పాటల సమీక్ష : స్పైడర్ – మహేష్ కెరీర్లో కొత్త తరహా ఆల్బమ్ !

పాటల సమీక్ష : స్పైడర్ – మహేష్ కెరీర్లో కొత్త తరహా ఆల్బమ్ !

Published on Sep 10, 2017 1:43 PM IST


సూపర్ స్టార్ మహేష్ బాబు, మురుగదాస్ ల కలయికలో రూపొందిన ‘స్పైడర్’ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 27న రిలీజ్ కానున్న ఈ సినిమా యొక్క ఆడియో నిన్ననే విడుదలైంది. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరైన హారీశ్ జైరాజ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. మరి ఈ పాటలు ఏ స్థాయిలో ఉన్నాయో ఇప్పుడు చూద్దాం…

1. పాట : బూమ్ Boom

గాయనీ గాయకులు : నిఖిత గాంధీ
రచన : రామ జోగయ్య శాస్త్రి

‘భూమ్ భూమ్ బామ్ బామ్’ అంటూ మొదలయ్యే ఈ పాట కథలో స్పైగా వ్యవహరించే మహేష్ ను ఎలివేట్ చేస్తూ నడుస్తుంటుంది. అల్ట్రా మోడరన్ గా అనిపిస్తున్న ఈ పాటలో సంగీత దర్శకుడు హారీశ్ జైరాజ్ అందించిన ట్యూన్స్ చాలా కొత్తగా ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇదొక మల్టీప్లెక్స్ సాంగ్ అనొచ్చు. పాత మాస్ పాటల ఫార్ములాకు చెక్ పెట్టడానికే ఈ ప్రయోగం అన్నట్టుంది. చాలా రోజుల క్రితమే వచ్చిన ఈ పాట ఏ క్లాస్ ఆడియన్సుకి నచ్చింది కానీ మాస్ ప్రేక్షలకు అంతగా ఎక్కలేదు. ఇక రామ జోగయ్య శాస్త్రి రాసిన ‘చట్టం షర్టు నలిగిపోతే చేసేస్తాడు ఇస్తిరీ, థీమ్ మ్యూజిక్ అక్కర్లేని మాసీ హీరోనే వీడు’ వంటి లిరిక్స్ బాగున్నాయి.

tring tring2. పాట : సిసిలియా సిసిలియా
గాయనీ గాయకులు : హరి చరణ్, శక్తి శ్రీ
రచన : రామ జోగయ్య శాస్త్రి

‘సిసిలియా సిసిలియా’ అంటూ సాగే ఈ రొమాంటిక్ సాంగ్ వినగానే నచ్చేలా ఉంది. హారీశ్ జైరాజ్ సంగీతం అయితే లైవ్ మ్యూజిక్ వింటున్నట్టే ఉంది. స్టార్ స్టేటస్ దక్కిన తరవాత మహేష్ కు ఈ రకం పాట పడలేదనే చెప్పాలి. స్క్రీన్ మీద చూస్తే ఈ సాంగ్ మరింత కనువిందు చేసేలా అనిపిస్తోంది. అంతేగాక మహేష్, రకుల్ ప్రీత్ ల మధ్య రొమాన్స్ కూడా కొత్తగా ఉండేలా ఉంది. హరి చరణ్, శక్తి శ్రీ గాత్రం చాలా బాగుంది. రామ్ జోగయ్య శాస్త్రి రాసిన లిరిక్స్ రొటీన్ రొమాంటిక్ పాటలకు భిన్నంగా ఉన్నాయి. ఆల్బమ్ లోని మంచి పాటల్లో ఈ పాట ఖచ్చితంగా ఉంటుందనొచ్చు.

3. పాట : హాలీ హాలీ disturb
గాయనీ గాయకులు : బ్రిజేష్ త్రిపాఠి శాండిల్య , హరిణి, జోగి సునీత
రచన : రామ జోగయ్య శాస్త్రి

‘పుచ్చకాయ పుచ్చకాయ పెదవి తీపి’ అనే ఈ పాట మాస్ ప్రేక్షకుల కోసం ప్రత్యేకం అనేలా ఉంది. ముఖ్యంగా ఫోక్ స్టైల్లో ఉన్న హరీశ్ జైరాజ్ ఫాస్ట్ బీట్ మ్యూజిక్, వేగంగా సాగే లిరిక్స్ రెండూ పర్ఫెక్ట్ గా సరిపోయి మంచి హుషారెత్తించేలా పాట తయారైంది. మధ్య మధ్యలో ‘అపరిచితుడు’ చిత్రంలోని ‘రండక రండక’ పాట గుర్తొచ్చినా ఈ పాట మాత్రం థియేటర్లో కూర్చొని చూస్తే బాగా ఎంజాయ్ చేసే విధంగా ఉంటుందనిపిస్తోంది. ముఖ్యంగా బ్రిజేష్ త్రిపాఠి శాండిల్య , హరిణి పాడిన స్టైల్ మళ్ళీ మళ్ళీ పాటను వినాలి అనేలా చేసింది. జోగయ్య శాస్త్రి సాహిత్యం కూడా బాగానే ఉంది. ఆల్బమ్ లోని బెస్ట్ పాటల్లో ఇది కూడా ఒకటవుతుంది.

dochesta4. పాట : అచ్చం తెలుగందం
గాయనీ గాయకులు : ప్రవీణ్ సైవి, క్రిస్టోఫర్ స్టాన్లే, సత్య ప్రకాష్
రచన : రామ జోగయ్య శాస్త్రి

‘అచ్చం తెలుగందం’ అంటూ సాగే ఈ పాట హీరో హీరోయిన్ ను వర్ణిస్తూ, పొగుడుతూ, తనలోని ప్రేమను చెప్పే సందర్భంలో వచ్చేదిలా ఉంది. ఈ పాట యువతకు బాగా నచ్చుతుంది. ప్రవీణ్ సైవి, క్రిస్టోఫర్ స్టాన్లే, సత్య ప్రకాష్ లు పాడిన విధానం కొత్తగా, హాయిగా అంజిపిస్తోంది. రామ జోగయ్య శాస్త్రి లిరిక్స్ కూడా క్యాచీగా ఉన్నాయి. పాట మొదలై ఎప్పుడు అయిపోయిందో తెలీనంత వినసొంపైన సంగీతం అందించారు హారీశ్ జైరాజ్. ఆల్బమ్ లోని మంచి పాటల వరుసలో ఈ పాట కూడా ఉంటుంది.

5. పాట : స్పైడర్ ఆన్ మిషన్ disturb

ప్రతి సినిమాకి థీమ్ మ్యూజిక్ ఉన్నట్టే ఈ ‘స్పైడర్’ చిత్రానికి కూడా ఈ ‘స్పైడర్ ఆన్ మిషన అనే థీమ్ మ్యూజిక్ ఉంది. ఆరంభంలో గ్లింప్స్ ఆఫ్ స్పైడర్ పేరుతో విడుదలైన చిన్నపాటి వీడియోతో పాటు వచ్చిన ఈ మ్యూజిక్ ప్రేక్షకుల్లోకి బాగా వెళ్ళిపోయింది. ఇప్పుడు సినిమా పేరు చెబితే ఈ థీమ్ గుర్తుకురాక మానదు. అంతలా రిజిస్టర్ అయిపోయిన ఈ థీమ్ సినిమాలో కీలక సన్నివేశాల్లో వస్తూ మరింతగా ఆకట్టుకోనుంది.

తీర్పు:

సాధారణంగా పెద్ద సినిమాలంటే పాటలు గొప్ప స్థాయిలో ఉండాలని ఆశిస్తారు ప్రేక్షకులు. ఇక అన్ని వర్గాల ప్రేక్షకుల్లో సమానమైన ఫాలోయింగ్ ఉన్న మహేష్ లాంటి హీరో సీనిమా అయితే ఆ అంచనాలు మరీ ఎక్కువగా ఉంటాయి. సంగీత దర్శకుడు హారీశ్ జైరాజ్ ఆ అంచనాలను అందుకోవాలని ప్రయత్నిస్తూనే కొత్తదనం కనబడేలా ప్రయోగం కూడా చేశారు. ఈ ఆల్బమ్ లోని పాటల్లో 1,2, 4 పాటలు క్లాస్ ఆడియన్సుకి ఎక్కువ నచ్చేలా ఉండగా 3వ పాటలో మాస్ డోస్ ఎక్కువగా కనబడుతోంది. మొత్తం మీద కొత్తదనం, ప్రయోగం కలగలిసి క్లాస్ ఆడియన్సుకి విపరీతంగా మాస్ ఆడియన్సుకి కొంచెం అటు ఇటుగా నచ్చేలా ఉన్న ఈ ఆల్బమ్ మహేష్ కెరీర్లోనే కొత్త తరహా ఆల్బమ్ అని చెప్పొచ్చు.

Click here for English Music Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు