సమీక్ష : సిద్దార్థ – ఫరవాలేదనిపించిన ప్రయత్నం !

సమీక్ష : సిద్దార్థ – ఫరవాలేదనిపించిన ప్రయత్నం !

Published on Sep 17, 2016 3:58 PM IST
siddhartha review

విడుదల తేదీ : సెప్టెంబర్ 16, 2016

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

దర్శకత్వం : కె.వి. దయానంద్

నిర్మాత : దాసరి కిరణ్ కుమార్

సంగీతం : మణిశర్మ

నటీనటులు : సాగర్, రాగిణి నంద్వాని, సాక్షి చౌదరి

‘చక్రవాకం, మొగలి రేకులు’ వంటి ఎమోషనల్ డైలీ సీరియళ్ళలో బలమైన పాత్రల్లో నటించి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకుని తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన నటుడు సాగర్ మొదటిసారి హీరోగా పరిచయమవుతూ చేసిన సినిమా ‘సిద్దార్థ’. కె.వి. దయానంద్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ట్రైలర్లతోనే మంచి ఆసక్తిని రేకెత్తించి ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి హీరో సాగర్ ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ తో ఏ మేరకు మెప్పించాడో ఇప్పుడు చూద్దాం…

కథ :

సీమ ప్రాంతంలో ఫ్యాక్షన్ నైపథ్యమున్న కుటుంబంలో పుట్టిన సూర్య (సాగర్) కొన్ని కారణాల వల్ల మలేషియా వెళతాడు. అక్కడే అతనికి సహస్ర (రాగిణి అద్వాని) అనే అమ్మాయి పరిచయమవుతుంది. సూర్య సహస్రకు తన గతం తెలీనీకుండా తనని తాను సిద్దార్థగా పరిచయం చేసుకుంటాడు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో సూర్య తన తన చేదు గతాన్ని ముగించి సహస్రతో కొత్త, ప్రశాంతమైన జీవితం గడపాలన్న ఉద్దేశ్యంతో తన సమస్యలను పరిష్కరించుకోడానికి సొంత ఊరికి వెళతాడు.

కానీ అక్కడ సూర్య ఊహించని విధంగా తన ప్రేమను త్యాగం చేయాల్సి వస్తుంది. సహస్ర కూడా సూర్య మంచి కోసం అతనికి దూరమవుతుంది. సూర్య తన ప్రేమను ఎందుకు త్యాగం చేయాల్సి వచ్చింది ? అసలు అతని చేదు గతమేమిటి ? ప్రేమ అతన్ని ఎలా మార్చింది ? చివరికి సూర్య, సహస్రల ప్రేమ ఏమైంది? అన్నదే ఈ సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :

ఈ చిత్రంలో ప్రధాన ప్లస్ పాయింట్ అంటే చెప్పుకోవలసింది హీరో పాత్ర చేసిన ‘సాగర్’ గురించి, కథను క్లీన్ గా హ్యాండిల్ చేసిన దర్శకుడి గురించి. సీరియల్ నటుడిగా తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్టైన సాగర్ సినిమాలో సూర్య పాత్రలో చాలా బాగా ఒదిగిపోయి నటించాడు. చేదు గతం వెంటాడే మనిషి ఎలాంటి బాధను అనుభవిస్తాడు అనేదాన్ని చాలా స్పష్టంగా తన నటనలో చూపాడు. ఇక కథ పాతదే అయినప్పటికీ దర్శకుడు దయానంద్ తన కథనంతో సినిమాని కాస్త కొత్తగా చూపాడు.

మొదటి నుండి చివరి వరకూ కథను అర్థమయ్యేట్టు నడిపిన విధానం బాగుంది. మొదటి భాగంలో హీరో సాగర్, హీరోయిన్ రాగిణి నంద్వానిల మధ్య రొమాన్స్ బాగా ఆకట్టుకుంది. మొదటి భాగాన్ని ఎమోషనల్ గా ఉండే హీరో క్యారెక్టరైజేషన్ తో, లవ్ స్టోరీతో నడుపుతూ సెకండాఫ్ లో ఏం జరుగుతుందో అన్న ఆసక్తిని క్రియేట్ చేసి ఇంటర్వెల్ వేయడం బాగుంది. హీరోయిన్ పాత్రలో నటించిన రాగిణి నంద్వాని క్యూట్ గా, ఎమోషనల్ గా చాలా బాగా నటించింది. సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని కామెడీ సన్నివేశాలు అక్కడక్కడా నవ్వించాయి.

మైనస్ పాయింట్స్ :

మైనస్ పాయింట్స్ లో ముందుగా చెప్పుకోవలసింది సెకండా హాఫ్ కథనం గురించి. మొదటి భాగం మొత్తం హీరోని చాలా పవర్ ఫుల్ గా చూపించి, అతని పాత్ర మీద బోలెడు ఆశలు కల్పించి సెకండ్ హాఫ్ లో తేల్చేయడం నిరుత్సాహపరిచింది. మంచి నటుడైన సాగర్ ను సెకండ్ హాఫ్ లో క్లైమాక్స్ ముందు వరకూ పెద్దగా వాడకపోవడం బాగోలేదు. పైగా ఇంటర్వెల్ వరకూ బాగానే నడిచిన కథ సెకాండాఫ్ కు వచ్చేసరికి పూర్తిగా నెమ్మదించింది. కమర్షియల్, యాక్షన్ ఎంటర్టైనర్ అన్నారేగాని సినిమాలో పెద్దగా యాక్షన్ సీక్వెన్సులు లేకపోవడంతో కథనంలో దమ్ము మిస్సయింది.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగంలో దర్శకుడు దయానంద్ విషయానికొస్తే ఎమోషన్, రొమాన్స్ తో ఫస్ట్ హాఫ్ ను కాస్త కొత్తగా, ఆసక్తిగా నడిపాడు కానీ సెకండాఫ్ లో మాత్రం బోరింగ్ స్క్రీన్ ప్లే తో, రొటీన్ క్లైమాక్స్ తో కాస్త నిరుత్సాహానికి గురిచేశాడు. ఏదేమైనా హీరోగా నిలబడాలనుకున్న సాగర్ కు మాత్రం మంచి స్టార్ట్ ఇచ్చాడనే చెప్పాలి. ఇక మణిశర్మ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పాటల సంగీతం మెప్పించాయి. ఎస్ గోపాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ బాగుంది. నిర్మాత దాసరి కిరణ్ కుమార్ ఎక్కడా తగ్గకుండా సినిమాను చాలా రిచ్ గా నిర్మించాడు.

తీర్పు :

ఈ చిత్రంలో ఎమోషనల్ స్క్రీన్ ప్లేతో, హీరో హీరోయిన్ల మధ్య నడిచే మంచి రొమాన్స్ తో ఆసక్తిగా సాగిన ఫస్ట్ హాఫ్, హీరో పాత్రలో సాగర్ నటన మరియు దాసరి కిరణ్ కుమార్ నిర్మాణ విలువలు ప్రధాన ప్లస్ పాయింట్స్ కాగా హీరో పాత్రలో దూకుడు మిస్సై చప్పగా సాగిన సెకండాఫ్, రొటీన్ క్లైమాక్స్ వంటివి నిరుత్సాహపరిచే అంశాలు. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ ‘సిద్దార్థ’ చిత్రం హీరోగా మొదటి అడుగు వేసిన సాగర్ కు మంచి ఆరంభాన్ని ఇచ్చిన చిత్రమే కానీ మొత్తం మీద మాత్రం జస్ట్ ఓకే అనే స్థాయిలో ఉంది.

123telugu.com Rating : 2.75/5
Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు