కృష్ణ చైతన్య రాసిన డైలాగ్స్ అద్భుతంగా ఉన్నాయి. ప్రతి డైలాగ్ లోనూ చాలా అర్థం ఉంటుంది.

ఇక నారా రోహిత్ పెర్ఫార్మన్స్ గురించి చెప్పాలి.. నారా రోహిత్ కెరీర్లో పెర్ఫార్మన్స్ పరంగా మరియు స్టైలిష్ పరంగా రౌడీ ఫెలో ది బెస్ట్ అని చెప్పుకోవాలి. నారా రోహిత్ ఈ సినిమాలో చూపించిన మానరిజమ్స్, డైలాగ్ డెలివరీ సింప్లీ సూపర్బ్. ఇవే ఈ సినిమాకి మేజర్ హైలైట్ అవుతాయి. ఈ సినిమాతో ఒక నటుడిగా నారా రోహిత్ తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించాడు. ఈ సినిమాతో తెలుగు వారికి పరిచయమైన విశాఖ సింగ్ కి సినిమాలో చెప్పుకోదగిన పాత్ర లేకపోయినా ఉన్నంతలో బాగా చేసింది. అలాగే లుక్స్ పరంగా కూడా బాగుంది. ఇక సినిమాలో విలన్ పాత్ర పోషించిన రావు రమేష్ పెర్ఫార్మన్స్ చాలా బాగుంది. విలన్ గా అతనిచేత చెప్పించిన కొన్ని డైలాగ్స్ చాలా బాగున్నాయి. నారా రోహిత్ – రావు రమేష్ కాంబినేషన్ సీన్స్ చాలా బాగున్నాయి.

సినిమాలో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి పోసాని కృష్ణమురళి ఉన్నాడు. పోసాని సిల్క్ బాబుగా కనిపించినప్పుడల్లా ప్రేక్షకులని నవ్విస్తాడు. అతనికి రాసిన డైలాగ్స్ కూడా బాగున్నాయి. స్వామిరారా ఫేం కమెడియన్ సత్య ఫస్ట్ హాఫ్ లో చేసే కామెడీ ఆడియన్స్ ని బాగా నవ్విస్తుంది. అజయ్, గొల్లపూడి మారుతిరావు, రామేశ్వరిలు తమ పాత్రలకి పూర్తి న్యాయం చేసారు. సినిమా చాలా ఆసక్తికరంగా మొదలవుతుంది. అలాగే నారా రోహిత్ ఇంట్రడక్షన్ సీన్, టైటిల్ సాంగ్ చాలా బాగుంటుంది. సినిమా ఇంట్రడక్షన్, ఇంటర్వల్ బ్లాక్ లో వచ్చే 20 నిమిషాలు, క్లైమాక్స్ లో వచ్చే 20 నిమిషాలు సినిమాకి చాలా బలాన్ని చేకూర్చడమే ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటాయి.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమా మొదలవ్వడం చాలా ఫాస్ట్ గా ఉన్నప్పటికీ ఆ తర్వాత నేరేషన్ మాత్రం చాలా స్లోగా ఉంటుంది. పైన చెప్పినట్టు కథనం కొత్తగా ఉన్నా అక్కడక్కడా కాస్త స్లో చేసేసాడు. ఫస్ట్ హాఫ్ మధ్యలో కథ చాలా స్లోగా సాగుతున్నట్టు అనిపిస్తుంది. ఇకపోతే సెకండాఫ్ లో సినిమా సీరియస్ గా ఒక ఫ్లోలో వెళుతున్నప్పుడు హీరోయిన్ ట్రాక్ సినిమాలో ఉన్న టెంపోని బాగా దెబ్బతీస్తుంది. దానివల్ల ఆడియన్స్ కాస్త బోర్ ఫీలవుతారు. అలాగే అక్కడ వచ్చే పెళ్లి సాంగ్ కూడా కథకి అవసరం లేదనిపిస్తుంది. ఇకపోతే నారా రోహిత్ – విశాఖ సింగ్ లవ్ ట్రాక్ అంత క్లారిటీగా లేదు. ఉదాహరణకి విశాఖ సింగ్ ఏ కారణం వల్ల హీరోని లవ్ చేస్తుంది అనే పాయింట్ ని చూపించలేదు.

డైరెక్టర్ చెప్పాలనుకున్న స్టొరీ లైన్ చాలా చిన్నది.. దానిని ఇంకాస్త తక్కువ రన్ టైంలో చెప్పడం చేసి ఉంటే బాగుండేది. ఎందుకంటే ఈ సినిమాని కట్టే కొట్టే తెచ్చే అనేలా చెప్పేసి ఉంటే అందరికీ తెగ నచ్చేసేది, కానీ కాస్త సాగదీయడం వల్ల కొన్ని చోట్ల బోర్ అనిపిస్తుంది. ఇక రెగ్యులర్ కమర్షియల్ ఆడియన్స్ కోరుకునే స్టార్ కమెడియన్ సీన్స్, రెగ్యులర్ సాంగ్స్ ఇందులో ఉండవు.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగంలో చెప్పుకోదగిన మైనస్ పాయింట్స్ పెద్దగా ఏమీ లేవు.. బెస్ట్ ముంచి చెప్పి నెగటివ్స్ తర్వాత చెప్తా.. ఓమ్ అందించిన సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతి ఫ్రేం చాలా కొత్తగా ఉంది. విజువల్స్ చాలా గ్రాండ్ గా ఉన్నాయి. సన్నీ ఎంఆర్ కంపోజ్ చేసిన పాటలు చాలా బాగున్నాయి. వాటిన్నిటికంటే మించి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయేలా ఇచ్చాడు. ఎడిటర్ కార్తీక్ శ్రీనివాస్ కాస్త సాగదీస్తున్నాం అనే సీన్స్ ని డైరెక్టర్ తో పోట్లాడి అయినా కత్తిరించి ఉంటే బాగుండేది. యాక్షన్ ఎపిసోడ్స్ ని కూడా చాలా బాగా డిజైన్ చేసుకున్నారు.

లిరిసిస్ట్ గా మంచి పేరు తెచ్చుకున్న ఈ సినిమా కృష్ణ చైతన్య ఈ సినిమాకి దర్శకుడిగా పరిచయం అవ్వడం కాకుండా కథ – కథనం – డైలాగ్స్ బాధ్యతలను కూడా తీసుకున్నాడు. ముందుగా కథలోకి వస్తే చాలా చిన్న పాయింట్ ని బాగా అల్లుకొని రాసాడు. కథనంని చాలా డిఫరెంట్ గా ట్రై చెయ్యడంలో ఎక్కువ కేర్ తీసుకోవడం వలన అక్కడక్కడా సినిమా స్లో అయిపోతుంది. దానిమీద ఇంకాస్త శ్రద్ధ తీసుకోవాల్సింది. ఇక డైరెక్టర్ గా మాత్రం మొదటి సినిమాతోనే మంచి మార్కులే కొట్టేసాడు. ఇక లిరిసిస్ట్ అవ్వడం వలన తను రాసిన డైలాగ్స్ సింప్లీ సూపర్బ్ గా ఉన్నాయి. అవే సినిమాకి చాలా బలాన్ని చేకూర్చాయి. ఇక ప్రకాష్ రెడ్డి నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

తీర్పు :

సినిమా సినిమాకి ఏదో ఒక కొత్త పాయింట్ చెబుతూ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నారా రోహిత్ ట్రై చేసిన మరో డిఫరెంట్ ఫిల్మ్ ‘రౌడీ ఫెలో’. ఈగో అనే పదాన్ని తీసుకొని రాసుకున్న ఈ సినిమా థియేటర్ కి వచ్చే ఆడియన్స్ ని మెప్పించేలానే ఉంది. ఒకే మూస ధోరణిలో వస్తున్న సినిమాలను చూసి బోర్ అయిన ఆడియన్స్ కి ఈ సినిమాతో కాస్త డిఫరెంట్ సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. సినిమా అక్కడక్కడా స్లోగా అనిపించినా టేకింగ్ పరంగా, నారా రోహిత్ పెర్ఫార్మన్స్ పరంగా చాలా సూపర్బ్ గా అనిపిస్తుంది. నారా రోహిత్ వన్ మాన్ షో కి మిగతా నటీనటుల సపోర్ట్ దొరకడమే కాకుండా డైరెక్టర్ టేకింగ్, డైలాగ్స్ ఈ సినిమాకి ప్రాణం పోశాయి. స్లో నేరేషన్, రెగ్యులర్ కామెడీ, సాంగ్స్ లేకపోవడం ఈ సినిమాకి చెప్పదగిన మైనస్.. ఓవరాల్ గా ఈ వారం తెలుగు ఆడియన్స్ చూసి, ఈగో మీద ఇలాంటి సినిమా తీయచ్చా అనే ఒకింత షాక్ తో, ఒకింత సినిమా బాగుందే, బాగా డీల్ చేసాడు అనే ఫీలింగ్ తో బయటకి వచ్చే సినిమా ‘రౌడీ ఫెలో’.

123తెలుగు. కామ్ రేటింగ్ : 3/5

123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం :