సమీక్ష : రుద్రంకోట – రెగ్యులర్ రా అండ్ రస్టిక్ డ్రామా!

Rudramkota Telugu Movie Review In Telugu

విడుదల తేదీ :సెప్టెంబర్ 22, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

నటీనటులు: అనిల్ ఆర్కా కండ‌వ‌ల్లి, విభీషా జాను, అలేఖ్యా, సీహెచ్ జయలలిత, భాస్కర్ రావు తదితరులు

దర్శకుడు : రాము కోన

నిర్మాత: అనిల్ ఆర్కా కండవల్లి

సంగీతం: కోటి

సినిమాటోగ్రఫీ: ఆదిమల్ల సంజీవ్

సంబంధిత లింక్స్: ట్రైలర్

సీరియల్ దర్శకుడు రాము కోన దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘రుద్రంకోట’. ఈ సినిమాతో అనిల్ ఆర్కా హీరోగా పరిచయమయ్యారు. నటి సీహెచ్ జయలలిత సమర్పకురాలిగా వ్యవహరించారు. కాగా ఈ సినిమా ఈ రోజు రిలీజ్ అయ్యింది. మరి ఎలా ఉందో సమీక్ష చూద్దాం రండి.

 

కథ :

రుద్రంకోట అనే ఊరిలో కోటమ్మ (సీనియర్ నటి సీహెచ్ జయలలిత) మాటకు తిరుగులేదు. ఆమె పెట్టిన క‌ట్టుబాట్ల‌ను ఎవ‌రు తప్పినా రుద్ర (అనిల్ ఆర్కా కండవల్లి) వారిని కాటికి పంపుతుంటాడు. ఇంతకీ, కోటమ్మ పెట్టిన కట్టుబాట్లు ఏమిటి ?, అక్రమ సంబంధాల పై, ప్రేమలో నిజాయితీ లేని జంటల పై కోటమ్మ – రుద్ర ఎందుకు అంత కఠినంగా ఉంటారు ?, ఈ మధ్యలో కోటమ్మ మనవరాలు ధృతి (అలేఖ్య‌) రుద్రంకోట‌లో అడుగుపెట్టి.. రుద్ర – కోటమ్మ జీవితాలను ఎలా ప్రభావితం చేస్తోంది ?, అన్నట్టు రుద్రను ప్రేమించిన శక్తి (విభీషా జాను) కథ ఏమిటి ?, ఆమెకు ఏమైంది?, ‘రుద్రంకోట’లో ఓ ఘోరానికి ఒడిగట్టిన కొందరు యువకులను రుద్ర ఎలా చంపాడు ? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

అక్ర‌మ సంబంధాలు పెట్టుకున్న వాళ్ల‌ను, కామాంధుల‌ను కోట‌మ్మ ఆజ్ఞ‌తో రుద్ర ఎలా శిక్షించాడు ? అనే కోణంలో వచ్చే సన్నివేశాలు, అనిల్ ఆర్కా – విభీషా జాను మధ్య వచ్చే లవ్ సీన్స్, మరియు అలేఖ్యాతో సాగే బోల్డ్ సీన్స్ సినిమాలో ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి. అదే విధంగా నటీనటుల పనితీరు బాగుంది. ఈ సినిమాలో ప్రధాన పాత్ర అయిన అనిల్ ఆర్కా కండ‌వ‌ల్లి పాత్ర.. ఆ పాత్రకి సంబంధించిన ఎమోషనల్ ట్రాక్.. అలాగే ఆ పాత్రతో ముడి పడిన విభీషా జాను పాత్ర.. ఆమె జీవితంలో ఆమె ప్రేమకు ఎదురైన అడ్డంకులు, మరియు హీరో హీరోయిన్ల మధ్య లవ్.. ఇలా మొత్తానికి ‘రుద్రంకోట’ సినిమా కొన్ని చోట్ల ఆకట్టుకుంది.

ఇక ఈ సినిమాలో హీరోగా నటించిన అనిల్ ఆర్కా కండ‌వ‌ల్లి తన పాత్రకు తగ్గట్లు చాలా బాగా నటించాడు. హీరోయిన్ విభీషా జాను కూడా ఈ సినిమాలో బాగానే నటించింది. అలాగే సెకండ్ హీరోయిన్ గా అలేఖ్యా చాలా బోల్డ్ గా రెచ్చిపోయింది. మరో ప్రధాన పాత్రలో సీహెచ్ జయలలిత బాగా నటించారు. భాస్కర్ రావుతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. ఈ ఎమోషనల్ డ్రామాలో కొన్ని భావోద్వేగ సన్నివేశాలను రాము కోన బాగానే హ్యాండిల్ చేశాడు.

 

మైనస్ పాయింట్స్ :

ఈ ‘రుద్రంకోట’ ఫస్ట్ హాఫ్ స్లోగా సాగుతూ ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడుతుంది. అలాగే సినిమాలో కాన్ ఫ్లిక్ట్ కూడా ఆకట్టుకునే విధంగా లేకపోవడం, ఇక మెయిన్ క్యారెక్టర్స్ సరిగ్గా కనెక్ట్ కాకపోవడం, దీనికి తోడు హీరో అనిల్ ఆర్కా క్యారెక్టర్ తాలూకు జర్నీ గ్రాఫ్ కూడా బాగాలేకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి. ఈ జనరేషన్ లో ఇలాంటి ప్రేమ కథలను చూడటానికి మెజార్టీ ఆడియన్స్ ఆసక్తి చూపిస్తారా అనేది కూడా డౌటే.

దీనికితోడు జయలలిత పాత్ర కూడా బలంగా అనిపించదు. ఆమె చెప్పిన డైలాగ్స్ కూడా బాగా విసిగించాయి. నెట్ లో కొటేషన్స్ చెప్పేసి అవే డైలాగ్స్ అనుకుంటే చేసేదేం లేదు. విభీషా జాను క్యారెక్టర్ లో డెప్త్ లేదు. ఆమె ఎందుకు హీరోని అంత డీప్ గా లవ్ చేసింది ? ఆమెకే తెలియాలి. మరో హీరోయిన్ అలేఖ్యా హీరో వెంట పడుతూ ఉంటుంది. ఏ మాత్రం లాజిక్ లేని ఈ సీక్వెన్స్ గురించి చర్చ అనవసరం.

ఓవరాల్ గా కథా కథనాల్లో కొత్తదనం లేకపోవడం, ప్లే కూడా స్లోగా సాగడం వంటి అంశాలు మైనస్ అయ్యాయి. దీనికితోడు అనవసరమైన సీన్స్ తో కథను డైవర్ట్ చేశారు. మొత్తానికి ఈ ఎమోషనల్ లవ్ స్టోరీలో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి. అలాగే అవసరానికి మించిన స్లో సన్నివేశాలు లేకుండా ఉంటే సినిమా బాగుండేది.

 

సాంకేతిక విభాగం :

సినిమాలో చెప్పాలనుకున్న ఒకటి రెండు చోట్ల ఎమోషనల్ కంటెంట్ బాగున్నా.. కథ కథనాలు ఆసక్తికరమైన ప్లోతో సాగలేదు. ఇక సంగీత దర్శకుడు కోటి నేపథ్య సంగీతం బాగానే ఉంది. సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే.. లొకేషన్స్ అన్ని న్యాచురల్ విజువల్స్ తో ఆకట్టుకున్నాయి. కెమెరామెన్ ఆదిమల్ల సంజీవ్ వాటిని తెరకెక్కించిన విధానం బాగుంది. ఎడిటింగ్ కూడా బాగానే ఉంది. ఈ చిత్ర నిర్మాత అనిల్ ఆర్కా కండవల్లి పాటించిన నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి.

 

తీర్పు:

‘రుద్రంకోట’ అంటూ వచ్చిన ఈ ‘రా అండ్ రస్టిక్’ ఎమోషనల్ డ్రామాలో కొన్ని భావోద్వేగాలు జస్ట్ ఓకే అనిపిస్తాయి. ఐతే, కథ కథనాలు స్లోగా సాగడం, ఫస్ట్ హాఫ్ లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం, అనవసరమైన సన్నివేశాలతో సినిమాని నింపడం, దీనికితోడు బోరింగ్ ట్రీట్మెంట్ వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి.

123telugu.com Rating: 2/5

Reviewed by 123telugu Team

సంబంధిత సమాచారం :