సమీక్ష : సీత రాముని కోసం – ఆఖరి ఘట్టం ఆకట్టుకుంది

15th, December 2017 - 03:27:58 PM
Seetha Ramuni Kosam movie review

విడుదల తేదీ : డిసెంబర్ 15, 2017

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : శరత్ శ్రీరంగం, కారుణ్య చౌదరి, అనిల్ గోపిరెడ్డి

దర్శకత్వం : అనిల్ గోపిరెడ్డి

నిర్మాత : శిల్ప శ్రీరంగం, సరితా గోపిరెడ్డి

సంగీతం : అనిల్ గోపిరెడ్డి

సినిమాటోగ్రఫర్ : జయపాల్ రెడ్డి

ఎడిటర్ : సాయి తలారి

స్టోరీ, స్క్రీన్ ప్లే : అనిల్ గోపిరెడ్డి


కొత్త హీరో శరత్ శ్రీరంగం, కారుణ్య చౌదరిలు జంటగా నటించిన చిత్రం ‘సీత రాముని కోసం’. ‘వైకుంఠపాళి, బిస్కెట్’ వంటి చిత్రాల దర్శకుడు అనిల్ గోపిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ట్రైలర్స్, పాటలతో మంచి బుజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ :

పారాసైకాలజిస్ట్ గా పనిచేసే విక్రాంత్ (శరత్ శ్రీరంగం) తాను హైదరాబాద్లో కొత్తగా కొనుగోలుచేసి విల్లాలో ఆత్మలున్నాయని విని వాటి గురించి పరిశోధించి, వాటికి విముక్తి చేయాలనే ఉద్దేశ్యంతో ఆ విల్లాలోకి ప్రవేశిస్తాడు.

అలా ఆ ఇంట్లోకి వెళ్లిన అతనికి సీత (కారుణ్య చౌదరి) ఆమె కూతురు అంజలిలు ఆత్మలు తారపడతాయి. అసలు ఆ ఆత్మలు అక్కడెందుకున్నాయి, సీత గతమేంటి, ఆ విషయాలను విక్రాంత్ ఎలా తెలుసుకున్నాడు, వాటికి ఏ విధంగా విముక్తి కలిగించాడు అనేదే ఈ సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :

సినిమాకు ప్రధాన ప్లస్ పాయింట్ ఆఖరు 35 నిముషాల ఎమోషనల్ ట్రాక్. ఈ ట్రాక్లో ఆత్మగా మారిన సీత గతం చెప్పబడుతుంది. దర్శకుడు, రచయిత అయిన అనిల్ గోపిరెడ్డి ఈ సీత పాత్రను, ఆమె గతాన్ని మంచి భావోద్వేగాలతో, సన్నివేశాలతో రాసుకున్నాడు. జీవితాంతం తోడుగా ఉంటానని మాటిచ్చిన భర్త మధ్యలోనే వదిలేస్తే ఆ భర్తను ప్రేమించిన స్త్రీ ఎంత భాధపడుతుంది, అతని కోసం ఎంతలా తపిస్తుంది, చనిపోయాక కూడా ఆమె ప్రేమ అతని కోసమే ఎలా ఎదురుచూస్తుంటుంది అనే అంశాలను అనిల్ గోపిరెడ్డి చాలా చక్కగా చూపించారు.

అంతేగాక సీత పాత్రలో నటి కారుణ్య చౌదరి, ఆమె భర్తగా అనిల్ గోపిరెడ్డిల నటన ఆకట్టుకుంది. వీరిద్దరి మధ్యన నడిచే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. పారాసైకాలజిస్ట్ గా శరత్ శ్రీరంగం పెర్ఫార్మెన్స్ బాగుంది. ఇక అనిల్ గోపిరెడ్డి చాలా సినిమాల్లానే రొటీన్ ముగింపు ఇవ్వకుండా కొంచెం కొత్తగా ఫినిష్ చేసి చిన్నపాటి సంతృప్తిని కలిగించాడు. అయన ముందు నుండి చెబుతున్నట్టు సినిమాలో ఎక్కడా పగ, ప్రతీకారం వంటి నెగెటివ్ అంశాలను కనబడనీయలేదు.

మైనస్ పాయింట్స్ :

సినిమా మొదటి అర్ధభాగం ఆరంభం తప్ప మిగతా మొత్తం నెమ్మదిగా, బోర్ గా నడిచింది. హీరో టార్గెట్ చేసిన ఇంట్లోకి ప్రవేశించడం. ఆత్మల్ని కనిపెట్టడం, పరిష్కారం కోసం వెతకడం వంటివి కథలో తప్పక ఉండాల్సిన రొటీన్ అంశాలే అయినా వాటిని ఆసక్తికరమైన సన్నివేశాలతో, నరేషన్ తో కొంచెం కొత్తగా ప్రెజెంట్ చేయాల్సింది. ప్రధాన పాత్ర ఇంటర్వెల్ తర్వాతే రివీల్ అవడంతో సగం భాగం పూర్తైన తర్వాత కానీ సినిమా లక్ష్యమేమిటో బయటపడలేదు.

ముగింపు కొంత వైవిధ్యంగానే ఉన్నా చిత్ర కథ మాత్రం కొత్తదేం కాదు. చాలా వరకు రొటీన్ గానే ఉంటుంది. సెకండాఫ్ ఆరంభమైన కొంతసేపటి వరకు ఫస్టాఫ్ లానే ఎలాంటి వినోదాన్ని అందించలేకపోయింది. కాబట్టి దర్శకుడు సెకండాఫ్ ఆరంభంతో పాటు ఫస్టాఫ్ కథనాన్ని కూడా వేగంగానో, కొత్తగానో రాసుకుని ఉంటే ఫలితం మరింత మెరుగ్గా ఉండేది.

ఫస్టాఫ్లో వచ్చే తాగుబోతు రమేష్ ట్రాక్ ఎందుకొస్తుందో, దాని అవసరమేమిటో అర్థంకాదు. అలాగే సినిమా ముగింపులో వచ్చే ఐటమ్ సాంగ్ కూడా అస్సలు కనెక్ట్ కాలేదు. వేణు రాసిన కొని డైలాగ్స్ కనెక్టయ్యాయి.

సాంకేతిక విభాగం :

దర్శకుడు అనిల్ గోపిరెడ్డి రొటీన్ కథాంశాన్నే తీసుకుని ఫస్టాఫ్ మొత్తం పెద్దగా గ్రిప్ లేని సన్నివేశాలతో, నరేషన్ తో రొటీన్ గా నడిపినా చివరి 35 నిముషాలను భావోద్వేగపూరితంగా నడిపి ముగింపు కూడా కొంచెం భిన్నంగానే ఇచ్చాడు. అలాగే సినిమాలో ఎక్కడా నెగెటివ్ అంశాల జోలికి పోలేదు కూడ.

లిమిటెడ్ లొకేషన్లలోనే షూట్ చేసినా జయపాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగా కుదిరింది. అనిల్ గోపిరెడ్డి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, రెండు పాటల సంగీతం ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా లాలి పాట అలరించింది. సాయి తలారి ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాతలు మేకింగ్లో నాణ్యతను పాటించడంతో క్వాలిటీ ఫిల్మ్ చూస్తున్న భావన కలిగింది.

తీర్పు :

ఇప్పటివరకు మనం భర్త మూలంగా చనిపోయి ఆత్మగా మారిన భార్య అతనిపై పగ తీర్చుకోవడమే చూశాం. కానీ ఇందులో స్త్రీ గొప్పతనం ఉట్టిపడేలా ప్రేమ మాత్రమే ప్రతిబింబించింది. చాలా నార్మల్ గా అనిపించే కథ, బలంలేని సన్నివేశాలతో కూడిన రొటీన్, బోరింగ్ ఫస్టాఫ్ నుడిలో నిరుత్సహపరిచే అంశాలు కాగా ఆకట్టుకునే ఆఖరి 35 నిముషాల ఎమోషనల్ ట్రాక్, సంతృప్తినిచ్చే ముగింపు, నటీనటుల నటన మెప్పించే అంశాలు. మొత్తం మీద కమర్షియల్ ఎంటర్టైనర్లను ఇష్టపడే రెగ్యులర్ ఆడియన్సుకు, పూర్తి కొత్తదనం ఆశించే వాళ్లకు ఈ సినిమా అంతగా నచ్చకపోవచ్చు కానీ పాజిటివ్ వైబ్స్ ఉన్న ఎమోషనల్ డ్రామాలను ఇష్టపడే వాళ్లకు ఈ చిత్రం సరిపోతుంది.

123telugu.com Rating : 2.75/5

Reviewed by 123telugu Team

Click here for English Review